రష్దీ బతికి ఉండడంతో ఆశ్చర్యపోయా

ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీపై హత్యాయత్నం చేసింది తానొక్కడినేననీ, దాని వెనుక ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ ప్రమేయమేమీ లేదని నిందితుడు హాదీ మతార్‌ స్పష్టంచేశాడు. రష్దీది కపట బుద్ధి అనీ, అందుకే తాను ఆయన్ని

Published : 19 Aug 2022 05:22 IST

 నేనొక్కడినే ఆయనపై దాడి చేశాను

దాని వెనుక ఇరాన్‌ ప్రమేయం లేదు

నిందితుడు మతార్‌ స్పష్టీకరణ

న్యూయార్క్‌: ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీపై హత్యాయత్నం చేసింది తానొక్కడినేననీ, దాని వెనుక ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ ప్రమేయమేమీ లేదని నిందితుడు హాదీ మతార్‌ స్పష్టంచేశాడు. రష్దీది కపట బుద్ధి అనీ, అందుకే తాను ఆయన్ని ఇష్టపడనని చౌతాకా జైలు నుంచి వీడియో ఇంటర్వ్యూ ద్వారా ‘న్యూయార్క్‌ పోస్ట్‌’కు తెలిపాడు. తాను దాడి చేసిన తర్వాత రష్దీ ప్రాణాలతో ఉన్నట్లు విని ఆశ్చర్యపోయానని చెప్పాడు. రష్దీని హతమార్చాలని ఇరాన్‌ సుప్రీం నేత అయతుల్లా ఖొమైనీ జారీ చేసిన ఫత్వాతో ప్రేరణ పొందే దాడి చేశారా అనే ప్రశ్నకు మతార్‌ స్పందించలేదు. అయతుల్లా గొప్ప వ్యక్తి అనీ, ఆయన్ని గౌరవిస్తానని మాత్రం చెప్పాడు. ‘‘రష్దీ వివాదాస్పద నవలలో కేవలం రెండు పేజీలే నేను చదివాను. ఆయన సాహిత్యం గురించి నాకు అంతగా తెలియదు. యూట్యూబ్‌లో కొన్ని ప్రసంగాల వీడియోలు మాత్రం చూశాను. రష్దీ న్యూయార్క్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం ఒక ట్వీట్‌ చూశాను. నా దృష్టిలో ఆయన మంచివ్యక్తి కాదు. ఇస్లాంపైనా, ఇస్లాం మతాన్ని ఆచరించేవారి విశ్వాసాలపైనా రష్దీ దాడి చేశారు. అందుకే ఆయన్ని హతమార్చాలని అనుకుని చౌతాకాకు వెళ్లాను. బస్సులో ఒకరోజు ముందే అక్కడకు చేరుకుని రాత్రంతా ఆరుబయటే గడిపాను’’ అని వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని