ఉగ్రవాదులపై వేటుకు అకారణంగా అడ్డుపుల్ల

పాకిస్థాన్‌ కేంద్రంగా చెలరేగిపోతున్న ఉగ్రవాదులను నిషిద్ధ వ్యక్తుల జాబితాలో చేర్చి, వారిపై ఆంక్షలు విధించాలన్న తమ ప్రతిపాదనను కొన్ని దేశాలు అకారణంగా పదేపదే అడ్డుకుంటున్నాయని

Updated : 26 Sep 2022 06:17 IST

నిర్ణయాల్లో పారదర్శకత అవసరం

భారత్‌ అంటే తృతీయ ప్రపంచ దేశాల గళం

ఐరాసలో కేంద్ర మంత్రి జైశంకర్‌ ఉద్ఘాటన

న్యూయార్క్‌: పాకిస్థాన్‌ కేంద్రంగా చెలరేగిపోతున్న ఉగ్రవాదులను నిషిద్ధ వ్యక్తుల జాబితాలో చేర్చి, వారిపై ఆంక్షలు విధించాలన్న తమ ప్రతిపాదనను కొన్ని దేశాలు అకారణంగా పదేపదే అడ్డుకుంటున్నాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆక్షేపించారు. నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు పారదర్శకత అవసరమనీ, ఎలాంటి కారణాలు చూపకుండా ఒక ప్రయత్నాన్ని అడ్డుకోవడం తగదని చెప్పారు. ఉగ్రవాదం రాజకీయపరమైనది కాదనీ, దాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకోవడం తగదని అన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రసంగించేందుకు అమెరికాకు వచ్చిన ఆయన తన పర్యటన ముగింపు సందర్భంగా భారతీయ పాత్రికేయులతో మాట్లాడారు. ఉగ్రవాదులపై చర్యల విషయంలో భారత్‌ ప్రయత్నాలకు ఎదురవుతున్న అవరోధాలపై అటు సదస్సులో, ఇటు బ్రిక్స్‌ దేశాల విదేశాంగ మంత్రులతో భేటీలో ప్రధానంగా లేవనెత్తినట్లు ఆయన చెప్పారు. ఉగ్రవాదంతో ముప్పు ఉందని అన్ని దేశాలూ చెబుతుంటాయనీ, చర్యలు మాత్రం దానికి అనుగుణంగా ఉండడం లేదని విమర్శించారు. సదస్సులో జైశంకర్‌ మాట్లాడుతూ- రుణాలు, ఆహార సరఫరా, ఇంధన భద్రత వంటి అంశాల్లో జి-20 దేశాలతో కలిసి భారతదేశం పనిచేస్తుందని చెప్పారు. భిన్న ధ్రువాలుగా విడిపోయిన ప్రస్తుత ప్రపంచంలో భారత్‌ పాత్ర చాలా కీలకమైందని అన్నారు. ప్రపంచం భారత్‌ను తృతీయ ప్రపంచ దేశాల గళంగా పరిగణిస్తోందని తెలిపారు. భారత్‌ ఒక వారధి, ఒక గళం, ఒక దృక్కోణం, ఒక దారి అని పేర్కొన్నారు.

భారత్‌ సభ్యత్వానికి రష్యా మద్దతు
ఐరాస భద్రతామండలిలో భారత్‌, బ్రెజిల్‌లకు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న ప్రతిపాదనకు రష్యా మద్దతు ప్రకటించింది. ఈ రెండు దేశాలు అంతర్జాతీయంగా కీలకమైనవని పేర్కొంది. సమకాలీన వాస్తవాలకు అనుగుణంగా మండలిలో మార్పులు జరగాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్‌ అన్నారు. ఆయనతో జైశంకర్‌ జరిపిన చర్చల్లో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ద్వైపాక్షిక సహకారం, ఉక్రెయిన్‌ యుద్ధం, ఐరాస సంస్కరణలు వంటివి దీనిలో ఉన్నాయి. వివిధ రంగాల్లో ప్రధాన భాగస్వామిగా రష్యా నిలుస్తుందని జైశంకర్‌ చెప్పారు. 100 మందికి పైగా విదేశాంగ మంత్రులను, వారి ప్రతినిధులను కలిసిన ఆయన.. రెండో విడత పర్యటన కోసం ఆదివారం న్యూయార్క్‌ నుంచి వాషింగ్టన్‌ వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని