Gun Culture: మాకొద్దీ తుపాకీ సంస్కృతి

తుపాకీ సంస్కృతి తమకు వద్దే వద్దంటూ అమెరికన్లు గళమెత్తారు. అభంశుభం తెలియని పసిమొగ్గలను కాల్చి చంపుతుండటాన్ని తీవ్రంగా నిరసించారు.

Updated : 12 Jun 2022 09:38 IST

గళమెత్తిన అమెరికన్లు

వాషింగ్టన్‌: తుపాకీ సంస్కృతి తమకు వద్దే వద్దంటూ అమెరికన్లు గళమెత్తారు. అభంశుభం తెలియని పసిమొగ్గలను కాల్చి చంపుతుండటాన్ని తీవ్రంగా నిరసించారు. ప్రాణాలు తీస్తున్న ఆయుధాలను నియంత్రించాల్సిందేనంటూ చట్టసభ్యులను డిమాండ్‌ చేశారు. టెక్సాస్‌లోని యువాల్డీ మొదలు న్యూయార్క్‌లోని బఫెలో వరకూ ఇటీవల చోటుచేసుకున్న కాల్పులకు వ్యతిరేకంగా కదం తొక్కారు. వాషింగ్టన్‌లోని స్మారక మైదానం ‘నేషనల్‌ మాల్‌’ వద్ద శనివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. ‘మార్చ్‌ ఫర్‌ అవర్‌ లైవ్స్‌’ పేరున చేపట్టిన ఈ ర్యాలీకి... జోరు వానను సైతం లెక్కచేయక సుమారు 50 వేల మంది తరలివచ్చారు. తుపాకీ నియంత్రణకు పార్లమెంటు చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్‌ చేశారు. ‘‘చనిపోయిన చిన్నారులను తిరిగి తీసుకురాలేం. కానీ, సెనేటర్లను వెనక్కు తీసుకురాగలం. కాబట్టి తుపాకీ నియంత్రణకు ఓటేయండి’’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. 21 ఏళ్ల వయసులోపు వారికి తుపాకీలు విక్రయించరాదంటూ బైడెన్‌ సర్కారు తీసుకొచ్చిన ‘తుపాకీ నియంత్రణ బిల్లు’ చట్టంగా మారాలంటే... సెనేట్‌లో రిపబ్లికన్ల మద్దతు చాలా అవసరం. ఈ నేపథ్యంలో బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలంటూ ‘నేషనల్‌ మాల్‌’ వద్ద ప్రజలు భారీ ప్రదర్శన చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకొంది. 


పసిప్రాణాలకు పుస్తక నివాళి...

పచ్చగడ్డిపై పుస్తకాలేంటని అనుకుంటున్నారా? అమెరికాలో తుపాకీ హింసకు బలైన 2,280 మంది చిన్నారులకు ప్రతీకలివి. తుపాకీ నియంత్రణ బిల్లుకు మద్దతు తెలపాలని సెనేటర్లను డిమాండ్‌ చేస్తూ... శనివారం వాషింగ్టన్‌లోని స్మారక మైదానం ‘నేషనల్‌ మాల్‌’ వద్ద అమెరికన్లు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భాగంగా ‘క్యాపిటల్‌’ భవనం సమీపంలో 2,280 పుస్తకాలు, విరిగిన పెన్సిళ్లను ఇలా ఏర్పాటు చేశారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు