Ukraine: తుర్కియేకి చేరిన ఉక్రెయిన్‌ నౌకలు

ఆహార సంక్షోభాన్ని నివారించడానికి ఉక్రెయిన్‌ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతుల్ని అనుమతించాలని చేసుకున్న ఒప్పందంలో భాగంగా తొలివిడత నౌకలు 12,000 టన్నుల ఆహార ధాన్యాలతో సోమవారం నిరాటంకంగా

Updated : 09 Aug 2022 06:11 IST

మరింతగా ఆహారధాన్యాల తరలింపునకు వీలు

మాస్కో, కీవ్‌: ఆహార సంక్షోభాన్ని నివారించడానికి ఉక్రెయిన్‌ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతుల్ని అనుమతించాలని చేసుకున్న ఒప్పందంలో భాగంగా తొలివిడత నౌకలు 12,000 టన్నుల ఆహార ధాన్యాలతో సోమవారం నిరాటంకంగా తుర్కియేకి చేరుకోగలిగాయి. రష్యా తన వాగ్దానానికి కట్టుబడి ఉంటే పశ్చిమాసియా, ఆఫ్రికా, ఆసియా దేశాల ప్రజలకు ఆహార భద్రత కొనసాగేలా చూస్తామని ఉక్రెయిన్‌ హామీ ఇచ్చింది. జలాల్లో అమర్చిన మందుపాతరలు సహా అన్నిరకాల ప్రమాదకర పరిస్థితుల్ని అధిగమించి, ఉక్రెయిన్‌ నుంచి సరకును రవాణా చేయగలగడంపై నౌకల సిబ్బంది ఆనందంతో ఉన్నారు. తుర్కియే, ఐరాసల చొరవతో 10 నౌకలను ఉక్రెయిన్‌ ఓడరేవుల నుంచి పంపించేందుకు రష్యా అంగీకరించింది. మరో రెండు నౌకలు ఉక్రెయిన్‌కు రానున్నాయి. మొక్కజొన్న, సోయా, పొద్దుతిరుగుడు పువ్వు నూనెల నిల్వలు దాదాపు 3.33 లక్షల టన్నుల మేర ఉక్రెయిన్‌లో పేరుకుపోయాయి.

అణు విద్యుత్కేంద్రంపై దాడి.. నిందారోపణలు

జపోరిజియా అణు విద్యుత్కేంద్రంపై సోమవారం మరోసారి దాడులు చోటు చేసుకోవడంపై రష్యా, ఉక్రెయిన్‌ పరస్పరం ఆరోపించుకున్నాయి. శనివారం నాటి దాడి తర్వాత మంటలు చెలరేగడంతో కర్మాగారంలో కొన్ని విభాగాలను మూసివేశారు. దీంతో విద్యుదుత్పత్తిపై ప్రభావం పడింది. ఈ కేంద్రాన్ని రష్యా సేనలు కొన్ని నెలలుగా ఆక్రమించుకున్నాయి. ఆ క్రమంలో దానిలో పేలుడు పదార్థాలను పుతిన్‌ సేనలు అమర్చాయని ఉక్రెయిన్‌ ఆరోపించింది. చెర్నోబిల్‌ విషయంలోనూ ఇదే జరిగిందని తెలిపింది. ఈ ప్రమాదకరమైన పనికి ఉక్రెయినే పాల్పడిందని రష్యా ప్రత్యారోపణ చేసింది. తమ లక్ష్యాలను చేరుకునేవరకు సైనిక చర్య కొనసాగుతుందనీ, చర్చలకు ఉక్రెయిన్‌ మార్చి నుంచి ఆసక్తి చూపించడం లేదని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని