ప్రపంచమంతటా బానిసత్వ ఛాయలు

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బానిసత్వపు ఛాయలు ఇంకా తొలగిపోలేదని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక స్పష్టం చేసింది. వివిధ రూపాల్లో ఆ జాఢ్యం కొనసాగుతూనే ఉందని తెలిపింది. దక్షిణాసియాలో దళిత మహిళలు

Published : 19 Aug 2022 04:22 IST

 భారత్‌లో బలవంతపు పెళ్లిళ్లు ఎక్కువే

బాలకార్మిక వ్యవస్థ, కుల వివక్ష, పేదరికం మధ్య పరస్పర సంబంధం

దక్షిణాసియాలో తీవ్ర వివక్షకు గురవుతున్న దళిత మహిళలు

ఐరాస తాజా నివేదికలో వెల్లడి

ఐరాస: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బానిసత్వపు ఛాయలు ఇంకా తొలగిపోలేదని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక స్పష్టం చేసింది. వివిధ రూపాల్లో ఆ జాఢ్యం కొనసాగుతూనే ఉందని తెలిపింది. దక్షిణాసియాలో దళిత మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో బాలకార్మిక వ్యవస్థ, కుల వివక్ష, పేదరికం పరస్పరం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని పేర్కొంది. ‘బానిసత్వపు సమకాలీన రూపాలు, వాటి ఉనికికి కారణాలు, ప్రభావాలు’ అనే అంశంపై ఐరాస మానవహక్కుల మండలి ప్రత్యేక ప్రతినిధి తొమోయా ఒబొకటా తన నివేదికను తాజాగా సమర్పించారు. బానిసత్వం, సామ్రాజ్యవాద భావన, ప్రభుత్వ ప్రాయోజిత వివక్ష వంటివాటితో ప్రపంచవ్యాప్తంగా మైనారిటీ వర్గాలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాయని అందులో పేర్కొన్నారు. భారత్‌తో పాటు అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, సోమాలియా, శ్రీలంక, వియత్నాం, కంబోడియా, కజఖ్‌స్థాన్‌ వంటి దేశాల్లో మహిళలు, బాలికల బలవంతపు పెళ్లిళ్లు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు తెలిపారు. పాకిస్థాన్‌లో ఈ సమస్య మరింత అధికంగా ఉందని వెల్లడించారు. మరోవైపు- మైనారిటీ వర్గాలు, వలస కార్మికుల హక్కుల కోసం వివిద దేశాల్లో కార్మిక సంఘాలు విశేష కృషిచేస్తున్నాయని ప్రశంసించారు. భారత్‌, చిలీ, కంబోడియా, ఘనాల్లో మహిళా కార్మికులకు ఆ సంఘాలు అండగా నిలుస్తున్నాయంటూ కితాబిచ్చారు.


మరిన్ని ముఖ్యాంశాలివీ..

* బాలకార్మిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. ఆసియా పసిఫిక్‌, పశ్చిమాసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపాల్లో 4-6% మంది బాలలు కార్మికులుగా ఉన్నారు. ఆఫ్రికాలో ఇది 21.6%గా ఉంది. సబ్‌ సహారన్‌ ఆఫ్రికాలోనైతే అది ఏకంగా 23.9%గా నమోదైంది.

* పలు దేశాల్లో ప్రభుత్వ విధానాలు, బడ్జెట్‌ కేటాయింపుల్లో అణగారిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మానవహక్కుల ఉల్లంఘన వంటివి చోటుచేసుకున్నప్పుడు.. వారికి తర్వాత న్యాయం జరిగే అవకాశాలు పరిమితంగా ఉంటున్నాయి. మీడియా, పాఠ్యపుస్తకాలు, అంతర్జాలంలో కొన్ని నిర్దిష్ట వర్గాలపై పథకం ప్రకారం దుష్ప్రచారం జరుగుతోంది.

* దక్షిణాసియాలో దళిత మహిళలకు దాదాపుగా అన్ని విషయాల్లో స్వేచ్ఛ కరవవుతోంది. దక్షిణాసియా దళితుల్లో పలువురు బానిస కూలీలుగా కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్‌ సహా పలు దేశాల్లో దళిత మహిళలు ఇప్పటికీ మానవ విసర్జితాలను చేతులతోనే తొలగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

* దక్షిణ, తూర్పు ఐరోపాల్లో రోమా వంటి అణగారిన వర్గాల్లో బాల్య వివాహాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

* చైనాలో షింజియాంగ్‌ ప్రావిన్సులో వీఘర్‌ ముస్లింలతో బలవంతంగా పనులు చేయిస్తున్నారు. గల్ఫ్‌ దేశాలు, బ్రెజిల్‌, కొలంబోల్లో ఇళ్లలో బలవంతపు చాకిరీ చేయించుకుంటున్న ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని