ఆగే‘వారం’ కాదు!

తైవాన్‌ చుట్టూ మునుపెన్నడూ లేనివిధంగా వారం రోజుల పాటు చేపట్టిన సైనిక విన్యాసాలను విజయవంతంగా పూర్తిచేసినట్లు చైనా బుధవారం ప్రకటించింది. తాము చెప్పినా వినకుండా.. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఇటీవల

Updated : 11 Aug 2022 05:34 IST

 ఇకపైనా యుద్ధ విన్యాసాలు
 తైవాన్‌పై డ్రాగన్‌ హెచ్చరిక

బీజింగ్‌: తైవాన్‌ చుట్టూ మునుపెన్నడూ లేనివిధంగా వారం రోజుల పాటు చేపట్టిన సైనిక విన్యాసాలను విజయవంతంగా పూర్తిచేసినట్లు చైనా బుధవారం ప్రకటించింది. తాము చెప్పినా వినకుండా.. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఇటీవల తైవాన్‌లో పర్యటించినందుకు గాను డ్రాగన్‌ ఈ విన్యాసాలను చేపట్టింది. ఇంతటితో ఆగబోమని.. ‘ఏక-చైనా’ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఇకపై క్రమం తప్పక ఇలాంటి విన్యాసాలు నిర్వహిస్తామని కూడా హెచ్చరించింది. పెలోసీ తైవాన్‌ పర్యటన ముగిసిన తర్వాత.. ఈనెల 4 నుంచి 7 వరకు సైనిక విన్యాసాలు చేపడతామని చైనా సైన్యం తొలుత ప్రకటించినప్పటికీ.. వీటిని వారం రోజులకు పొడిగించింది. ఈ విన్యాసాల్లో వందల సంఖ్యలో యుద్ధ విమానాలు, పదుల సంఖ్యలో నౌకలు వంటివెన్నో పాల్గొన్నాయి. తైవాన్‌ జలసంధి ప్రాంతంలో మారుతున్న పరిస్థితులపై కీలకంగా దృష్టి పెడతామని; శిక్షణ, యుద్ధ సన్నాహాలు చేస్తామని సీనియర్‌ కర్నల్‌ షీ యీ చెప్పారు.

అవసరమైతే బలప్రయోగం..!

తైవాన్‌, చైనాల ఏకీకరణ శాంతియుతంగా జరగాలని అభిలషిస్తున్నా.. అవసరమైతే సైనిక బలప్రయోగంతో గానీ, ఇతర విధానాల్లో గానీ దీన్ని సాధించడానికి వెనుకాడబోమని డ్రాగన్‌ స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే భారీఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. అయితే తామూ వెనుకాడేది లేదని స్పష్టం చేయడానికి తైవాన్‌ కూడా సైనిక విన్యాసాలు నిర్వహించింది. దీంతో తైవాన్‌ జలసంధిలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. యుద్ధమే వస్తే తైవాన్‌కు అండగా అమెరికా, దాని మిత్ర దేశాల నౌకలు తూర్పు, దక్షిణ చైనా సముద్రంలో ప్రవేశించాలంటే తైవాన్‌ జలసంధే మార్గం. అమెరికన్లు రాకుండా జల సంధిని దిగ్బంధనం చేస్తే ఈ సముద్రాల్లో తనకు ఎదురు ఉండదని చైనా భావిస్తోందని తైవాన్‌ విదేశాంగ మంత్రి హెచ్చరించారు. తైవాన్‌ రేవులు, విమానాశ్రయాలను చైనా దిగ్బంధిస్తే ప్రపంచ హైటెక్‌ పరిశ్రమలకు కావలసిన కంప్యూటర్‌ చిప్స్‌ సరఫరా ఆగిపోతుంది. ఈ చిప్స్‌ ప్రధానంగా తైవాన్‌ నుంచే ఎగుమతి అవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు