US: అమెరికా అంతమొందించిన ఉగ్రవాదులు వీరే..

ప్రపంచాన్ని గడగడలాడించిన కరడుగట్టిన ఉగ్రవాది, అల్‌ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ ఉత్తర పాకిస్థాన్‌లోని ఓ స్థావరంలో నివసిస్తున్నట్లు 2010 ఆగస్టులో అమెరికా నిఘా సంస్థలు పసిగట్టాయి. అధ్యక్షుడు ఒబామా ఆదేశాల మేరకు ప్రత్యేక దళం 2011 మే 2న ఆ ప్రాంగణంపై దాడి చేసి లాడెన్‌ను మట్టుబెట్టాయి.

Updated : 03 Aug 2022 08:11 IST

బిన్‌ లాడెన్‌

ప్రపంచాన్ని గడగడలాడించిన కరడుగట్టిన ఉగ్రవాది, అల్‌ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ ఉత్తర పాకిస్థాన్‌లోని ఓ స్థావరంలో నివసిస్తున్నట్లు 2010 ఆగస్టులో అమెరికా నిఘా సంస్థలు పసిగట్టాయి. అధ్యక్షుడు ఒబామా ఆదేశాల మేరకు ప్రత్యేక దళం 2011 మే 2న ఆ ప్రాంగణంపై దాడి చేసి లాడెన్‌ను మట్టుబెట్టాయి.


అబూ బకర్‌ అల్‌ బగ్దాదీ

ఉగ్ర సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌)కు చెందిన కీలక నాయకుడు అల్‌ బగ్దాదీ అలియాస్‌ ఇబ్రహీం అవద్‌ అల్‌-బద్రీ రెండు దశాబ్దాలపాటు అమెరికా దళాలకు దొరక్కుండా తప్పించుకున్నాడు. వాయువ్య సిరియాలోని ఓ రహస్య ప్రాంతంలో తలదాచుకుంటున్న అతడి ఆచూకీని కనిపెట్టిన అగ్రరాజ్య ప్రతేక దళాలు 2019 అక్టోబరు 27న చుట్టుముట్టాయి. దీంతో అతడు డిటొనేటర్లు పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో అతడి సంతానంగా భావిస్తున్న ముగ్గురు చిన్నారులూ ప్రాణాలు కోల్పోయారు.


అబూ ఇబ్రహీం అల్‌ హషిమి అల్‌ ఖురేషి: ఐఎస్‌ నేత అల్‌ ఖురేషిని వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రావిన్సులో అమెరికా దళాలు మట్టుబెట్టినట్లు అధ్యక్షుడు బైడెన్‌ 2022 ఫిబ్రవరి 3న ప్రకటించారు. అమెరికాకు పట్టుబడతానన్న భయంతో ఖురేషి బాంబు పేల్చుకుని కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.


ముస్తఫా మొహమ్మద్‌ ఫాదిల్‌: అమెరికా ఎంబసీపై దాడుల్లో కీలకంగా వ్యవహరించిన ముస్తఫాను 2001 సెప్టెంబరు 11న ట్విన్‌ టవర్స్‌పై దాడులు జరిగిన కొంత కాలానికి అఫ్గానిస్థాన్‌లో అమెరికా దళాలు హతమార్చాయి. అతడి మృతిని అల్‌ ఖైదా చాలా ఏళ్ల తర్వాత 2013లో ధ్రువీకరించింది.


అహ్మద్‌ మొహమ్మద్‌ హమీద్‌ అలీ: అమెరికా ఎంబసీపై దాడికి సంబంధించి అలీ కూడా వాంటెడ్‌ జాబితాలో ఉన్నాడు. అమెరికా కేంద్ర నిఘా సంస్థ(సీఐఏ) పాకిస్థాన్‌ గిరిజన ప్రాంతాల్లో 2011లో నిర్వహించిన డ్రోన్‌ దాడిలో హతమయ్యాడు.


హమ్జా బిన్‌ లాడెన్‌: ఒసామా బిన్‌ లాడెన్‌ మరణం తర్వాత అల్‌ ఖైదాకు సారథిగా వ్యవహరిస్తున్న అతడి కుమారుడు హమ్జాను  అమెరికా 2017లో ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2019 ఆగస్టులో గగన తలం ద్వారా జరిపిన దాడులతో అతడిని తుదముట్టించింది.


అమెరికా వాంటెడ్‌ జాబితాలో మరికొందరు..

అబూ మొహమ్మద్‌ అల్‌ గలోని: అల్‌ ఖైదా నుంచి విడిపోయి 2016లో హయత్‌ తాహ్రిర్‌ అల్‌ షామ్‌ ఉగ్ర సంస్థను స్థాపించాడు. వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రావిన్సులో ఈ ఉగ్ర ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీన్ని అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించింది.


అబ్ద్‌ అల్‌ రెహ్మాన్‌ అల్‌ మఘ్రేబి: అల్‌ ఖైదా నేత అయిన అల్‌ మఘ్రేబి ఇరాన్‌లో నివసిస్తున్నట్లు అమెరికా విశ్వసిస్తోంది. అల్‌ ఖైదా మీడియా విభాగం అల్‌ షాహబ్‌కు అతడు దీర్ఘకాలంగా డైరెక్టర్‌గా కొనసాగుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంటోంది.


ఖలీల్‌ అహ్మద్‌ హక్కానీ: బిన్‌ లాడెన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న హక్కానీని కరడుగట్టిన ఉగ్రవాదిగా పేర్కొంటూ అమెరికా 2011లో మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. ప్రస్తుతం తాలిబన్ల అధీనంలో ఉన్న కాబుల్‌ వీధుల్లో హక్కానీ స్వేచ్ఛగా విహరిస్తూ, మద్దతుదారుల సమావేశంలో ప్రసంగిస్తూ కెమెరా కంటికి చిక్కాడు. అతడిపై అమెరికా 50 లక్షల డాలర్ల రివార్డు ప్రకటించింది.


సైఫ్‌ అల్‌ అదెల్‌: ఈజిప్టు మిలిటరీ మాజీ కర్నల్‌ అయిన అల్‌ అదెల్‌ 2013 వరకూ ఇరాన్‌లో గృహనిర్బంధంలో ఉన్నట్లు సమాచారం. అనంతరం అల్‌ ఖైదా మిలిటరీ కమిటీ సీనియర్‌ సభ్యుడిగా సిరియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. 1998లో అమెరికా ఎంబసీపై దాడి ఘటనకు సంబంధించి అతన్ని అమెరికా మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదిగా ప్రకటించింది.


అబ్దుల్‌ రెహ్మాన్‌ యాసిన్‌: బాంబులు తయారు చేయడంలో నిపుణుడైన రెహ్మాన్‌ 1993లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై జరిగిన తొలి దాడిలో కీలకంగా వ్యవహరించాడు. 2002లో ఇరాక్‌ నుంచి అదృశ్యమయ్యాడు. 2003లో ఇరాక్‌పై దండెత్తిన అమెరికా దళాలు అతడి జాడను కనిపెట్టలేకపోయాయి.


- ఈనాడు ప్రత్యేక విభాగం

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts