Al-Jawahiri: కంటి వైద్యుడే.. కంట్లో నలుసై

ఉగ్ర చర్యలతో అనేక దేశాలను గడగడలాడించి, చివరకు అగ్రరాజ్య బలగాల చేతిలో హతమైన అల్‌ఖైదా అగ్రనేత అల్‌ జవహరీ అసలు వృత్తి ఏమిటో తెలుసా..? వైద్యం. నిజం. అతడు నేత్రవైద్యంలో శస్త్రచికిత్స నిపుణుడు. చిన్నప్పటి

Updated : 03 Aug 2022 06:27 IST

ఉన్నత ఈజిప్టు కుటుంబం నుంచి జవహరీ ప్రస్థానం

15 ఏళ్ల ప్రాయంలో తొలిసారి అరెస్టు

డాక్టరైన తర్వాత మరింతగా ఉగ్రవాదంలోకి

ఉగ్ర చర్యలతో అనేక దేశాలను గడగడలాడించి, చివరకు అగ్రరాజ్య బలగాల చేతిలో హతమైన అల్‌ఖైదా అగ్రనేత అల్‌ జవహరీ అసలు వృత్తి ఏమిటో తెలుసా..? వైద్యం. నిజం. అతడు నేత్రవైద్యంలో శస్త్రచికిత్స నిపుణుడు. చిన్నప్పటి నుంచి ఇస్లామిక్‌ ఉగ్రవాదంవైపు దృష్టి ఉండడంతో దానిలో రాటుదేలి ప్రపంచానికి కంటగింపుగా మారాడు. జవహరీది ఈజిప్టు. ఆ దేశ రాజధాని కైరోలో  స్థితిమంతులైన విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. పుట్టింది 1951 జూన్‌ 19న.

జవహరీ కుటుంబంలో చాలామంది వైద్యులు, పట్టభద్రులు ఉన్నారు. తండ్రి మహమ్మద్‌ అల్‌ జవహరీ స్థానిక కైరో విశ్వవిద్యాలయం ఫార్మకాలజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. జవహరీ కూడా ఇదే విశ్వవిద్యాలయంలో 1974లో వైద్యంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాడు. తర్వాత నాలుగేళ్లకు సర్జరీలో మాస్టర్స్‌ పూర్తి చేసి కొంతకాలం పాటు కంటి శస్త్రచికిత్స నిపుణుడిగా పనిచేశారు. చిన్నతనం నుంచే మత ఛాందస భావాలు ఎక్కువ. ఇస్లామిక్‌ పాలనకు తనదైన భాష్యం చెబుతుండేవాడు. 15 ఏళ్ల వయసులోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తోన్న ఓ ముఠాలో సభ్యుడిగా చేరి అరెస్టయ్యాడు. వైద్యుడిగా ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు.

కారాగారానికి వెళ్లాక కరడుగట్టాడు

1973లో ఈజిప్టియన్‌ ఇస్లామిక్‌ జిహాద్‌ ముఠా ఏర్పడగా జవహరీ అందులో చేరాడు. 1981లో అప్పటి ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్‌ సదత్‌ కైరోలో ఓ సైనిక కవాతులో పాల్గొనగా కొంతమంది ముష్కరులు సైనికుల దుస్తుల్లో వచ్చి ఆయన్ని హత్య చేశారు. ఇస్లామిక్‌ పాలనను తీసుకురావాలనే ఉద్దేశంతోనే సదత్‌ను హత్య చేసినట్లు జవహరీ అప్పట్లో ప్రకటించుకున్నాడు. జైల్లో తీవ్రంగా కొడుతుండడం అతడు మరింత క్రూరంగా మారేందుకు కారణమైందని తోటి ఖైదీలు చెప్పేవారు. జవహరీ మూడేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలై సౌదీ అరేబియా చేరుకున్నాడు. అక్కడ పూర్తిస్థాయి ఇస్లామిక్‌ ఉగ్రవాదిగా మారిపోయాడు.

ఒకే లక్ష్యం.. కలిపింది ఇద్దరినీ

1993లో ఈజిప్టులో ఇస్లామిక్‌ జిహాదీ గ్రూప్‌ మళ్లీ వెలుగులోకి వచ్చింది. జవహరీ దానికి నాయకత్వం వహించాడు. ఈజిప్టు ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా జవహరీ సారథ్యంలోని ముఠా జరిపిన దాడుల్లో 1,200 మందికి పైగా సామాన్య పౌరులు మరణించారు. అఫ్గాన్‌లో ‘సోవియెట్‌ ఆక్రమణ’కు వ్యతిరేకంగా పోరాడుతూ గాయపడినవారికి అల్‌ జవహరీ ఒక వైద్యునిగా చికిత్స అందించేవాడు. ఆ తరుణంలోనే బిన్‌లాడెన్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి ‘లక్ష్యం’ ఒకటేనని తెలుసుకున్నాక తన ‘ఈజిప్షియన్‌ ఇస్లామిక్‌ జిహాద్‌’ను 1998 మే నెలలో అల్‌ఖైదాలో విలీనం చేశాడు. ఆ సందర్భంగా ఇద్దరు నేతలూ ఒక ఫత్వాపై సంతకం చేశారు. అమెరికా ప్రజల్ని, ఆ దేశ సైనికుల్ని చంపడం ప్రతి ముస్లిం కర్తవ్యమనేది దాని సారాంశం..!! 1997లో ఈజిప్టులో విదేశీ పర్యాటకులపై దాడికి పాల్పడి 62 మంది ప్రాణాలు బలి తీసుకోవడంలో జవహరీకి లంకె ఉన్నట్లు అప్పట్లో బయటపడింది. కెన్యా, టాంజానియాల్లో అమెరికా దౌత్యకార్యాలయాలపై 1998లో జరిగిన దాడుల్లో జవహరీది కీలక భూమిక.

అమెరికాపై దాడి తర్వాత అల్‌ఖైదా చెల్లాచెదురుగా విడిపోయింది. అమెరికా బలగాల నిఘా ఉన్నప్పటికీ.. అఫ్గాన్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో ఈ ముఠాను బలోపేతం చేయడంలో జవహరీ కీలకంగా పనిచేశాడు. 2005లో లండన్‌లోని ఉగ్రదాడి జరిపి 52 మందిని చంపేశాడు. 2011లో లాడెన్‌ను అమెరికా దళాలు మట్టుబెట్టిన తర్వాత అల్‌ఖైదా పగ్గాలను జవహరీ అందుకున్నాడు. ముందునుంచీ లాడెన్‌ కంటే ఎక్కువగా వీడియోల్లో కన్పించేవాడు. అబు మహమ్మద్‌, అబు ఫాతిమా, మహమ్మద్‌ ఇబ్రహీం, అబు అబ్దుల్లా, ది డాక్టర్‌, ది టీచర్‌, ఉస్తాజ్‌, డా.అయ్‌మన్‌.. ఇలా అనేక మారుపేర్లతో చలామణి అయ్యాడు.


అంతర్జాతీయంగా ఉగ్ర‘వాణి’

జవహరీ క్రమంగా రాటుదేలి లాడెన్‌కు కుడి భుజంలా వ్యవహరించేవాడు. కొన్నాళ్లు అతనికి వ్యక్తిగత వైద్యుడిగానూ ఉన్నాడు. లాడెన్‌ను అమెరికా చంపిన తర్వాత అంతర్జాతీయంగా ఆ ఉగ్రవాద సంస్థ తరఫున తెరపై ఈ వ్యక్తే కనిపించేవాడు. 9/11 దాడులతో పాటు 2000 అక్టోబరులో అమెరికా యుద్ధనౌకపై ఆత్మాహుతి దాడి చేయించి 17 మంది నావికుల్ని పొట్టనపెట్టుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. బాలి, రియాద్‌, జకార్తా, ఇస్తాంబుల్‌, మాద్రీద్‌, లండన్‌ తదితర చోట్ల అనేక దాడులకు నాయకత్వం వహించాడు. 2014లో ‘భారత ఉపఖండంలో అల్‌ఖైదా’ (ఏక్యూఐఎస్‌) పేరుతో ప్రాంతీయ అనుబంధ విభాగాన్ని ఏర్పాటు చేశాడు.


అప్పట్లో త్రుటిలో తప్పించుకుని..

నిత్యం ప్రాంతాలు మారుతూ ఉండే జవహరీ ఒక దశలో అఫ్గాన్‌లోని టోరాబోరా ప్రాంతంలో అమెరికాకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు. ఆ దాడిలో అతని భార్య, పిల్లలు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. లాడెన్‌కు ఉన్న నాయకత్వ లక్షణాలు జవహరీలో లేకపోయినా తన వాక్పటిమతో ఉగ్ర కార్యకలాపాల విస్తరణ చేయగలిగాడు. తాము చెప్పదలచుకున్న విషయాన్ని వీడియో సందేశాల రూపంలో విడుదల చేసేవాడు. ఎప్పుడూ కళ్లజోడు ధరించి ఒసామా బిన్‌ లాడెన్‌ పక్కన ఫొటోల్లో కన్పించే అతడి ముఖం చాలామందికి పరిచితమే.

- ఈనాడు ప్రత్యేక విభాగం

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts