Srilanka Crisis : అధ్యక్ష భవనంలోనే స్నానాలు, భోజనాలు

దేశంలో ముదురుతున్న ఆర్థిక సంక్షోభానికి నిరసనగా.. సైన్యం కాల్పులు, పోలీసుల బాష్పవాయు గోళాలను లెక్క చేయకుండా శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాస గేట్లను బద్దలుకొట్టి శనివారం లోపలకు దూసుకెళ్లిన నిరసనకారులు ఆదివారమూ అక్కడే తిష్ఠ వేశారు. రాజీనామా చేస్తానన్న గొటబాయ

Updated : 11 Jul 2022 09:11 IST

శ్రీలంకలోని గొటబాయ అధికారిక నివాసాన్ని వీడని ఆందోళనకారులు

ప్రతి గదిని పరిశీలిస్తూ.. సెల్ఫీలు

అక్కడి జిమ్‌లోనే వ్యాయామాలు

కొలంబో: దేశంలో ముదురుతున్న ఆర్థిక సంక్షోభానికి నిరసనగా.. సైన్యం కాల్పులు, పోలీసుల బాష్పవాయు గోళాలను లెక్క చేయకుండా శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాస గేట్లను బద్దలుకొట్టి శనివారం లోపలకు దూసుకెళ్లిన నిరసనకారులు ఆదివారమూ అక్కడే తిష్ఠ వేశారు. రాజీనామా చేస్తానన్న గొటబాయ తన మాట నిలబెట్టుకొనేవరకు తమ ఆందోళన ఆగదని వారు పేర్కొన్నారు. ఆదివారం వారంతా అధ్యక్ష, ప్రధాని అధికారిక నివాసాల్లోనే గడిపారు. ప్రతి గదిని పరిశీలిస్తూ.. సెల్ఫీలు తీసుకున్నారు. స్థానికులు కూడా వందలాదిగా ఆ భవనాలను చూసేందుకు తరలివచ్చారు. కుటుంబసభ్యులు, పిల్లలతో తిరుగుతూ, భోజనాలు కూడా అక్కడే చేశారు. యువకులైతే సోఫాల్లో కూర్చుని టీవీలు వీక్షిస్తూ గడిపారు. ప్రధానమంత్రి నిద్రపోయే పడకపైనా కొందరు యువకులు ఎగురుతూ.. దొర్లుతూ ఫొటోలు తీసుకున్నారు. అక్కడున్న వ్యాయామశాలలో కసరత్తులు చేశారు. అధ్యక్షుడి బాత్రూంలో స్నానం చేస్తూ మరికొందరు కనిపించారు. ‘‘మేం ఇప్పుడు  అవినీతి నుంచి స్వేచ్ఛను సంపాదించాం. అంతా ప్రశాంతంగా ఉంది. ఈ సంబరాలు జరుపుకొనేందుకు మేం ఇక్కడకు కుటుంబం, పిల్లలతో వచ్చాం. మేమంతా ఇక్కడే భోజనం చేస్తున్నాం’’ అని స్థానికుడు ఒకరు తెలిపారు.

భారీస్థాయిలో నోట్లకట్టలు

అధ్యక్ష భవనంలోని గదుల్లో నిరసనకారులకు భారీస్థాయిలో నోట్లకట్టలు కనిపించాయి. వెంటనే వాటిని లెక్కించి.. మొత్తం విలువ సుమారు రూ.8 కోట్లుగా తేల్చారు. ఆ సొమ్మును వారు స్థానిక పోలీసులకు అప్పగించారు. నగదును లెక్కిస్తున్న వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఆందోళనకారుల్లో కొందరు తాము ఆక్రమించిన అధ్యక్ష, ఇతర ప్రభుత్వ భవన పరిసరాలు శుభ్రం చేస్తూ కనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని