రష్యా పాఠశాలలో ఉన్మాది కాల్పులు

రష్యాలో ఓ ఉన్మాది సోమవారం బీభత్సం సృష్టించాడు. ఉద్ముర్షియా ప్రాంతంలోని ఇజెవ్‌స్క్‌ నగరంలో 88వ నంబరు పాఠశాలలోకి చొరబడి విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 15 మంది దుర్మరణం పాలయ్యారు

Published : 27 Sep 2022 04:53 IST

 15 మంది మృత్యువాత

24 మందికి గాయాలు

మాస్కో: రష్యాలో ఓ ఉన్మాది సోమవారం బీభత్సం సృష్టించాడు. ఉద్ముర్షియా ప్రాంతంలోని ఇజెవ్‌స్క్‌ నగరంలో 88వ నంబరు పాఠశాలలోకి చొరబడి విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 15 మంది దుర్మరణం పాలయ్యారు. 24 మంది గాయపడ్డారు. మృతుల్లో 11 మంది చిన్నారులు ఉన్నట్లు ఉద్ముర్షియా గవర్నర్‌ అలెగ్జాండర్‌ బ్రెచలోవ్‌ తెలిపారు. గాయపడ్డవారిలోనూ 22 మంది పిల్లలేనని పేర్కొన్నారు. ఈ విధ్వంసకాండకు పాల్పడిన ఉన్మాదిని 34 ఏళ్ల అర్టియోమ్‌ కజన్‌త్సెవ్‌గా పోలీసులు గుర్తించారు. అతడు గతంలో అదే పాఠశాలలో చదువుకున్నట్లు తేల్చారు. అయితే ఎందుకు దాడికి పాల్పడ్డాడన్న సంగతి మాత్రం ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదని చెప్పారు. పాఠశాలలో విధ్వంసం సృష్టించిన అనంతరం కజన్‌త్సెవ్‌ తనను తాను కాల్చుకొని చనిపోయాడు. అతడు నాజీ గుర్తులతో కూడిన నల్ల రంగు టీషర్ట్‌ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఓ మానసిక చికిత్సాలయంలో రోగిగా అతడి పేరు నమోదై ఉన్నట్లు బ్రెచలోవ్‌ తెలిపారు. రష్యా అధ్యక్ష భవనం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ మాత్రం తాజా కాల్పులను ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని