బరువెక్కిన హృదయాలు.. కన్నీటి చారికలు..

యుద్ధ గాయాలతో ఛిద్రమైన ఉక్రెయిన్‌ కుటుంబాల్లో మాదిరే... రష్యాలోనూ ఇప్పుడు బరువెక్కిన హృదయాలు, కన్నీటి చారికలు కనిపిస్తున్నాయి. అధ్యక్షుడు పుతిన్‌ జారీచేసిన ‘సైనిక సమీకరణ’ ఉత్తర్వులతో రష్యన్‌ కుటుంబాలు కలవరం చెందుతున్నాయి.

Updated : 24 Sep 2022 06:39 IST

సైనిక సమీకరణ ఉత్తర్వులతో కుటుంబాలను వీడుతున్న రష్యన్‌ యువకులు
యుద్ధ వ్యతిరేక ఆందోళనలపై ఉక్కుపాదం

యుద్ధ గాయాలతో ఛిద్రమైన ఉక్రెయిన్‌ కుటుంబాల్లో మాదిరే... రష్యాలోనూ ఇప్పుడు బరువెక్కిన హృదయాలు, కన్నీటి చారికలు కనిపిస్తున్నాయి. అధ్యక్షుడు పుతిన్‌ జారీచేసిన ‘సైనిక సమీకరణ’ ఉత్తర్వులతో రష్యన్‌ కుటుంబాలు కలవరం చెందుతున్నాయి. ఇష్టం లేకున్నా, ప్రభుత్వ ఆదేశాలకు లోబడి సైన్యంలోకి వెళ్తున్న తమ కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలుకుతూ పలువురు కన్నీటిపర్యంతం అవుతున్న దృశ్యాలు స్థానిక సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి. సర్కారు ఆదేశాలను ధిక్కరించడం, సైన్యం నుంచి అక్రమంగా పారిపోవడం, శత్రుసేనల ఎదుట లొంగిపోవడం చేయకూడదంటూ జారీ అయిన ఉత్తర్వులు... యువకులను అనివార్యంగా సైన్యంలోకి నెడుతున్నాయి. సైనిక సమీకరణను నిరసిస్తూ యుద్ధ వ్యతిరేకులు నిరసన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. పుతిన్‌ సర్కారుకు ఇది తలనొప్పిగా మారడంతో.. ఆందోళనలను ఎక్కడికక్కడ అణచివేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పోలీసులు నిరసనకారులను చెదరగొడుతూ, దొరికిన వారిని అరెస్టు చేస్తున్నారు.

రెఫరెండం ఆరంభం...

రష్యాలో విలీనమయ్యే అంశంపై ఆ దేశ నియంత్రణలోకి వెళ్లిన నాలుగు ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో శుక్రవారం రెఫరెండం ఆరంభమైంది. లుహాన్స్క్‌, దొనెట్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియాల్లో ఐదు రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మాస్కో అనుకూల అధికారులు తొలి నాలుగు రోజులు బ్యాలెట్‌ పత్రాలను ఇంటింటికి తెచ్చి ఇస్తారు. చివరిరోజు మంగళవారం వాటిని సమీపంలోని పోలింగ్‌ స్టేషన్లలో అందజేయాల్సి ఉంటుంది. రష్యాలో తలదాచుకుంటున్న ఆక్రమిత ప్రాంతాల శరణార్థులకూ ఓటింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.

పుతిన్‌ వదిలిన పాత పాచిక...

పుతిన్‌ ప్రయోగించిన రెఫరెండం పాచిక కొత్తదేమీ కాదు. 2014లో క్రిమియాను ఆక్రమించినప్పుడూ ఆయన సరిగ్గా ఇదే విధానాన్ని అనుసరించారు. రెఫరెండం పేరుతో ఓటింగ్‌ నిర్వహించి, ఆ భూభాగాన్ని కలిపేసుకున్నారు. తమ దేశంలో విలీనమయ్యేందుకు క్రిమియాలో 96.7% మంది అంగీకరించారంటూ నాడు రష్యా చెప్పింది. అయితే, ఇది పూర్తిగా అబద్ధమని, కేవలం 30% మంది మాత్రమే అందుకు అనుకూలంగా ఓటు వేశారని రష్యా మానవ హక్కుల మండలి తన నివేదికలో స్పష్టం చేసింది. దీనిపై అంతర్జాతీయ సమాజం నాడు గగ్గోలు పెట్టడం తప్ప, ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు లుహాన్స్క్‌, దొనెట్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియాలను విలీనం చేసుకునే విషయంలోనూ పుతిన్‌ అదే పాచికను మళ్లీ ప్రయోగిస్తుండటం గమనార్హం. మైకోలివ్‌ ప్రాంతంలోనూ రెఫరెండం నిర్వహించేందుకు క్రెమ్లిన్‌ తాజాగా యోచిస్తున్నట్టు తెలిసింది.

రెఫరెండం పేరుతో తమ భూభాగాలను వీలీనం చేసుకోవడం బూటకపు చర్య అని ఉక్రెయిన్‌తో పాటు అమెరికా, పశ్చిమ దేశాలు ధ్వజమెత్తుతున్నాయి. కొందరు రష్యన్‌ అధికారుల్లోనూ ఇదే అభిప్రాయం ఉంది. ‘‘ఉక్రెయిన్‌ ప్రజలు తమ దేశంతోనే ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే మా సైనికులపై పోరాడేందుకు ఆ దేశ పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు’’ అని రష్యా రక్షణశాఖ సలహాదారు యూరీ సాక్‌ పేర్కొన్నారు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని