పది దాటితే పెళ్లి వేడుకల బంద్‌

రాత్రి పది గంటలు దాటిన తర్వాత వివాహ వేడుకల నిర్వహణను పాకిస్థాన్‌ సర్కారు నిషేధించింది. దేశ వ్యాప్తంగా రాత్రి 8.30 గంటలకల్లా దుకాణాలు, మార్కెట్లను బంద్‌ చేయాలని వ్యాపారులను ఆదేశించింది. ప్రతి శనివారం ప్రభుత్వ కార్యాలయాలకు

Updated : 09 Jun 2022 08:59 IST

 8.30 దాటితే మార్కెట్‌కు తాళం

విద్యుత్‌ ఆదాకు పాకిస్థాన్‌ ఆంక్షలు

ఇస్లామాబాద్‌: రాత్రి పది గంటలు దాటిన తర్వాత వివాహ వేడుకల నిర్వహణను పాకిస్థాన్‌ సర్కారు నిషేధించింది. దేశ వ్యాప్తంగా రాత్రి 8.30 గంటలకల్లా దుకాణాలు, మార్కెట్లను బంద్‌ చేయాలని వ్యాపారులను ఆదేశించింది. ప్రతి శనివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. తీవ్ర విద్యుత్‌ కొరతతో సతమతమవుతున్న పాకిస్థాన్‌... కరెంటును ఆదా చేసేందుకు ఈ చర్యలు చేపట్టింది. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వాన జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇస్లామాబాద్‌లో బుధవారం నుంచే ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయని జియో న్యూస్‌ తెలిపింది. వీటిని కఠినంగా అమలు చేసేందుకు పోలీసు, జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు వచ్చాయని, ఆంక్షలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక అధికారులు హెచ్చరించారు. దేశంలో 22 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుండగా, డిమాండ్‌ 26 వేల మెగావాట్ల మేర ఉంటోందని విద్యుత్‌శాఖ మంత్రి ఖుర్రం దస్తగిర్‌ పేర్కొన్నారు.

బంకుల వద్ద బారులు...

మరోవైపు, పాకిస్థాన్‌లో చమురు కష్టాలు కూడా తీవ్రమయ్యాయి. ప్రధాని షరీఫ్‌ ఏఆర్‌వై న్యూస్‌తో మాట్లాడుతూ- చమురు, గ్యాస్‌ కొనుగోలు చేసేందుకు తమ వద్ద తగినన్ని నిధులు లేవని చెప్పారు. ఈ క్రమంలోనే.. ఇంధన ధరలను పెంచక తప్పడంలేదని ఆర్థిక మంత్రి మిఫ్తాహ్‌ ఇస్మాయిల్‌ వెల్లడించారు. దీంతో ప్రజలు పెట్రోలు బంకుల వద్దకు పరుగులు తీశారు. కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్‌ తదితర ప్రాంతాల్లో బుధవారం పెద్ద సంఖ్యలో జనం బారులుతీరి కనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని