జపొరిజియా అణువిద్యుత్కేంద్రంపై దాడులు

ఉక్రెయిన్‌లోని జపొరిజియా అణువిద్యుత్కేంద్రం దగ్గర పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గత వారం నుంచి ఈ కేంద్రంపై వరుస దాడులు జరుగుతున్నాయి. దీనికి కారణం మీరే.. కాదు మీరే అంటూ రష్యా, ఉక్రెయిన్‌ పరస్పరం ఆరోపణలు

Published : 13 Aug 2022 05:29 IST

ఆందోళన వ్యక్తం చేసిన ఐరాస భద్రతామండలి

కీవ్‌: ఉక్రెయిన్‌లోని జపొరిజియా అణువిద్యుత్కేంద్రం దగ్గర పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గత వారం నుంచి ఈ కేంద్రంపై వరుస దాడులు జరుగుతున్నాయి. దీనికి కారణం మీరే.. కాదు మీరే అంటూ రష్యా, ఉక్రెయిన్‌ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. గురువారం అణుకేంద్రాన్ని పది బాంబులు ఢీకొట్టాయని ఇరు దేశాలూ పేర్కొన్నాయి. దీంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పరిస్థితిని సమీక్షించింది. అణు విద్యుత్‌ కేంద్రం దగ్గర పరిస్థితి దారుణంగా ఉందని సమావేశంలో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఛైర్మన్‌ రఫెల్‌ గ్రాసీ హెచ్చరించారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఐరాస నిపుణులు కమిటీని జపొరిజియాకు పంపాలని అమెరికా, చైనా ప్రతిపాదించాయి. గతంలోనూ ఇలాంటి డిమాండ్లు వచ్చిన రష్యా అంగీకరించకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రాంతాన్ని నిస్సైనికీకరణ చేయాలని అమెరికా డిమాండ్‌ చేసింది. దీనికి రష్యా అభ్యంతరం తెలిపింది. నిస్సైనికీకరణ చేస్తే.. అణుకేంద్రంపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. భద్రతా మండలిలో భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ కేంద్రం భద్రతకు భారత్‌ చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. ప్రమాదం జరిగితే ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. గత వారం నుంచి ఈ కేంద్రం పరిసర ప్రాంతాల్లో భారీస్థాయిలో కాల్పులు జరుగుతున్నాయి.  జపొరిజియా.. ఐరోపాలోనే అతి పెద్ద అణువిద్యుత్‌ కేంద్రం. మార్చిలోనే ఈ కేంద్రాన్ని రష్యా తన వశం చేసుకుంది. నిర్వహణ మాత్రం ఉక్రెయిన్‌కు చెందిన ఎనగో అటమ్‌ సంస్థ నిర్వహిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌ నుంచి 23 వేల మెట్రిక్‌టన్నుల గోధుమలతో ఓ నౌక ఆఫ్రికాకు బయల్దేరింది. తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇథియోపియాకు అందిస్తున్న మానవతా సాయంలో భాగంగా ఈ గోధుమలను పంపిస్తున్నట్లు ఐరోపా మండలి అధ్యక్షుడు చార్లెస్‌ మైకెల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని