Cancer Free: ప్రాణం పోసిన ప్రయోగాత్మక ఔషధం

నీ ఒంట్లో క్యాన్సర్‌ ముదిరిపోయింది! కొద్ది నెలలు మాత్రమే జీవిస్తావు..!! కొన్నేళ్ల కిందట వైద్యులు ఆమెతో అన్న మాటలివి. దీంతో ఆమె ఒక్కసారిగా తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ఇప్పుడు ఆమె వేడుక చేసుకుంటున్నారు. కారణం.. నీ

Updated : 05 Jul 2022 07:25 IST

క్యాన్సర్‌ను జయించిన భారత సంతతి మహిళ

లండన్‌: నీ ఒంట్లో క్యాన్సర్‌ ముదిరిపోయింది! కొద్ది నెలలు మాత్రమే జీవిస్తావు..!! కొన్నేళ్ల కిందట వైద్యులు ఆమెతో అన్న మాటలివి. దీంతో ఆమె ఒక్కసారిగా తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ఇప్పుడు ఆమె వేడుక చేసుకుంటున్నారు. కారణం.. నీ శరీరంలో క్యాన్సర్‌ జాడలేదని డాక్టర్లు చెప్పడమే. ప్రయోగాత్మకంగా ఇచ్చిన ఇమ్యునోథెరపీ ఔషధం సత్ఫలితమివ్వడంతో.. మోడువారిన ఆమె జీవితం మళ్లీ కొత్త చిగురులు తొడిగింది. నిర్వేదం స్థానంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. భారత సంతతికి చెందిన జాస్మిన్‌ డేవిడ్‌ బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో స్థిరపడ్డారు. తన రొమ్ములో గడ్డ ఉన్నట్లు 2017లో ఆమె గమనించారు. పరీక్షల్లో అది రొమ్ము క్యాన్సర్‌ అని తేలింది. చాలా వేగంగా వ్యాపించే ‘ట్రిపుల్‌ నెగెటివ్‌’ రకం బారిన ఆమె పడినట్లు వైద్యులు గుర్తించారు. ఆరు నెలల పాటు కీమోథెరపీ చికిత్స ఇచ్చారు. 2018లో శస్త్రచికిత్స ద్వారా ఆమె రొమ్మును తొలగించారు. 15 సైకిళ్ల మేర రేడియోథెరపీ ఇచ్చారు. ఫలితంగా జాస్మిన్‌ శరీరం నుంచి క్యాన్సర్‌ తొలగిపోయింది. దీంతో ఆమె బాధ మటుమాయమైంది.  

వీడని పీడ..

జాస్మిన్‌కు క్యాన్సర్‌ తిరగబెట్టినట్లు 2019లో వైద్యులు గుర్తించారు. ఈసారి ఆ వ్యాధి.. ఊపిరితిత్తులు, లింఫ్‌ నోడ్‌లు, ఛాతి ఎముకకూ వ్యాపించినట్లు గమనించారు. ఏడాది కన్నా తక్కువకాలమే జీవిస్తావంటూ పిడుగులాంటి వార్తను ఆమె చెవిన వేశారు. దీంతో ఆమె నైరాశ్యంలోకి జారిపోయారు.

రెండు నెలల అనంతరం జాస్మిన్‌ ఎదుట కొందరు పరిశోధకులు ఓ ప్రతిపాదన ఉంచారు. ఒక ఔషధంపై నిర్వహిస్తున్న క్లినికల్‌ ప్రయోగంలో భాగస్వామి కావాలని కోరారు. మరో మార్గం లేకపోవడంతో.. వారి ప్రతిపాదనకు ఆమె సమ్మతించారు. ఇందులో భాగంగా జాస్మిన్‌కు అటెజోలిజుమాబ్‌ అనే ఇమ్యునోథెరపీ ఔషధాన్ని ఒక ప్రయోగాత్మక మందుతో కలిపి ఇచ్చారు. ఇంజెక్షన్‌ రూపంలో మూడు వారాలకోసారి దీన్ని అందించారు. చికిత్స కొనసాగుతుండగానే 2020 ఫిబ్రవరిలో ఆమె తన 50వ జన్మదినోత్సవాన్ని జరుపుకొన్నారు.  

2021 జూన్‌ నాటికి జాస్మిన్‌ శరీరంలో క్యాన్సర్‌ కణాలు పెద్దగా లేవని స్కాన్లలో తేలింది. దీంతో ఆమె ఆ వ్యాధిని జయించినట్లుగా వైద్యులు ప్రకటించారు. అయినా వచ్చే ఏడాది డిసెంబరు వరకూ చికిత్స కొనసాగుతుంది. ‘‘నాపై ఈ ప్రయోగం నిర్వహిస్తామని పరిశోధకులు చెప్పినప్పుడు.. అది ఫలిస్తుందన్న భరోసా నాకు లేదు. అయితే భావితరాల కోసం నా శరీరాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నా. చికిత్స మొదలయ్యాక తలనొప్పితోపాటు తీవ్ర జ్వరం వచ్చేది. క్రమంగా నా శరీరం చికిత్సకు స్పందించడం మొదలుపెట్టింది’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ సెప్టెంబరులో.. వివాహ 25వ వార్షికోత్సవాన్ని జరుపుకొనేందుకు జాస్మిన్‌ ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని