Updated : 10 Jul 2022 10:08 IST

బ్రిటన్‌ ప్రధాని రేసులో బలమైన అభ్యర్థిగా సునాక్‌

లండన్‌: ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతికి చెందిన బ్రిటన్‌ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ ...బోరిస్‌ జాన్సన్‌ స్థానంలో తదుపరి ప్రధాన మంత్రి అభ్యర్థిగా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ(టోరీ) నేతగా ఎన్నికయ్యేందుకు జరుగుతున్న రేసులో అందరికన్నా ముందున్నారు. శనివారం పలువురు టోరీ ఎంపీలు, నేతలు రిషికి మద్దతు ప్రకటించారు. వీరిలో ప్రతినిధుల సభలో పార్టీ నేత మార్క్‌ స్పెన్సర్‌, పార్టీ మాజీ ఛైర్మన్‌ ఆలివర్‌ డౌడెన్‌, మాజీ మంత్రి లియామ్‌ ఫాక్స్‌ తదితరులున్నారు. మాజీ ఆర్థిక మంత్రిగా, బ్రెగ్జిట్‌కు అనుకూలమైన వ్యక్తిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న రిషి సునాక్‌ అధికార పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురాగలరని, దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పాటు ప్రధాన మంత్రి పోటీ నుంచి వైదొలగుతున్నట్లు రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌ ప్రకటించడం ఆయనకు అదనపు సానుకూలాంశంగా మారింది. రేసులో రిషి స్థానాన్ని మరింత దృఢపరిచింది. కరోనా వంటి కష్ట సమయంలో ఆర్థిక శాఖను సమర్థంగా నడిపించిన విషయాన్ని వివరిస్తూ వీడియోలను విడుదల చేశారు. ‘రెడీ ఫర్‌ రిషి’ హ్యాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాల ద్వారా వీటిని ప్రచారంలోకి తెచ్చారు. ‘దేశం భారీ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం ఎంతైనా అవసరమ’ని విజ్ఞప్తి చేస్తున్నారు. కుటుంబ నేపథ్యాన్ని, భారతీయ మూలాలను, బ్రిటన్‌లో అందిపుచ్చుకున్న అవకాశాలను తెలియజేస్తూ...దేశంలోని ప్రతిఒక్కరూ అభివృద్ధి సాధించాలన్నదే తన లక్ష్యమంటూ ప్రచార వీడియో ద్వారా వివరిస్తున్నారు. అయితే, ప్రస్తుత ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వర్గీయులు కొందరు రిషిపై విమర్శలు ఎక్కుపెట్టారు. మాజీ బాస్‌కు వ్యతిరేకంగా కుట్రపన్నారంటూ ఆరోపిస్తున్నారు. విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ ఇంకా తన పోటీ విషయాన్ని స్పష్టం చేయలేదు. రేసులో మాజీ మంత్రి కెమి బదెనోచ్‌(42) పేరు  కొత్తగా వినిపిస్తోంది. ఈమె నైజీరియా సంతతికి చెందిన వారు. భారతీయ మూలాలున్న సుయెలా బ్రవెర్మన్‌కు మద్దతుగా బరి నుంచి వైదొలగుతున్నట్లు ఎంపీ స్టీవ్‌ బేకర్‌ తెలిపారు. ప్రస్తుతానికైతే బ్రిటన్‌ ప్రధాని పదవి పోటీలో రిషి సునాక్‌ ముందంజలో ఉన్నారని బుకీలు చెబుతున్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని