Published : 16 Aug 2022 06:25 IST

విశ్వవ్యాప్తంగా.. భారత తిరంగా..

దేశ దేశాల్లో సంబరాలు

ప్రపంచ నేతల శుభాకాంక్షలు

వాషింగ్టన్‌/మాస్కో/లండన్‌: భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. దేశ దేశాల్లో ఆనందోత్సాహాల మధ్య సోమవారం భారతీయులు సంబరాలు జరుపుకొన్నారు. దౌత్య కార్యాలయాల వద్ద జాతీయ పతాకాలను ఎగురవేసి, జాతీయ గీతాన్ని, దేశభక్తి గేయాలను ఆలపించారు. దౌత్య ప్రతినిధులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అయిన సందర్భంగా భారత్‌ సాధించిన విజయాలను ప్రపంచ నేతలు కొనియాడారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌ అధ్యక్షులు జో బైడెన్‌, వ్లాదిమిర్‌ పుతిన్‌, ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌; ఆస్ట్రేలియా, బ్రిటన్‌, ఇజ్రాయెల్‌ ప్రధానులు ఆంటొనీ ఆల్బనెస్‌, బోరిస్‌ జాన్సన్‌, యయిర్‌ లాపిడ్‌ ; మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్‌ సోలిహ్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని వారంతా ఆకాంక్షించారు.

మన బంధం సుదృఢం : బైడెన్‌

చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా సత్యం, అహింసలపై మహాత్మాగాంధీ ప్రబోధించిన సందేశాన్ని బైడెన్‌ గుర్తు చేసుకున్నారు. గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్‌-అమెరికాల మధ్య దౌత్య సంబంధాలు కూడా 75వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్నట్లు అభివర్ణించారు. ప్రజల మధ్య ఉన్న గట్టి బంధం ద్వారా ఉభయ దేశాల భాగస్వామ్యం మరింత బలపడుతుందన్నారు. భారత సంతతి ప్రజలు అమెరికాను మరింత సృజనాత్మకంగా, సమ్మిళితంగా, సుదృఢంగా మారుస్తున్నారని పేర్కొన్నారు. శాంతి, సుసంపన్నత, ప్రజా భద్రత తదితర అంశాల్లో రెండు ప్రజాస్వామ్య దేశాలు ఉమ్మడిగా కృషి చేస్తున్నాయని, మున్ముందూ ఇది కొనసాగుతుందని చెప్పారు. సవాళ్ల పరిష్కారంలో భారత్‌-అమెరికా పరస్పరం సహకరించుకుంటాయని తెలిపారు.

* దశాబ్దాల తరబడి భారత్‌ ప్రపంచం గుర్తించే స్థాయిలో ఆర్థిక, సామాజిక, శాస్త్ర సాంకేతిక తదితర రంగాల్లో విజయాలు సాధించిందని పుతిన్‌ తన సందేశంలో పేర్కొన్నారు. భారత్‌ ప్రతిష్ఠ ప్రపంచ వేదికపై గణనీయంగా పెరిగిందన్నారు.

* ఫ్రాన్స్‌ ఎప్పటికీ భారత్‌ పక్షాన నిలబడుతుందని ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ పేర్కొన్నారు.

* భారత్‌తో స్నేహం, సహకారానికి ఎప్పటికీ నిబద్ధతతో ఉన్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటొనీ ఆల్బనెస్‌ పేర్కొన్నారు. భారత్‌ ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఎదిగిన తీరు, సాధించిన విజయాలు గణనీయమైనవని ప్రశంసించారు.

* బోరిస్‌ జాన్సన్‌ ఈ ఏడాది ప్రారంభంలో తన భారత పర్యటన విశేషాలను గుర్తుచేసుకున్నారు. సబర్మతీ ఆశ్రమం వద్ద తీసుకున్న చిత్రాన్ని చూపించారు.

* అమెరికాలోని బోస్టన్‌లో 220 అడుగుల ఎత్తులో అమెరికా-భారత్‌ జాతీయ పతాకాలను కలిపి ఎగురవేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలకు గుర్తుగా తొలిసారి ఇలా ఎగురవేయగా.. ఇది అందరినీ ఆకట్టుకుంది.

* చైనా, సింగపూర్‌, నేపాల్‌, ఇజ్రాయెల్‌, యూఏఈ, కెనడా, మాల్దీవులు, బంగ్లాదేశ్‌, భూటన్‌ తదితర దేశాల దౌత్య కార్యాలయాల వద్ద స్వాతంత్య్ర దినోత్సవాలను నిర్వహించారు.


ప్రధాని మోదీ కృతజ్ఞతలు..

దిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఆయా దేశాల ద్వైపాక్షిక సంబంధాలను కొనియాడారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని