10 మందిని కంటే పది లక్షల రూబుళ్లు

జనాభా తగ్గిపోతోందన్న ఆందోళన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. సోవియట్‌ కాలం నాటి పథకాన్ని తిరిగి తెరపైకి తెచ్చారు. పది, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలకు నజరానా ప్రకటించారు.

Published : 19 Aug 2022 04:22 IST

 ‘మదర్‌ హీరోయిన్‌’లకు పుతిన్‌ నజరానా

జనాభా పెంపుదలకు రష్యా ప్రత్యేక చర్యలు

మాస్కో: జనాభా తగ్గిపోతోందన్న ఆందోళన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. సోవియట్‌ కాలం నాటి పథకాన్ని తిరిగి తెరపైకి తెచ్చారు. పది, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలకు నజరానా ప్రకటించారు. ఇలాంటి వారిని ‘మదర్‌ హీరోయిన్‌’గా గుర్తించి, 10 లక్షల రూబుళ్లను (భారత కరెన్సీలో దాదాపు రూ.13 లక్షలకుపైన) పురస్కారంగా ఇస్తారని ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ కథనం వెల్లడించింది. ఈ మొత్తాన్ని 10వ బిడ్డ మొదటి పుట్టిన రోజునాడు చెల్లిస్తారు. 

పోషణ సాధ్యమేనా?

ప్రస్తుత పరిస్థితుల్లో నగదు పురస్కారం కోసం పదిమంది పిల్లలకు జన్మనిచ్చి, వారిని పోషించడం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 1944లో అప్పటి సోవియట్‌ అధినేత జోసెఫ్‌ స్టాలిన్‌ ఈ అవార్డును ప్రవేశపెట్టారు. దాదాపు 4 లక్షల మందికి దీనిని అందజేశారు. 1991లో సోవియెట్‌ యూనియన్‌ కుప్పకూలాక పథకం రద్దయింది. అప్పట్లో రష్యా జనాభా 14.82 కోట్లు. 2021 నాటికి అది 14.61 కోట్లకు తగ్గిపోయింది. సంతాన సాఫల్యత తగ్గడం, మరణాలు పెరగడం, వలసలు పెరిగిపోవడంలాంటివి దీనికి దారితీశాయి. ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలుపెట్టిన నాటినుంచి ఇప్పటివరకు దాదాపు 15 వేల మంది రష్యా సైనికులు మృతిచెంది ఉంటారని అంచనా. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పుతిన్‌ ఆనాటి అవార్డును వెలుగులోకి తీసుకువస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని