వాతావరణ మార్పులతో నిద్రలేమి!

వాతావరణ మార్పులు తెస్తున్న అనర్థాలు కోకొల్లలు! తాజాగా మరో కొత్త విషయం వెలుగు చూసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు... ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను నిద్రకు దూరం చేస్తున్నట్టు కోపెన్‌హేగన్‌

Updated : 27 May 2022 11:13 IST

లండన్‌: వాతావరణ మార్పులు తెస్తున్న అనర్థాలు కోకొల్లలు! తాజాగా మరో కొత్త విషయం వెలుగు చూసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు... ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను నిద్రకు దూరం చేస్తున్నట్టు కోపెన్‌హేగన్‌ వర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. వాతావరణ మార్పుల పర్యవసానంగా... నిద్ర నాణ్యత తగ్గుతోందని, 2099 నాటికి ఒక్కొక్కరు ఏడాదికి 50 నుంచి 58 గంటల పాటు నాణ్యమైన నిద్రకు దూరమవుతారని నిపుణులు లెక్కగట్టారు. ముఖ్యంగా అల్పాదాయ దేశాలవారితో పాటు... ప్రపంచ వ్యాప్తంగా వృద్ధులు, మహిళలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు వారు గుర్తించారు. వాతావరణ మార్పుల కారణంగా మనిషి ప్రవర్తన, జీవ సంబంధ స్థితిగతులు ఎలా ఉంటాయన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు. దీంతో కోపెన్‌హేగన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై దృష్టి సారించారు. అధ్యయనంలో భాగంగా 68 దేశాలకు చెందిన 47 వేల మంది వయోజనుల రాత్రిపూట నిద్రకు సంబంధించిన రికార్డులను పరిశోధకులు విశ్లేషించారు. వాతావరణంలో ఉష్ణోగ్రతలు మారుతున్నప్పుడు... వారి కునుకులో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నది గమనించారు. రాత్రివేళ నిద్రకు సంబంధించి స్లీప్‌ ల్యాబ్స్‌ ఇచ్చిన మొత్తం 70 లక్షల నివేదికలను వారు పరిశీలించారు. ‘‘సగటు కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే.. నిద్ర పట్టడం ఆలస్యమవుతుంది. తొందరగా మెలకువ వచ్చేస్తుంది’’ అని పరిశోధనకర్త కెల్టాన్‌ మైనర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని