రాజకీయ నేతలు ఆయుర్దాయంలోనూ సంపన్నులే!

సమాజంలో సంపన్న - పేద వర్గాల మధ్య ఆదాయంలోనే కాకుండా ఆయుర్దాయంలోనూ అంతరాలు ఎక్కువగానే ఉంటున్నాయని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది. ఈమేరకు అమెరికాలో ఆదాయపరంగా

Published : 07 Jul 2022 04:13 IST

 11 అధికాదాయ దేశాల్లో అధ్యయనం

ఆక్స్‌ఫర్డ్‌, మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయాల పరిశోధకుల వెల్లడి

లండన్‌: సమాజంలో సంపన్న - పేద వర్గాల మధ్య ఆదాయంలోనే కాకుండా ఆయుర్దాయంలోనూ అంతరాలు ఎక్కువగానే ఉంటున్నాయని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది. ఈమేరకు అమెరికాలో ఆదాయపరంగా అత్యున్నత స్థాయిలో ఉన్న 1% మంది.. అట్టడుగున ఉన్న 1% మంది కన్నా సగటున 15 ఏళ్లు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఈ ఉన్నత శ్రేణిలోనూ రాజకీయ నాయకులది ప్రత్యేక కోవ. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల కన్నా రాజకీయ నాయకులు సగటున 3 నుంచి 7 ఏళ్లు అదనంగా జీవిస్తున్నారని ఆక్స్‌ఫర్డ్‌, మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయాల పరిశోధకుల సంయుక్త అధ్యయనం తేల్చింది. అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, ఆస్ట్రియాలతో సహా 11 సంపన్న దేశాల్లో 57,000 మందికిపైగా రాజకీయ నాయకులపై ఈ అధ్యయనం జరిగింది. ప్రతి దేశంలో సాధారణ పౌరుల మరణాల రేటుతో రాజకీయ నేతల రేటును పోల్చిచూశారు. సగటున రాజకీయ నాయకులు 45 ఏళ్ల వయసులో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతారు కాబట్టి, అప్పటి నుంచి వారి ఆయుర్దాయాన్ని సాధారణ పౌరులతో పోల్చిచూశారు. ఆయా దేశాల్లో పౌరుల సగటు ఆయుర్దాయంలో తేడాలున్నా అన్ని దేశాల రాజకీయ నాయకుల ఆయుర్దాయంలో మాత్రం తేడా కనిపించలేదు. వారు 45 ఏళ్ల వయసు తరవాత మరో 40 ఏళ్లపాటు జీవిస్తున్నారు. 45 ఏళ్ల వయసు వచ్చిన తరవాత సాధారణ అమెరికన్‌ పౌరులు 34.5 ఏళ్ల పాటు, ఆస్ట్రేలియన్లు 37.8 సంవత్సరాలు జీవిస్తున్నారు. మొత్తం 11 దేశాల్లో సాధారణ పౌరుల కన్నా రాజకీయ నాయకులు మూడు నుంచి ఏడేళ్లు అదనంగా జీవిస్తున్నారు. 19వ శతాబ్దం, 20వ శతాబ్దపు ఆరంభంలోను రాజకీయ నాయకులు, పౌరుల మధ్య ఆయుర్దాయంలో తేడా ఉండేది కాదు. 20వ శతాబ్ది ద్వితీయార్ధం నుంచి ఈ అంతరం పెరగడం ప్రారంభమైంది. దీనికి కారణం ఒక్క ఆదాయం మాత్రమే కాదు, ధూమపానానికి స్వస్తిచెప్పడం, సమతుల్య ఆహారం తీసుకోవడం వంటి మంచి అలవాట్లు కూడా రాజకీయ నేతల ఆయుర్దాయం పెరగడానికి దోహదపడ్డాయి. టీవీ, సామాజిక మాధ్యమాలు వచ్చాక నవతరం రాజకీయ నాయకులు ఆవిర్భవిస్తున్నారు. వీరికీ పాతతరం రాజకీయ నాయకులకూ మధ్య జీవనశైలిలో చాలా తేడా ఉంటోంది. ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా, ఇతరత్రా విస్తృత సమాచారం అందుబాటులో ఉండే సంపన్న దేశాలకు మాత్రమే ప్రస్తుత అధ్యయనం పరిమితమైంది. అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లోనూ ఇటువంటి అధ్యయనాలు జరిగితే ఆయుర్దాయానికి సంబంధించిన అవగాహన మరింత పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని