పాక్‌ ఉగ్రవాది రవూఫ్‌ వ్యవహారంలో చైనా వైఖరి అత్యంత అనుచితం

పాకిస్థాన్‌కు చెందిన జైష్‌-ఎ-మహమ్మద్‌ (జేఈఎం) ఉగ్రవాద ముఠా ఉప అధిపతి అబ్దుల్‌ రవూఫ్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదనకు చైనా మోకాలు అడ్డటాన్ని భారత్‌ ఆక్షేపించింది. చైనా చర్య ‘అత్యంత అనుచితం’ అంటూ

Published : 13 Aug 2022 05:29 IST

భారత్‌ ఆక్షేపణ

దిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన జైష్‌-ఎ-మహమ్మద్‌ (జేఈఎం) ఉగ్రవాద ముఠా ఉప అధిపతి అబ్దుల్‌ రవూఫ్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదనకు చైనా మోకాలు అడ్డటాన్ని భారత్‌ ఆక్షేపించింది. చైనా చర్య ‘అత్యంత అనుచితం’ అంటూ శుక్రవారం అభివర్ణించింది. ‘‘ఉగ్రవాదంపై సమష్టి పోరు విషయంలో అంతర్జాతీయ సమాజం ముక్తకంఠంతో మాట్లాడలేకపోవడం దురదృష్టకరం’’ అని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఆరిందం బాగ్చీ విలేకరులతో అన్నారు. అయితే భారత్‌ మాత్రం తన వైఖరిని కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో భారత్‌, అమెరికాలు సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను చైనా బుధవారం అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనకు భద్రతామండలిలోని మిగతా 14 సభ్య దేశాలూ మద్దతివ్వడం గమనార్హం. పాక్‌కు చెందిన లష్కరే తైబా ఉగ్రవాద ముఠా ఉప అధిపతి అబ్దుల్‌ రెహ్మాన్‌ మక్కీ విషయంలోనూ భారత్‌, అమెరికా సంయుక్తంగా చేసిన ఇలాంటి ప్రతిపాదనను ఇటీవల చైనా తిరస్కరించింది. గతంలోనూ పాక్‌కు చెందిన ఉగ్రవాదులను గుర్తించే విషయంలో పలు ప్రతిపాదనలను డ్రాగన్‌ అడ్డుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని