తైవాన్‌ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు

తైవాన్‌ తమ భూభాగంలో భాగమని వాదిస్తున్న చైనా.. తాజాగా ఆ ద్వీపం చుట్టూ ఆరు జోన్లలో భారీస్థాయిలో సైనిక విన్యాసాలు చేపట్టింది. విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గామి వంటి వాటిని మోహరిస్తోంది. తైవాన్‌

Updated : 05 Aug 2022 06:06 IST

ద్వీప జలాల్లో క్షిపణుల ప్రయోగం

బీజింగ్‌, సియోల్‌, కొలంబో: తైవాన్‌ తమ భూభాగంలో భాగమని వాదిస్తున్న చైనా.. తాజాగా ఆ ద్వీపం చుట్టూ ఆరు జోన్లలో భారీస్థాయిలో సైనిక విన్యాసాలు చేపట్టింది. విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గామి వంటి వాటిని మోహరిస్తోంది. తైవాన్‌ ప్రాదేశిక జలాల్లోనూ ఈ విన్యాసాలు జరుగుతుండటం గమనార్హం. తైవాన్‌లోని ఈశాన్య, నైరుతి జలాల్లో చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ గురువారం మధ్యాహ్నం డాంగ్‌ఫెంగ్‌ బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని తైవాన్‌ రక్షణశాఖ సైతం ధ్రువీకరించింది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ గత మంగళవారం జరిపిన పర్యటనకు ప్రతీకారంగా తైవాన్‌ను చైనా దాదాపుగా అష్టదిగ్బంధనం చేస్తోంది. పెలోసీ పర్యటనను ఆపలేకపోయారంటూ చైనా అధికారులపై స్థానిక సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. స్వతంత్ర ప్రాంతంగా మనుగడ సాగిస్తున్న తైవాన్‌ను ప్రధాన భూభాగంలో కలుపుకొనేందుకు ఎప్పటినుంచో చైనా ప్రయత్నిస్తోంది. స్వతంత్ర దేశంగానే ఉండాలని తైవాన్‌ కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు తైవాన్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఇది నచ్చని చైనా తరచూ కవ్వింపులకు పాల్పడుతోంది. అందులో భాగంగానే తాజాగా భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది. గురువారం మొదలైన ఈ డ్రిల్స్‌ ఆదివారం వరకు కొనసాగనున్నాయి. తైవాన్‌ జలసంధిలో సైనిక కార్యకలాపాల దూకుడుకు పెలోసీ పర్యటనను సాకుగా చూపవద్దని జీ7 దేశాల విదేశాంగ మంత్రులు చైనాకు విజ్ఞప్తి చేశారు. చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్‌ బీజింగ్‌లో మీడియాతో మాట్లాడుతూ జీ7 దేశాల వైఖరిని తప్పుబట్టారు. ‘చైనా ప్రజలపై పెత్తనం సాగించాలని చూస్తున్నవారు 120 ఏళ్ల కిందటి సామ్రాజ్యవాద ప్రపంచంలో బతుకుతున్నారు. వారు మేల్కొనాలి’ అని ఆమె ఘాటుగా స్పందించారు. ‘ఏక చైనా’ విధానానికి తాము గట్టిగా మద్దతు ఇస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘె ట్వీట్‌ చేశారు. కాంబోడియా రాజధాని పెనామ్‌ పెన్‌లో జరిగిన ఆగ్నేయాసియా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ‘రెచ్చగొట్టే చర్యలు వద్దు.. పూర్తి సంయమనం పాటించండి’ అంటూ చైనా, అమెరికా దేశాలను కోరుతూ ఓ ప్రకటన విడుదల చేసింది.

అప్రమత్తమైన తైవాన్‌

చైనా సైనిక విన్యాసాల నేపథ్యంలో తైవాన్‌ సైతం అప్రమత్తమైంది. సైన్యాన్ని సిద్ధం చేసి, పౌర రక్షణ కసరత్తులు ప్రారంభించింది. ద్వీపానికి సమీపంలో చైనా నావికాదళం ఫిరంగిని కాల్చడంతో తైవాన్‌ గురువారం సుమారు 40 విమాన సర్వీసులను రద్దు చేసుకొన్నట్లు ‘చైనా టైమ్స్‌’ పత్రిక తెలిపింది. అటు అమెరికా నావికాదళం సైతం తైవాన్‌కు సమీపంలో పలు నౌకలను మోహరించింది. తైవాన్‌కు అండగా నిలుస్తామని అమెరికా పదే పదే చెబుతున్నందున తాజా పరిణామాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. తైవాన్‌ నుంచి దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సి పెలోసీ గురువారం ఆ దేశ రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెంచేలా తైవాన్‌, చైనాలకు సంబంధించి ఎటువంటి బహిరంగ ప్రకటన చేయకుండా ఆమె జాగ్రత్త పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని