చైనాలో మరో కొత్త వైరస్‌

చైనాలో జంతువుల నుంచి మరో కొత్త వైరస్‌ మనుషులకు సోకడం ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. జంతువుల నుంచి వ్యాపించే హెనిపా వైరస్‌.. ఇటీవల షాంగ్‌డాంగ్‌, హెనాన్‌ ప్రావిన్సుల్లో కొందరికి సోకినట్లు తేలింది. జ్వరంతో బాధపడుతున్న

Published : 11 Aug 2022 05:25 IST

 జంతువుల నుంచి మనుషులకు సోకే హెనిపా

దీనికి టీకాలూ లేవు

బీజింగ్‌: చైనాలో జంతువుల నుంచి మరో కొత్త వైరస్‌ మనుషులకు సోకడం ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. జంతువుల నుంచి వ్యాపించే హెనిపా వైరస్‌.. ఇటీవల షాంగ్‌డాంగ్‌, హెనాన్‌ ప్రావిన్సుల్లో కొందరికి సోకినట్లు తేలింది. జ్వరంతో బాధపడుతున్న రోగుల నుంచి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్‌ ఆనవాళ్లను గుర్తించారు. దీనికి నోవెల్‌ లాంగ్యా హెనిపా వైరస్‌గా పేరుపెట్టారు. ఈ వైరస్‌ సోకిన 35 మందిలో జ్వరం, దగ్గు, నీరసం, కండరాల నొప్పులు, వికారంగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఎలుకలు, ఇతర జంతువుల నుంచి ఇది మనుషులకు సోకుతుందని నిపుణులు భావిస్తున్నారు. గొర్రెలు, కుక్కలు వంటి జంతువుల్లోనూ హెనిపా వైరస్‌ను గుర్తించారు. దీన్ని లాంగ్యా హెనిపా వైరస్‌ అని కూడా పిలుస్తారు. ఇది బయోసేఫ్టీ లెవల్‌-4 వైరస్‌గా చెబుతున్నారు. మనుషులు, జంతువుల్లో తీవ్ర అనారోగ్యాన్ని కలుగజేస్తుందని పేర్కొంటున్నారు. హెనిపా వైరస్‌ వ్యాప్తి నివారణకు ఎటువంటి వ్యాక్సిన్లు లేవు. కేవలం లక్షణాలను బట్టి బాధితులకు ఉపశమనం కల్పించే చికిత్సలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ వైరస్‌ సోకిన బాధితులను పరిశీలించగా... తీవ్రమైన లక్షణాలు లేవని డ్యూక్‌ ఎన్‌యూఎస్‌ మెడికల్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ వాంగ్‌ లింఫా పేర్కొన్నారు. చైనాలో కొత్త వైరస్‌ బయటపడడం వల్ల తైవాన్‌ అప్రమత్తమైంది. నూతన నిబంధనలు రూపొందించనున్నట్లు.. ప్రకటించింది. చైనా వ్యాధి నిరోధక కేంద్రం(సీడీసీ) అంచనాల ప్రకారం.. హెనిపా వైరస్‌ వల్ల మనుషుల్లో కాలేయం, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. తైవాన్‌లో హెనిపా వైరస్‌ను గుర్తించేందుకు అవసరమైన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు ప్రామాణిక విధానాలను త్వరలోనే రూపొందించనున్నట్లు తైవాన్‌ సీడీసీ వెల్లడించింది. ఇప్పటివరకు హెనిపా వైరస్‌ వల్ల ఎలాంటి మరణాలు నమోదు కాలేదని తైవాన్‌ సీడీసీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ చువాంగ్‌ జెన్‌ హిసియాంగ్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని