నెత్తిన రాకెట్ల శకలాలు పడే ప్రమాదం పెరగొచ్చు

భూకక్ష్యలో తిరుగుతున్న రాకెట్‌ శిథిలాలు నేలకు రాలి మనుషులను గాయపరిచే లేదా మరణం తెచ్చిపెట్టే ప్రమాదం వచ్చే దశాబ్దంలో ఆరు నుంచి పది శాతం వరకు ఉంటుందని కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకులు

Published : 11 Aug 2022 05:38 IST

 నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి
బ్రిటిష్‌ కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకుల సూచన

టొరంటో: భూకక్ష్యలో తిరుగుతున్న రాకెట్‌ శిథిలాలు నేలకు రాలి మనుషులను గాయపరిచే లేదా మరణం తెచ్చిపెట్టే ప్రమాదం వచ్చే దశాబ్దంలో ఆరు నుంచి పది శాతం వరకు ఉంటుందని కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకులు అంచనా వేశారు. దీన్ని నివారించడానికి ప్రభుత్వాలు కొంత ఎక్కువ ఖర్చు పెట్టయినా సరే రాకెట్‌ అవశేషాలను భద్రంగా దించి ప్రాణాలను కాపాడాలని కోరారు. ఉపగ్రహాలను ప్రయోగించిన తరవాత కక్ష్యలో బాగా దిగువన ఉన్న రాకెట్‌ భాగాలు కిందపడిపోతాయి. అవి నేలకు రాలేటప్పుడు వాతావరణ రాపిడికి చాలా వరకు దగ్ధమైపోతాయి. కొన్ని శకలాలు మాత్రం దగ్ధం కాకుండా నేల మీద పడతాయి. అవి మనుషుల మీద పడితే ప్రాణాపాయం కలగవచ్చు లేదా తీవ్ర గాయాలైనా తగలవచ్చు. ఏదైనా శకలం గాలిలో పయనిస్తున్న విమానం మీద పడితే ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉపగ్రహాలను ప్రవేశపెట్టే కక్ష్యా మార్గాలను బట్టి చూస్తే ఉత్తరార్ధ గోళంలోని న్యూయార్క్‌, మాస్కో, బీజింగ్‌ వంటి నగరాలకన్నా ఢాకా, జకార్తా, లాగోస్‌లకు రాకెట్‌ శిథిలాల ముప్పు చాలా ఎక్కువ. 2020లో ఒక రాకెట్‌కు చెందిన 12 మీటర్ల పొడవైన గొట్టం ఐవరీ కోస్ట్‌లోని ఒక గ్రామంపై పడి ఇళ్లకు నష్టం కలిగించింది. ఇవాళ ఉపగ్రహ ప్రయోగాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి రాకెట్‌ శకలాల వల్ల ముప్పు కూడా అధికమవుతుందని పరిశోధకులు వివరించారు. ఇంతవరకు ఇలాంటి ఘటనల్లో వ్యక్తులు కానీ, పెద్ద జన సమూహాలు కానీ గాయపడిన, చనిపోయిన సందర్భాలు లేకపోయినంత మాత్రాన అజాగ్రత్త పనికిరాదన్నారు. ముందుచూపుతో వ్యవహరించి ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన తరవాత రాకెట్‌ ఇంజిన్‌ మళ్లీ పనిచేసేట్లు, అదనపు ఇంధనాన్ని నింపడం ద్వారా రాకెట్‌ భాగాలు భద్రంగా నేలకు దిగేట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని