Cancer: గుండెజబ్బులు, క్యాన్సర్‌ నిర్ధారణ ఇక తేలిక!

గుండె జబ్బులు, క్యాన్సర్లు వంటి సాంక్రమికేతర వ్యాధులను గుర్తించే సులువైన కొత్త విధానాన్ని బ్రిటన్‌, జర్మనీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇంట్లోనే వైద్య పరీక్షల నిర్వహణ దిశగా ఇదో ముందడుగు.

Updated : 07 Aug 2022 05:54 IST

లండన్‌: గుండె జబ్బులు, క్యాన్సర్లు వంటి సాంక్రమికేతర వ్యాధులను గుర్తించే సులువైన కొత్త విధానాన్ని బ్రిటన్‌, జర్మనీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇంట్లోనే వైద్య పరీక్షల నిర్వహణ దిశగా ఇదో ముందడుగు. శరీరంలోని పరమాణు సంకేతాలను గుర్తించడం ద్వారా ఈ కొత్త విధానం పనిచేస్తుంది. వీటిని బయోమార్కర్లుగా పేర్కొంటారు. కొవిడ్‌-19 నిర్ధారణలోనూ వీటిని వినియోగిస్తున్నారు. ఈ వ్యాధి కారక సార్స్‌-కోవ్‌-2 జన్యువుల ఉనికిని పసిగట్టడం ద్వారా అది పనిచేస్తుంది. సాంక్రమికేతర వ్యాధులకూ బయోమార్కర్లు ఉంటాయి. ఉదాహరణకు రక్తంలో ప్రొస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటిజెన్‌ (పీఎస్‌ఏ) ఉనికి.. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు సూచిక కావొచ్చు. ప్రస్తుతమున్న ఇలాంటి ఆర్‌ఎన్‌ఏ లేదా డీఎన్‌ఏ ఆధారిత వ్యాధి నిర్ధారణ పరీక్షలకు నియంత్రిత ఉష్ణోగ్రతలు అవసరం. పైగా వాటిలో అనేక అంచెలు ఉంటాయి. ఇందుకు ఖరీదైన సాధనాలు అవసరం. ప్రస్తుత విధానాలు.. నమూనాలో సాంక్రమిక వ్యాధి ఉనికిని మాత్రమే పసిగడతాయి. సంబంధిత బయోమార్కర్‌ ఎంత పరిమాణంలో ఉందన్నది గుర్తించలేవు. గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి వ్యాధుల పర్యవేక్షణకు ఈ వివరాలు అవసరం.  కొత్త పరీక్ష విధానం ఈ లోపాలను అధిగమించింది. దీనికి ‘క్రిస్పర్‌జైమ్‌’ అని పేరు పెట్టారు. నమూనా విశ్లేషణలో యాంప్లిఫికేషన్‌ అనే ప్రక్రియకు నియంత్రిత ఉష్ణోగ్రతలు అవసరం. తాజా విధానంలో దీన్ని తొలగించి, కలోరీమెట్రిక్‌ విశ్లేషణను శాస్త్రవేత్తలు తెచ్చారు. ఇది రోగి నమూనాలో బయోమార్కర్‌ పరిమాణాన్ని కూడా చెప్పేస్తుంది. యాంప్లిఫికేషన్‌ దశను నిర్మూలించడానికి శాస్త్రవేత్తలు నానోజైమ్‌లు అనే కృత్రిమ పదార్థాన్ని ఉపయోగించారు. అవి ఎంజైమ్‌లా పనిచేస్తూ పరీక్ష సంకేతాన్ని పెంచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని