వెంటిలేటర్‌పై సల్మాన్‌ రష్దీ

దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బుకర్‌ ప్రైజ్‌ విజేత, ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీ వెంటిలేటర్‌పై ఉన్నారు. శుక్రవారం కత్తిపోట్లకు గురైన ఆయన ఒక కంటిని కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కాలేయంపైనా

Published : 14 Aug 2022 05:52 IST

ఒక కన్ను కోల్పోయే ప్రమాదం.. కాలేయానికి గాయం

దాడిపై సర్వత్రా నిరసన

న్యూయార్క్‌: దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బుకర్‌ ప్రైజ్‌ విజేత, ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీ వెంటిలేటర్‌పై ఉన్నారు. శుక్రవారం కత్తిపోట్లకు గురైన ఆయన ఒక కంటిని కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కాలేయంపైనా బలమైన గాయాలయ్యాయి. మోచేతిలో నరాలు తెగిపోయాయి. న్యూయార్క్‌లో సాహిత్య సంబంధిత ఒక కార్యక్రమానికి హాజరైన ఆయనపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని న్యూజెర్సీలోని ఫెయిర్‌వ్యూ నివాసి హాది మతార్‌ (24)గా గుర్తించారు. కత్తిపోట్లతో అధికంగా రక్తం కోల్పోయిన రష్దీని ఘటనాస్థలి నుంచి పెన్సిల్వేనియాలోని ఆసుపత్రికి హెలికాప్టర్లో తరలించి, కొన్ని గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు. చాలాఏళ్లుగా ప్రాణహాని ముప్పును ఎదుర్కొంటూ వస్తున్న ఆయన ప్రస్తుతం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. దాడి వెనుక ఉద్దేశమేమిటనేది తెలుసుకోవడంపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఘటనాస్థలంలో లభ్యమైన ఆధారాలను వారు పరిశీలిస్తున్నారు. నిందితుడి వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనేది తెలుసుకోవడంపై దృష్టి కేంద్రీకరించారు.

మతార్‌కు రివల్యూషనరీ గార్డ్‌తో సంబంధాలు!

దాడికి పాల్పడిన మతార్‌ సామాజిక మాధ్యమ ఖాతాలను అధికారులు పరిశీలించారు. అతడు షియా అతివాదంతో, ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ దళంతో సంబంధాలున్న వ్యక్తిగా భావిస్తున్నారు. తన ఫేస్‌బుక్‌ పేజీలో ఇరాన్‌ సుప్రీంనేత ఆయతుల్లా ఖొమేనీ చిత్రాన్ని పోస్ట్‌ చేసినట్లు గుర్తించారు. రష్దీని హతమార్చాలని ఖొమేనీ చాలాకాలం క్రితమే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మతార్‌ ఏ దేశానికి చెందినవాడనేది అధికారులు చెప్పలేకపోతున్నారు. సమావేశ స్థలంలోనే ఉన్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ సమయంలో అతడు నల్ల దుస్తులు, అదే రంగు మాస్కు ధరించి ఉన్నాడు. చౌతాక్వా ఇన్‌స్టిట్యూషన్‌ చరిత్రలో ఇంతవరకు ఇలాంటి ఘాతుకాలు కనిపించలేదని, భద్రత మరీ ఎక్కువగా ఉంటే సభలకు వచ్చేవారికి ఇబ్బంది అనే ఉద్దేశంతో దానికి సంబంధించిన సిఫార్సులనూ పక్కనపెట్టేశామని నిర్వాహకులు చెబుతున్నారు. తనచుట్టూ భద్రత వలయం మరీ ఎక్కువగా ఉంటోందని గతంలో స్వయంగా రష్దీయే ఫిర్యాదు చేసినట్లు ‘ది న్యూయార్క్‌ పోస్ట్‌’ ఒక కథనం వెలువరించింది.

దాడి కలవరం కలిగించింది: ఐరాస

రష్దీపై దాడిని ఐరాస ప్రతినిధులు, వివిధ దేశాల నేతలు ఖండించారు. ఈ విషయం కలవరపాటు కలిగించిందని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ చెప్పారు. స్వేచ్ఛగా భావాలు వ్యక్తీకరించేవారిపై ఇలాంటి ఘటనలకు పాల్పడడం ఎంతమాత్రం తగదని అన్నారు. దాడి గురించి తెలిసి దిగ్భ్రాంతి చెందినట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చెప్పారు. ప్రధాని ఎన్నికల రేసులో ఉన్న రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌ స్పందిస్తూ.. వాక్‌ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వ్యక్తిపై కత్తికట్టడం దారుణమని అన్నారు. నిర్భీతిగా నిజాలను వెల్లడిస్తూ వస్తున్న రచయితపై ఇలాంటి దాడి జరగడం భయానకమని న్యూయార్క్‌ గవర్నర్‌ కేథే హోచుల్‌ అన్నారు. దాడిపై ఇరాన్‌లో మాత్రం మిశ్రమ స్పందన కనిపించింది. ఇస్లాంను రష్దీ అవమానపరిచారనీ, దాడి ఘటన ఆనందాన్ని కలిగించిందని కొంతమంది బాహాటంగానే హర్షం వ్యక్తంచేశారు. ఇలాంటి వాటితో ఇరాన్‌ ఇంకా ఏకాకి అయిపోతుందని మరికొందరు ఆందోళన వెలిబుచ్చారు.


ఖండించిన బాలీవుడ్‌

ముంబయి: రష్దీపై దాడి అనాగరిక చర్య అని బాలీవుడ్‌ ప్రముఖులు జావేద్‌ అఖ్తర్‌, కంగనా రనౌత్‌, స్వరభాస్కర్‌ తదితరులు పేర్కొన్నారు. రష్దీ రచించిన ‘ది సెటానిక్‌ వెర్సెస్‌’ను గతంలో భారత్‌లో నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం సబబేనని కేంద్ర మాజీ మంత్రి నట్వర్‌సింగ్‌ అన్నారు. రష్దీ గొప్ప రచయిత అనీ, ఆయన రచించిన పుస్తకాన్ని కేవలం శాంతి-భద్రతల కోణంలోనే అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ నిషేధించారని చెప్పారు. రచయితపై దాడిని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ఖండిస్తూ.. సృజనాత్మక వ్యక్తీకరణకు స్వేచ్ఛ లేకపోతే అంతకంటే దారుణం మరొకటి ఉండదని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని