బాగమతి... ఉక్కిరిబిక్కిరి!

నేపాలీల వ్యవసాయం, జీవనంతో శతాబ్దాలుగా ముడిపడిన పవిత్ర బాగమతి నది... తీవ్ర కాలుష్యం, దుర్గంధంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. హిమగిరుల్లో ఆరంభమై అత్యంత రమణీయ ప్రకృతి లోగిళ్ల మీదుగా పారే ఈ నీటికి ఆత్మలను

Published : 18 Aug 2022 05:47 IST

పవిత్ర నదిలో నల్లటి మురుగు, తీవ్ర దుర్గంధం

కాఠ్‌మాండూ: నేపాలీల వ్యవసాయం, జీవనంతో శతాబ్దాలుగా ముడిపడిన పవిత్ర బాగమతి నది... తీవ్ర కాలుష్యం, దుర్గంధంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. హిమగిరుల్లో ఆరంభమై అత్యంత రమణీయ ప్రకృతి లోగిళ్ల మీదుగా పారే ఈ నీటికి ఆత్మలను శుద్ధిచేసే మహత్తర శక్తి ఉందని నమ్ముతారు. ఎంతో స్వచ్ఛంగా బయల్దేరే ఈ జలాలు... రాజధాని కాఠ్‌మాండూకు వచ్చేసరికి మురుగు, చెత్త, రసాయన వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, కాలిన దేహాలతో నిండిపోతున్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన పశుపతినాథ్‌, హిందూ ఆలయాల చుట్టూ ఇవి ప్రవహిస్తున్నాయి. ఈ ఆలయం సమీపాన రాతి మెట్టుపై... చనిపోయినవారి పాదాలను, మొహాన్ని బాగమతి జలాలతో కడిగితే వారి ఆత్మలు శుద్ధి అవుతాయని చెబుతుంటారు. కానీ, ఇప్పుడు మృతదేహాలను ఇక్కడకు తీసుకొచ్చినా, నదీ జలాలకు బదులు దుకాణాల్లో విక్రయించే సీసా నీళ్లతోనే శుద్ధి ప్రక్రియ చేపడుతున్నారు.

కృషి ఫలించేనా?

కాఠ్‌మాండూలోని బాగమతి తీరం నుంచి చెత్తను తొలగించేందుకు ప్రభుత్వంతో పాటు వాలంటీర్లు కూడా ఏడేళ్లుగా కృషి చేస్తున్నారు. ఇప్పటివరకూ ఇక్కడ 80% చెత్తను బయటకు తీశామని, ఇందులో మృతదేహాల అవశేషాలు కూడా లభించాయని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న ఉన్నతస్థాయి కమిటీ సభ్యురాలు మాలా ఖరెల్‌ చెప్పారు.

అయితే, ఇక్కడ వందల కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నాయి. తీరాన్ని వదిలి వెళ్లేందుకు వారు నిరాకరిస్తుండటంతో అక్కడి నుంచి నిత్యం చెత్త, మురుగు నదిలో కలుస్తోంది. దీంతో చేసేదిలేక 2013 నుంచి జలశుద్ధి ప్రక్రియ చేపడుతున్నారు. తమ కృషి ఫలిస్తుందని, మరో పదేళ్లలో బాగమతి మళ్లీ శుద్ధ జలాలతో, పరిశుభ్రమైన తీరాలతో అలరారుతుందని ఖరెల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలుగా నది తన వైభవాన్ని కోల్పోతున్న తీరును చూస్తున్న పూజారి పండిట్‌ శివహరి సుబేది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘బాగమతికి పూర్వవైభవం తెస్తామని రాజకీయ నేతలంతా చెబుతున్నారు. కానీ, మార్పు కనిపించడం లేదు. ఇక జరగాల్సింది అద్భుతమే. భారీ వరద ఒక్కసారిగా నదిలోని చెత్తనంతా కొట్టుకువస్తే.. దానంతట అదే పునరుజ్జీవం సంతరించుకుంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts