పాక్‌లో చైనా సైన్యం!

అప్పు తీసుకుంటే సకాలంలో తీర్చాలి. తీర్చకపోతే అప్పిచ్చిన వాడి డిమాండ్లకైనా తలొగ్గాలి. ఇప్పుడు  పాకిస్థాన్‌ది ఇదే పరిస్థితి. చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సీపెక్‌) పేరుతో ఆ దేశాన్ని అప్పుల ఊబిలో దింపిన డ్రాగన్‌.. ఇప్పుడు గొంతెమ్మ

Published : 18 Aug 2022 05:47 IST

డ్రాగన్‌ కొత్త ఎత్తుగడ
తెరపైకి సైనిక అవుట్‌పోస్టుల ప్రతిపాదన

ఇస్లామాబాద్‌: అప్పు తీసుకుంటే సకాలంలో తీర్చాలి. తీర్చకపోతే అప్పిచ్చిన వాడి డిమాండ్లకైనా తలొగ్గాలి. ఇప్పుడు  పాకిస్థాన్‌ది ఇదే పరిస్థితి. చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సీపెక్‌) పేరుతో ఆ దేశాన్ని అప్పుల ఊబిలో దింపిన డ్రాగన్‌.. ఇప్పుడు గొంతెమ్మ కోరికలు కోరుతోంది. ఏకంగా ఆ దేశ సార్వభౌమత్వానికే ఎసరు పెట్టేలా సైనిక అవుట్‌ పోస్టుల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పాక్‌ పాలకులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. పాక్‌లోని తమ సంస్థల రక్షణ కోసమే ఈ అవుట్‌ పోస్టులని చెబుతున్నా... ఆ పేరుతో సైన్యాన్ని దించడం వెనుక డ్రాగన్‌కు దీర్ఘకాలిక వ్యూహాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా మంగళవారమే శ్రీలంకలోని హంబన్‌ టోటాలో చైనా.. తన అత్యాధునిక నిఘా నౌక యువాన్‌ వాంగ్‌ను మోహరించింది. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సైనిక అవుట్‌పోస్టుల ప్రతిపాదన ఆందోళన కలిగించే అంశమే.

జోరుగా మంతనాలు

ఈ ప్రతిపాదనపై గత కొన్ని రోజులుగా పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, సైన్యాధిపతి ఖమర్‌ బజ్వాతో చైనా అధికారులు మంతనాలు సాగిస్తున్నారు. నిజానికి పాకిస్థాన్‌కు ఈ ప్రతిపాదన ఇష్టం లేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యతిరేకించనూ లేదు. ఎందుకంటే అప్పుల రూపంలో డ్రాగన్‌ చేస్తున్న సాయంతోనే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మనుగడ సాగిస్తోంది. పైగా చైనా సంస్థలకు 300 బిలియన్ల పాకిస్థానీ రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. వాటిని చెల్లించకపోతే తాము నిర్వహిస్తున్న విద్యుత్కేంద్రాల్లో విద్యుత్‌ను ఆపేస్తామని అవి బెదిరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవుట్‌పోస్టుల కోసం చైనా తెస్తున్న ఒత్తిడి పాక్‌ పాలకుల్లో గుబులు రేపుతోంది.

అఫ్గాన్‌కూ విస్తరణ

చైనా డిమాండుకు అంగీకరిస్తే అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ పరపతి తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. దేశీయంగానూ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే సీపెక్‌లో భాగంగా పనిచేస్తున్న చైనా ఉద్యోగులపై వివిధ ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అవుట్‌పోస్టుల విషయంలో పాక్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. మరోవైపు ఈ ప్రతిపాదనను అఫ్గానిస్థాన్‌కూ విస్తరించాలని చైనా భావిస్తోంది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని