ఒంటికి రక్తం పూసుకుని.. చనిపోయినట్టు నటించి

ఒక్కొక్కర్నీ తుపాకీతో కాల్చుకుంటూ వస్తున్న వ్యక్తి కళ్లెదుటే ఉండి... తర్వాత మనల్ని కూడా కాల్చేస్తాడని తెలిసినప్పుడు ఏమనిపిస్తుంది! అసంకల్పితంగానే గట్టిగా అరవడమో, ‘వద్దు వద్దు.. ప్లీజ్‌.. కాల్చొద్దు’ అని ప్రాధేయపడటమో జరుగుతుంది. టెక్సాస్‌ పాఠశాలలో మంగళవారం దుండగుడు కాల్పులు జరుపుతున్నప్పుడు మాత్రం... 11 ఏళ్ల బాలిక సమయస్ఫూర్తితో వ్యవహరించి తన ప్రాణాలు దక్కించుకుంది. పక్కన రక్తపు మడుగులో పడి ఉన్న స్నేహితురాలి నెత్తుటిని ఒంటికి అద్దుకుని, తాను

Published : 28 May 2022 05:11 IST

టెక్సాస్‌ కాల్పుల నుంచి తప్పించుకున్న 11 ఏళ్ల బాలిక

టెక్సాస్‌: ఒక్కొక్కర్నీ తుపాకీతో కాల్చుకుంటూ వస్తున్న వ్యక్తి కళ్లెదుటే ఉండి... తర్వాత మనల్ని కూడా కాల్చేస్తాడని తెలిసినప్పుడు ఏమనిపిస్తుంది! అసంకల్పితంగానే గట్టిగా అరవడమో, ‘వద్దు వద్దు.. ప్లీజ్‌.. కాల్చొద్దు’ అని ప్రాధేయపడటమో జరుగుతుంది. టెక్సాస్‌ పాఠశాలలో మంగళవారం దుండగుడు కాల్పులు జరుపుతున్నప్పుడు మాత్రం... 11 ఏళ్ల బాలిక సమయస్ఫూర్తితో వ్యవహరించి తన ప్రాణాలు దక్కించుకుంది. పక్కన రక్తపు మడుగులో పడి ఉన్న స్నేహితురాలి నెత్తుటిని ఒంటికి అద్దుకుని, తాను కూడా చనిపోయినట్టు నటించింది!

ఏం జరిగిందంటే...

11 ఏళ్ల మియా సెరిల్లో... యువాల్టీ నగరంలోని రాబ్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతోంది. ఎప్పట్లాగే మంగళవారం స్నేహితులతో కలిసి సరదాగా బడికి వెళ్లింది. తరగతి గదిలో ఉండగా... సాల్వడార్‌ రామోస్‌ అనే 18 ఏళ్ల యువకుడు తుపాకీతో వచ్చి టీచర్‌ను, కొంతమంది విద్యార్థులను కాల్చి పారేశాడు. తనను కూడా కాల్చి చంపేస్తాడని భావించిన మియా... పక్కనే రక్తపు మడుగులో పడి ఉన్న స్నేహితురాలి నెత్తుటిని ఒంటికి అద్దుకుని, కింద కూలబడి, చనిపోయినట్టు నటించింది! దుండగుడు వెళ్లిపోయిన వెంటనే... అప్పటికే మృతిచెందిన టీచర్‌ చేతిలోని ఫోన్‌ తీసుకుని 911 నంబరుకు కాల్‌ చేసింది. కాల్పుల సంగతి తెలియగానే మియా తండ్రి మిగుల్‌ సెరిల్లో పరుగుపరుగున పాఠశాలకు చేరుకున్నారు. వచ్చీ రావడంతోనే... రక్తపు మరకలతో ఉన్న కుమార్తెను పోలీసులు బయటకు తీసుకొస్తుండటం చూడటంతో ఆయనకు గుండె ఆగినంత పనైంది! పరుగున వెళ్లి కుమార్తెను దగ్గర తీసుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని ఆమెను స్కూలు బస్సులో ఎక్కించారు. దీంతో మిగుల్‌ బస్సు కిటికీ వద్దకు వచ్చి కుమార్తెతో మాట్లాడాడు. చిన్నారి చేసిన పని తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. దుండగుడు కాల్పులు జరిపినప్పుడు తూటాల శకలాలు గుచ్చుకోవడంతో మియా స్వల్పంగా గాయపడింది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందించారు. అదేరోజు సాయంత్రం ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. ఇదే బడిలో చదువుతున్న మియా చెల్లి కూడా ప్రాణాలతో బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని