Updated : 29 Jul 2022 05:08 IST

SriLanka: ఆర్థికరంగాన్ని చక్కదిద్దడమే లక్ష్యం

శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘె ఉద్ఘాటన

కొలంబో: దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని చక్కదిద్దడం, తీవ్ర ఇంధన కొరతను అధిగమించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యాలని శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘె పేర్కొన్నారు. బుధవారం తమ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశంలో శాంతియుత ఆందోళనలకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని, నిరసనకారులు చట్టాన్ని ఉల్లంఘించకుంటే వారిని అన్నివేళలా అనుమతిస్తామని విక్రమసింఘె స్పష్టం చేశారు. ‘‘దేశం అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో నేను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాను. ఆర్థిక రంగాన్ని చక్కబరచాల్సి ఉంది. తొలుత ఇంధనం కోసం పౌరులు సుదీర్ఘ బారులు తీరి వేచిఉండటాన్ని తగ్గిస్తాం. ఆపై అలాంటి నిరీక్షణలు ఏర్పడనవసరంలేని విధంగా ఇంధనాన్ని అందుబాటులోకి తెస్తాం’’ అని విక్రమసింఘె వివరించారు. జూన్‌ 27 నుంచి శ్రీలంకలో ప్రభుత్వం ఇంధన సరఫరాలను నిలిపేసింది. అత్యవసర సేవలపై పరిమితులు విధించింది.

ఎమర్జెన్సీ పొడిగింపుతో పర్యాటక రంగానికి ఇబ్బందే

శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని పొడిగించడం దేశ పర్యాటక రంగాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెడుతుందని ఆ పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రజా భద్రత, శాంతి పరిరక్షణ ప్రయోజనాల కోసం నిబంధనల రూపకల్పనకు అధ్యక్షుడికి అధికారం దఖలు పడేలా ఆగస్టు 14 వరకూ ఎమర్జెన్సీని కొనసాగించేందుకు శ్రీలంక పార్లమెంటు బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పరిస్థితి దేశంలో ఇప్పటికే చితికిపోయిన పర్యాటక రంగాన్ని మరింత కుంగదీస్తుందని శ్రీలంక హోటళ్ల సంఘం అధ్యక్షుడు ఎం.శాంతికుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

అధ్యక్ష భవనంలో దొరికిన నగదును కోర్టుకు సమర్పించండి

ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల సందర్భంగా శ్రీలంక అధ్యక్ష భవనంలోకి చొచ్చుకెళ్లిన నిరసనకారులు గుర్తించిన రూ.1.78 కోట్ల నగదును కోర్టుకు సమర్పించాలంటూ స్థానిక కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ నెల 9న అధ్యక్ష భవనంలో దొరికిన నగదును ఆందోళనకారులు తమకు అప్పగించినట్లు పోలీసులు న్యాయస్థానానికి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ సొమ్మును కోర్టులో సమర్పించాలంటూ ఫోర్ట్‌ పోలీసు ఇన్‌ఛార్జి అధికారిని ఫోర్ట్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశించింది.

లంక దుస్థితికి మేం కారణం కాదు: చైనా

అప్పులు కట్టలేక శ్రీలంక దివాలా స్థితికి చేరేందుకు తామే కారణమంటూ వస్తున్న విమర్శలను చైనా ఖండించింది. లంకలో తమ దేశం చేపట్టిన భారీ ప్రాజెక్టులు, పెట్టిన పెట్టుబడులు ఆ దేశ ఆర్థికాభివృద్ధికి ఊతంగా నిలిచాయని పేర్కొంది. చైనా విదేశాంగ మంత్రి ఝావో లిజియాన్‌ విలేకర్ల సమావేశంలో గురువారం ఈ మేరకు మాట్లాడారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts