రష్దీకి వెంటిలేటర్‌ తొలగింపు

హత్యాయత్నానికి గురైన ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఆయన మాట్లాడగలిగే పరిస్థితికి చేరుకోవడంతో వైద్యులు వెంటిలేటర్‌ను తొలగించారు.

Published : 15 Aug 2022 05:25 IST

కాస్త మెరుగైన ఆరోగ్య పరిస్థితి

మాట్లాడగలుగుతున్నట్లు వెల్లడి

మతార్‌కు బెయిల్‌ నిరాకరణ

న్యూయార్క్‌, లండన్‌ : హత్యాయత్నానికి గురైన ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఆయన మాట్లాడగలిగే పరిస్థితికి చేరుకోవడంతో వైద్యులు వెంటిలేటర్‌ను తొలగించారు. ఈ విషయాన్ని రష్దీ ప్రతినిధి ధ్రువీకరించారు. కత్తితో దాడి చేసిన హాది మతార్‌ను లెబనాన్‌ మూలాలున్న అమెరికా జాతీయునిగా గుర్తించారు. అతనిని శనివారం కోర్టులో హాజరు పరిచినప్పుడు తనపై అభియోగాలను తోసిపుచ్చాడు. నిందితునికి బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. రష్దీకి మెడ కుడివైపు ముందు భాగాన మూడు, కడుపులో నాలుగు, కుడి కంటికి, ఛాతీకి ఒక్కొక్కటి చొప్పున కత్తిపోట్లు ఉన్నట్లు న్యాయస్థానానికి ప్రాసిక్యూటర్లు నివేదించారు. ఎలాంటి కవ్వింపు లేకుండా, పథకం ప్రకారం దాడి జరిపినట్లు తెలిపారు. సభకు హాజరయ్యేందుకు అవసరమైన పాసును పొంది, బస్సులో సభా వేదిక వద్దకు అతను వచ్చినట్లు కోర్టుకు వివరించారు. హత్యాయత్నానికి సంబంధించిన అభియోగాలు రుజువైతే మతార్‌కు 32 ఏళ్ల వరకు కారాగార శిక్ష పడే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌ తెలిపారు.

బైడెన్‌ సంఘీభావం
రష్దీపై దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ ఖండించారు. ఈ ఘటన తమకు దిగ్భ్రాంతిని, విచారాన్ని కలిగించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గొంతు నొక్కాలని చూస్తున్నవారిని ఎదుర్కొని, సార్వత్రిక ఆలోచనలతో, ధైర్యంగా ముందడుగు వేస్తున్న వ్యక్తిగా ఆయన్ని కొనియాడారు. వాక్‌ స్వాతంత్య్రానికి కట్టుబడిఉన్న వారందరి తరఫున రష్దీకి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధించి, ఆ దేశ సైన్యాన్ని ఉగ్రవాద సంస్థగా భావించి నిషేధించాల్సిన సమయం ఆసన్నమైందని బ్రిటన్‌ మాజీ మంత్రి రిషి సునాక్‌ అభిప్రాయపడ్డారు.

హ్యారీ పోటర్‌ రచయితకు బెదిరింపు
‘హ్యారీ పోటర్‌’ సహా అనేక కాల్పనిక ధారావాహికలు రచించిన జె.కె.రౌలింగ్‌ను హతమారుస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. రష్దీపై దాడిని ఖండించినందుకు ట్విటర్‌ ద్వారా హెచ్చరికలు వచ్చాయని రౌలింగ్‌ వెల్లడించారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts