కొవిడ్‌ నుంచి కోలుకున్నా... రెండేళ్ల వరకూ ముప్పు!

కొవిడ్‌ నుంచి కోలుకున్నా.. చాలామంది బాధితులను రెండేళ్ల వరకూ మానసిక, నాడీ సమస్యలు వెంటాడుతున్నట్టు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ హెచ్చరించింది. వారిని ఎక్కువగా ఆందోళన, వ్యాకులత, చిత్త వైకల్యం, మూర్చ, సైకోసిస్‌,

Published : 19 Aug 2022 05:22 IST

 చుట్టుముడుతున్న మానసిక, నాడీ సమస్యలు

లండన్‌: కొవిడ్‌ నుంచి కోలుకున్నా.. చాలామంది బాధితులను రెండేళ్ల వరకూ మానసిక, నాడీ సమస్యలు వెంటాడుతున్నట్టు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ హెచ్చరించింది. వారిని ఎక్కువగా ఆందోళన, వ్యాకులత, చిత్త వైకల్యం, మూర్చ, సైకోసిస్‌, బ్రెయిన్‌ ఫాగ్‌ వంటి సమస్యలు చుట్టుముడుతున్నట్టు తెలిపింది. ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా, ఒమిక్రాన్‌ల బాధితుల్లోనే ఈ సమస్యలు అధికంగా ఉంటున్నట్టు నిర్ధారించింది. వైరస్‌ బాధిత చిన్నారుల్లోనూ మూర్చ, సీజర్స్‌ తదితర సమస్యలు కనిపిస్తున్నా, అవి పెద్దగా ఉండటం లేదని తెలిపింది. ఈ మేరకు చేపట్టిన అధ్యయనంలో 12.50 లక్షల మంది కొవిడ్‌ బాధితుల ఆరోగ్య వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. ‘ద లాన్సెట్‌ సైకియాట్రీ’ పత్రిక ఈ వివరాలను అందించింది. ‘‘కొవిడ్‌ బాధితులకు ఆరు నెలల వరకూ మానసిక, నాడీ సమస్యల ముప్పు ఉంటుందని మునుపటి పరిశోధనల్లో ప్రాథమికంగా తేలింది. కానీ, కొందరు రెండేళ్ల వరకూ ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు తాజాగా నిర్ధారణకు వచ్చాం. అయితే, ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ పరిస్థితి తలెత్తకుండా ఏం చేయాలి? ఒకవేళ మానసిక, నాడీ సంబంధ సమస్యలు చుట్టుముడితే ఎలాంటి చికిత్స అందించాలి? అన్న విషయాలపై మరిన్ని పరిశోధనలు సాగించాల్సి ఉంది’’ అని పరిశోధనకర్త ప్రొఫెసర్‌ పాల్‌ హారిసన్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ అనంతరం బాధితులకు శ్వాసకోశ వ్యాధుల కంటే మానసిక, నాడీ సమస్యల ముప్పే ఎక్కువగా ఉంటోందని... అయితే ఇవి తాత్కాలికమా లేక స్థిరంగా కొనసాగుతాయా అన్నది ఇంకా స్పష్టంగా చెప్పలేకపోతున్నామని అధ్యయనంలో పాల్గొన్న లండన్‌ విశ్వవిద్యాలయ కళాశాల ప్రొఫెసర్లు గ్లిన్‌ లూయిస్‌, జోనాథాన్‌ రోజర్స్‌లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని