Updated : 17 Aug 2022 10:05 IST

అమెరికా ఆధిపత్యానికి కాలం చెల్లింది

 ఏకధ్రువ ప్రపంచం త్వరలో ముగుస్తుంది: పుతిన్‌

మాస్కో: ప్రపంచంపై ఆధిపత్యం చలాయించాలన్న అమెరికా వైఖరికి ఇక కాలం చెల్లినట్లేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చెప్పారు. ఉక్రెయిన్‌కు, రష్యాకు మధ్య వైరం మరింతకాలం కొనసాగాలని అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఏకధ్రువ ప్రపంచానికి కాలం చెల్లినట్లేనని చెప్పారు. ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాల నుంచి సైనికాధికారులు హాజరైన ఒక సదస్సును ఉద్దేశించి మంగళవారం ఆయన ప్రసంగించారు. రష్యా వ్యతిరేక రక్షణ కవచంగా ఉక్రెయిన్‌ను మార్చాలని అమెరికా ప్రయత్నిస్తుండడం వల్లనే ఆ దేశం (ఉక్రెయిన్‌)లోకి తమ సైనిక బలగాలను పంపించాల్సి వచ్చిందని చెప్పారు. ‘..వారి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలంటే ఘర్షణలు కొనసాగుతూ ఉండాలి. అందుకే ఉక్రెయిన్‌ ప్రజల్ని బలిపశువుల్ని చేశారు’ అని అమెరికాను ఉద్దేశించి అన్నారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల్లో అగ్నికి ఆజ్యం పోసిన తీరులోనే ఇప్పుడు ఉక్రెయిన్‌లోనూ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోందని చెప్పారు. ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు ఇస్తుండడం, అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఇటీవల తైవాన్‌కు వెళ్లడం గురించి ఆయన ప్రస్తావించారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రపంచవ్యాప్త అస్థిరతకు అమెరికా ప్రయత్నిస్తోందన్నారు. పాశ్చాత్య దిగ్గజ దేశాలు తమ స్వీయ వైఫల్యాలకు బాధ్యతను రష్యా, చైనాల మీదికి నెట్టేయాలని అనుకుంటున్నాయని ఆరోపించారు. ఏకధ్రువ ప్రపంచ రోజులు త్వరలోనే ముగిసిపోతాయని చెప్పారు. రష్యా రక్షణ మంత్రి సెర్గే షొయిగు మాట్లాడుతూ- ఉక్రెయిన్‌కు కావాల్సిన ఆయుధాలను అమెరికా అందించిందనీ, వాటి వినియోగంలో కీలకమైన నిఘా సమాచారాన్ని అమెరికా మిత్రదేశాలు ఇచ్చాయని ఆరోపించారు. పోరులో తాము అణ్వాయుధాలు, రసాయన ఆయుధాలు వినియోగించవచ్చన్న అనుమానాలను తోసిపుచ్చారు. ఉక్రెయిన్‌లో తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు అణ్వాయుధాలు అవసరం లేదని చెప్పారు.

క్రిమియాలో ఆయుధ డిపోపై దాడులు

కీవ్‌: రష్యా నియంత్రణలో ఉన్న క్రిమియాలో మంగళవారం పెద్దఎత్తున పేలుళ్లు చోటుచేసుకుని మంటలు ఎగసిపడ్డాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి దాడి జరగడం ఇది రెండోసారి. ఘటన తర్వాత దాదాపు మూడు వేల మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మేస్కోయే ప్రాంతంలోని ఆయుధ నిల్వల గిడ్డంగిపై జరిగిన ఈ దాడి ‘విద్రోహ చర్య’ అని రష్యా ఆరోపించింది. దాడుల్లో విద్యుత్తు ప్లాంటు, విద్యుత్తు తీగలు, రైలు మార్గాలు, కొన్ని అపార్ట్‌మెంట్లు దెబ్బతిన్నట్లు రష్యా మంత్రిత్వశాఖ తెలిపింది. గతవారం జరిగిన దాడులకు ఉక్రెయినే కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఉక్రెయిన్‌ ఇంతవరకు దీనిపై స్పష్టతనివ్వలేదు.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని