ఒడెసాపై విరుచుకుపడ్డ రష్యా

ఉక్రెయిన్‌పై రష్యా దాడుల తీవ్రతను పెంచింది. లేదు లేదంటూనే జనావాసాలపైకి క్షిపణులను ప్రయోగిస్తోంది. ఒడెసా తీర ప్రాంతమే లక్ష్యంగా శుక్రవారం తెల్లవారుజామున దాడులకు పాల్పడింది. అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలోని సెర్హివ్కా

Published : 02 Jul 2022 05:13 IST

క్షిపణుల ధాటికి 21 మంది మృతి
38 మందికి తీవ్రగాయాలు

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల తీవ్రతను పెంచింది. లేదు లేదంటూనే జనావాసాలపైకి క్షిపణులను ప్రయోగిస్తోంది. ఒడెసా తీర ప్రాంతమే లక్ష్యంగా శుక్రవారం తెల్లవారుజామున దాడులకు పాల్పడింది. అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలోని సెర్హివ్కా పట్టణంలో క్షిపణుల ధాటికి 21 మంది మృత్యువు పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో 38 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాస్కో ప్రయోగించిన కెహెచ్‌-22 క్షిపణులు ఓ అపార్టుమెంటుతో పాటు రెండు శిబిరాలపైకి దూసుకెళ్లడంలో ప్రాణ నష్టం సంభవించినట్టు ఉక్రెయిన్‌ అధ్యక్ష భవనం వెల్లడించింది. రష్యా ఒక ఉగ్రవాద దేశమని, యుద్ధక్షేత్రంలో ఉక్రెయిన్‌ సేనల చేతిలో పరాభవాన్ని భరించలేకే... సామాన్య ప్రజానీకంపై దాడులకు తెగబడుతోందని మండిపడింది. మరోవైపు- తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతం లుహాన్స్క్‌లో భీకర పోరు కొనసాగుతోంది. లీసీచాన్స్క్‌ నగరాన్ని చుట్టుముట్టి, అక్కడున్న చమురు శుద్ధి కర్మాగారాన్ని స్వాధీనం చేసుకునేందుకు పుతిన్‌ సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు లుహాన్స్క్‌ గవర్నర్‌ సెర్హి హైదాయ్‌ పేర్కొన్నారు. ఫిరంగి దాడులకు తాళలేక అక్కడ వందల మంది ప్రజలు నేలమాళిగల్లో తలదాచుకున్నట్టు చెప్పారు. అయితే, తిరుగుబాటుదారులతో కలిసి ఇప్పటికే తాము లీసీచాన్స్క్‌ నగరంతో పాటు చమురు శుద్ధి కార్మాగారాన్ని, జెలటిన్‌ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నట్టు రష్యా రక్షణశాఖ అధికార ప్రతినిధి ఇగోర్‌ కొనషెంకోవ్‌ వెల్లడించారు. ఖర్కివ్‌, దొనెట్స్క్‌ ప్రాంతాల్లో మాస్కో బలగాలు గత 24 గంటల్లో చేపట్టిన దాడుల్లోనూ మొత్తం 8 మంది మృతిచెందారని ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

సూర్యోదయానికి ముందే..

నల్ల సముద్రంలోని స్నేక్‌ ద్వీపం నుంచి రష్యా గురువారం తన సేనలను ఉపసంహరించుకుంది. దీంతో ఉక్రెయిన్‌లోనే అత్యంత భారీ నౌకాశ్రయమున్న ఒడెసాకు ముప్పు తొలగిపోయిందని యుద్ధ నిపుణులు విశ్లేషించారు.  దీంతో పుతిన్‌ సేనలు పనిగట్టుకుని శుక్రవారం సూర్యోదయానికి ముందే ఒడెసాపై క్షిపణులను ప్రయోగించాయి. నల్ల సముద్ర ప్రాంతంలో రష్యా కార్యకలాపాలను తాము నిరోధించగలిగామని.. దశలవారీగా పుతిన్‌ సేనలను తమ సముద్రం, భూభాగం, గగనతలం నుంచి తరిమివేస్తామని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని