శ్రీలంకలో 50వ రోజుకు చేరిన ప్రజాగ్రహం

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ ప్రజలు చేపట్టిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన శనివారానికి 50వ రోజుకు చేరుకుంది. నిరసన ప్రదర్శనలను మరింత తీవ్రం చేయనున్నట్లు

Updated : 29 May 2022 06:08 IST

గొటబాయ రాజీనామాకు డిమాండ్‌

ఆందోళన తీవ్రం చేయడానికి నిర్వాహకుల నిర్ణయం

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ ప్రజలు చేపట్టిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన శనివారానికి 50వ రోజుకు చేరుకుంది. నిరసన ప్రదర్శనలను మరింత తీవ్రం చేయనున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. దివాళా దిశగా వెళుతున్న శ్రీలంకలో ఆహారం, ఇంధనం, ఔషధాలు, వంటగ్యాస్‌ వంటి నిత్యావసరాల కొరత తీవ్రంగా ఉంది. చివరికి టాయిలెట్‌ పేపర్‌, అగ్గిపుల్లలకు సైతం కొరత ఏర్పడింది. నిల్వలు పరిమితమై పోవడంతో వాటికోసం ప్రజలు పెద్ద వరుసల్లో బారులు తీరుతూ నిరీక్షించాల్సి వస్తోంది. దేశంలో నెలల తరబడి ఇలాంటి దృశ్యాలు ఎన్నో కనిపిస్తున్నాయి. మరోవైపు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రాజకీయ అశాంతికి దారితీసింది. ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆయన కార్యాలయ ప్రవేశద్వారం వద్ద రోజుల తరబడి ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గొటబాయ సోదరుడు మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అధ్యక్షుడు కూడా పదవి నుంచి దిగిపోవాలన్న డిమాండ్‌ తీవ్రంగా ఉన్నప్పటికీ ఆయన తిరస్కరిస్తూ వస్తున్నారు. ఏప్రిల్‌ 9న కొలంబోలోని దేశాధ్యక్షుడి కార్యాలయం ప్రవేశద్వారాన్ని దిగ్బంధించడం ద్వారా ప్రజలు ఆందోళన ప్రారంభించారు. క్రమేపీ నిరసనలు తీవ్రమయ్యాయి. పలుచోట్ల రాజకీయ నాయకులపై దాడులు కూడా జరిగాయి. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. 10 మంది ప్రాణాలు కోల్పోగా, కర్ఫ్యూ కూడా విధించాల్సి వచ్చింది. నిరసనలను అడ్డుకోవడానికి పలు సందర్భాల్లో పోలీసులు బలప్రయోగానికి కూడా దిగారు.

15 వేల లీటర్ల కిరోసిన్‌ పంపిన భారత్‌

జాఫ్నా ప్రాంతంలోని 700 మంది మత్స్యకారుల సహాయార్ధం భారత్‌ 15,000 లీటర్ల కిరోసిన్‌ను శనివారం శ్రీలంకకు పంపించింది. వారి మరబోట్లకు కూడా వినియోగించేందుకు వీలుగా ఈ సాయం అందించినట్లు జాఫ్నాలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని