కష్టజీవులను అందలమెక్కించే కర్మభూమి బ్రిటన్‌

వివిధ రంగాల్లో విజయ శిఖరాలను అధిరోహించిన భారత సంతతి వారికి అవార్డులిచ్చి సత్కరించిన సభలో బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌(42) తన భారతీయ మూలాల గురించీ, ఘన భారతీయ వారసత్వం గురించీ సగర్వంగా చాటుకున్నారు.

Updated : 03 Jul 2022 06:52 IST

ఆర్థిక మంత్రి రిషి సునాక్‌

లండన్‌: వివిధ రంగాల్లో విజయ శిఖరాలను అధిరోహించిన భారత సంతతి వారికి అవార్డులిచ్చి సత్కరించిన సభలో బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌(42) తన భారతీయ మూలాల గురించీ, ఘన భారతీయ వారసత్వం గురించీ సగర్వంగా చాటుకున్నారు. లండన్‌ సమీపంలోని ఫెయిర్‌ మాంట్‌లో జరిగిన భారత్‌-బ్రిటన్‌ అవార్డుల ప్రదానోత్సవ సభలో మాట్లాడుతూ తూర్పు ఆఫ్రికా నుంచి బ్రిటన్‌కు వలస వచ్చి స్థిరపడిన తమ కుటుంబం కష్టించి పనిచేసిపైకి ఎదిగిన విధాన్ని వివరించారు. తన తల్లికి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తాత, అమ్మమ్మ తూర్పు ఆఫ్రికా నుంచి బ్రిటన్‌కు వలసవచ్చారని ఆయన వెల్లడించారు. రిషి తండ్రి యశ్‌ వీర్‌ బ్రిటిష్‌ జాతీయ ఆరోగ్య సంస్థలో వైద్యుడిగా పనిచేశారు. ఆయన తల్లి సొంతగా మందుల దుకాణం నడిపేవారు. వలస వచ్చిన వారు గొప్ప వ్యాపారవేత్తలుగా, గొప్ప శాస్త్రజ్ఞులుగా, గొప్ప కళాకారులుగా ఎదగాలనుకుంటే, వారు కష్టపడితే చాలు వారి కలలను పండించే కర్మభూమి బ్రిటన్‌ అని సునాక్‌ ప్రస్తుతించారు. తమది సంపన్న కుటుంబం కాదనీ, తన తండ్రి ప్రభుత్వ ఆరోగ్య సర్వీసులో వైద్యునిగా పనిచేస్తూనే సాయంకాలాల్లో, వారాంతపు సెలవు దినాల్లో ఇతర ఉద్యోగాలు చేసేవారని తెలిపారు. తెల్లవారుఝాము వరకు రోగుల రికార్డులను తయారుచేస్తూ రిఫరల్‌ లేఖలు రాసే వారని సునాక్‌ వివరించారు. ప్రతి రోజూ పాఠశాల ముగిశాక తన తల్లి దుకాణానికి వెళ్లి ఖాతాదారులకు సేవలు అందించేవాడిననీ, వారి ఇళ్లకు మందులు బట్వాడా చేసే వాడిననీ గుర్తుచేసుకున్నారు. భారత్‌, బ్రిటన్‌ దేశాల మధ్య ప్రతిభావంతుల ఆదానప్రదానాలు జరగాలని సునాక్‌ ఆకాంక్షించారు. రెండు దేశాలు సమాన స్థాయిలో భాగస్వాములు కావాలన్నారు. సభలో అదర్‌ పూనావాలాను ప్రస్తావించి కోవిషీల్డ్‌ టీకా రెండు దేశాల నవీకరణ సత్తాకు నిదర్శనమని పేర్కొన్నారు. సునాక్‌ భార్య, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తి సభలో భర్త సరసనే ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని