వినోద రంగంలోని పిల్లలకు రక్షణ వ్యవస్థ

వినోద రంగంలో బాలనటుల హక్కులను రక్షించేందుకు జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. షూటింగుల సమయంలో బాలలు శారీరక, మానసిక ఒత్తిడికి గురికాకుండా ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని నిర్మాతలను

Updated : 26 Jun 2022 05:45 IST

బాలనటుల హక్కుల పరిరక్షణకు ముసాయిదా చట్టం విడుదల

దిల్లీ: వినోద రంగంలో బాలనటుల హక్కులను రక్షించేందుకు జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. షూటింగుల సమయంలో బాలలు శారీరక, మానసిక ఒత్తిడికి గురికాకుండా ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని నిర్మాతలను ఆదేశించింది. టీవీ కార్యక్రమాలు, సీరియళ్లు, రియాలిటీ షోలు, వార్తలు, సమాచార మాధ్యమాలు, సినిమాలు, ఓటీటీ వేదికలు, సామాజిక మాధ్యమాలు, ప్రకటనలతోపాటు అన్ని వాణిజ్య, వినోద రంగాల్లో పనిచేసే బాలలు అందరికీ వర్తించేలా ముసాయిదా చట్టాన్ని తీసుకొచ్చింది. బాలల హక్కుల రక్షణకు వివిధ చట్టాలు ఉన్నా... పెద్దవాళ్ల ఆధిపత్యం ఉండే వినోదరంగంలోని బాలనటుల కోసం ప్రత్యేక నిబంధనలు లేకపోవడంతోనే ఎన్‌సీపీసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకుంది. ఈ మేరకు నియమించిన కమిటీ 2011లో ఇచ్చిన మార్గదర్శకాలకు వివిధ సవరణలు చేస్తూ వచ్చారు. తుది ముసాయిదాలో ఏముందంటే..

* పిల్లలను షూటింగ్‌కు తీసుకెళ్లే ముందు జిల్లా మేజిస్ట్రేట్‌ అనుమతి తీసుకోవాలి. వారిని దూషణలు, పీడనకు గురికాకుండా చూస్తామంటూ హామీ ఇవ్వాలి.

* బాలలు వరుసగా 27 రోజులు పని చేయకూడదు. రోజుకు ఒక షిఫ్టు మాత్రమే పనిచేయాలి. ప్రతి మూడు గంటలకు ఒకసారి విశ్రాంతి ఇవ్వాలి.

* పిల్లల ఆదాయంలో 20% మొత్తాన్ని వారి మైనారిటీ తీరాక వారికి అందేలా జాతీయ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలి.

* పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకం కలగరాదు. షూటింగుల సమయంలో వారికి ప్రైవేటు ట్యూటర్‌ను నియమించాలి.

* పిల్లల శారీరక, మానసిన పురోగతిపై ప్రభావం చూపే పాత్రలను వారికి ఇవ్వకుండా చూసుకోవాలి. మద్యం, ధూమపానం అలవాటు పడేలా ఉండే, ఇతర అసాంఘిక కార్యకలాపాలు ఉండే సన్నివేశాల్లో వారిని నటింపజేయకూడదు.

* దుస్తులు మార్చుకోవడానికి పిల్లలకు ప్రత్యేక గదులు ఉండాలి.

* షూటింగ్‌ వాతావరణం ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలి. చర్మానికి హాని కలిగించే లైట్ల వెలుగులకు బాలలను దూరంగా ఉంచాలి. హానికారక మేకప్‌ కూడా వాడొద్దు.

* నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యల్లో భాగంగా జైలు శిక్షలతోపాటు భారీ జరిమానాలు ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని