Updated : 03 Jul 2022 06:52 IST

ముమ్మరంగా రష్యా దాడులు

కీవ్‌: ఉక్రెయిన్‌లోని లీసీచాన్స్క్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై రష్యా బలగాల దాడులు ముమ్మరంగా కొనసాగాయి. లుహాన్స్క్‌ ప్రావిన్సులో ఉక్రెయిన్‌ పట్టు ఇంకా కొనసాగుతున్న ఈ ప్రాంతాలపై పూర్తి నియంత్రణ సాధించాలని పుతిన్‌ సైన్యం గట్టి సంకల్పంతో ఉంది. ఒడెసా సమీపంలోని నివాస భవంతిపై రష్యా గగనతల దాడులు నిర్వహించి, 21 మంది మరణానికి కారణమైన ఘటనలో ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. ఆయుధాలు వచ్చిన మార్గాన్ని కచ్చితంగా గుర్తించడంపై వారు దృష్టి సారించారు. యుద్ధ నేరానికి బాధ్యులెవరో నిర్దిష్టంగా తేల్చనున్నట్లు ఉక్రెయిన్‌ వర్గాలు తెలిపాయి. కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే ఆయుధాలకు కొరత తలెత్తడంతో ఇతరవాటిని రష్యా వాడుతోందని బ్రిటన్‌ రక్షణ శాఖ చెబుతోంది.

జి-7కు హెచ్చరికగానే ఆ దాడులు

కీవ్‌లో నివాస భవనాల మీద, క్రెమెన్‌చక్‌ నగరంలో ఒక మాల్‌పైనా రష్యా క్షిపణి దాడులు చేయడం కాకతాళీయం కాదు. ఐరోపా సమాఖ్య (ఈయూ)లో ఉక్రెయిన్‌ను చేర్చుకోవాలని ఈయూ నిర్ణయించిన మూడు రోజులకే కీవ్‌పై రష్యా క్షిపణులు వచ్చిపడి ఆరుగురి మరణానికి కారణమయ్యాయి. రాజధాని కీవ్‌పై దాడి జరిగిన మరుసటి రోజే జర్మనీలో జి-7 దేశాల నాయకులు సమావేశమై ఉక్రెయిన్‌కు మరింత సహాయం చేయాలని చర్చించారు. ఆ సమయంలోనే క్రెమెన్‌చక్‌ మాల్‌పై రష్యా క్షిపణులు విరుచుకుపడి 19 మంది పౌరుల ప్రాణాలు తీశాయి. ఆ తరువాత ఒడెసాను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులకు మాస్కో దిగింది. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్నా- రష్యా వాటిని ఖాతరు చేయడం లేదని ఈ దాడులు నిరూపిస్తున్నాయి. ఏప్రిల్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌తో కలసి పాత్రికేయుల సమావేశంలో ప్రసంగించి గంటైనా గడవకముందే రష్యా క్షిపణి దాడి చేసిన విషయం తెలిసిందే.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts