పాక్‌ ప్రధాని నివాసంలో నిఘా పరికరాలు!

పాకిస్థాన్‌ ప్రధాని సహా కీలక నేతలకు చెందిన దాదాపు 115 గంటల ఆడియో క్లిప్‌ ఒకటి డార్క్‌ వెబ్‌లో 3.50 లక్షల డాలర్లకు విక్రయానికి ఉందని ప్రతిపక్ష పీటీఐ నాయకుడు ఫవాద్‌ చౌధరి బాంబు పేల్చారు. ప్రధాన మంత్రి కార్యాలయం

Updated : 27 Sep 2022 09:09 IST

 కీలక నిర్ణయాలు లండన్‌ నుంచే

నేతల సంభాషణల్లో వెల్లడి

డార్క్‌వెబ్‌లో అమ్మకానికి ఆడియో క్లిప్‌

ఈనాడు-ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ ప్రధాని సహా కీలక నేతలకు చెందిన దాదాపు 115 గంటల ఆడియో క్లిప్‌ ఒకటి డార్క్‌ వెబ్‌లో 3.50 లక్షల డాలర్లకు విక్రయానికి ఉందని ప్రతిపక్ష పీటీఐ నాయకుడు ఫవాద్‌ చౌధరి బాంబు పేల్చారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఏమాత్రం సురక్షితం కాదని, ఆయన నివాసంలో మాట్లాడుకున్న అంశాలే లీక్‌ అయ్యాయని వెల్లడించారు. పాకిస్థాన్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు మొత్తం లండన్‌ నుంచి తీసుకుంటున్నట్లు ఈ ఆడియో క్లిప్‌లోని సంభాషణలను బట్టి అర్థమవుతుందన్నారు. సుదీర్ఘ ఆడియో క్లిప్‌లో పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ముస్లిం లీగ్‌-ఎన్‌ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్‌, రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌, న్యాయశాఖ మంత్రి ఆజమ్‌ తరార్‌, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లా, నేషనల్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ అయాజ్‌ సిద్ధీఖీ, మునుపటి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సంభాషణలు ఉన్నాయి.

ఆర్థిక మంత్రి మార్పుపై కీలక విషయాలు వెల్లడి

ఆడియో క్లిప్‌ తొలి భాగంలో మరియం నవాజ్‌, షెహబాజ్‌ షరీఫ్‌లు పాక్‌ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిలీ గురించి మాట్లాడుకున్నారు. పాక్‌లో పెట్రోల్‌ ధరలు పెంచాలని కొన్నాళ్ల క్రితం ఇస్మాయిలీ నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని మరియం నవాజ్‌ తప్పుపట్టారు. ఆ తర్వాత ఆయన్ని మార్చి సీనియర్‌ నేత ఇసాక్‌దార్‌కు ఆర్థిక శాఖ పగ్గాలు అప్పగించారు. ఇంధన ధరలు పెంచాలని మరియం నవాజ్‌ స్వయంగా సూచిస్తున్నట్లు- లీకైన సంభాషణల్లో స్పష్టంగా ఉందని పీటీఐ నేత ఫవాద్‌ ఆరోపించారు. ఇసాక్‌దార్‌కు ఆర్థిక శాఖ ఇచ్చేందుకు కావాలనే ఇస్మాయిలీపై దుష్ప్రచారం చేశారని వివరించారు.

అర కి.మీ. దూరం నుంచీ వినగలరు

ఒక విద్యుత్‌ కర్మాగారానికి సంబంధించిన పరికరాలను భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే విషయంలో అల్లుడు రహీల్‌ మునీర్‌కు సహకరించాల్సిందిగా మరియం నవాజ్‌ కోరినట్లు ప్రధాని షరీఫ్‌, ఆయన ముఖ్యకార్యదర్శి తాఖీర్‌ షా మధ్య జరిగిన సంభాషణలో ఉంది. ముఖాముఖి సంభాషణే బయటకు వచ్చిందంటే ప్రధాని నివాసంలో నిఘా పరికరాలేవో ఉన్నట్లేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గదిలో రహస్యంగా జరిగే సమావేశంలోని సంభాషణలనూ అర కిలోమీటరు దూరం నుంచి స్పష్టంగా వినగలిగే అధునాతన సాంకేతికతను వాడడం ద్వారా దాదాపు ఉన్నతస్థాయి కార్యాలయాలన్నింటిపై కొన్ని దేశాలు నిఘా విధించాయని వార్తా కథనం ఒకటి వెల్లడించింది. ఆడియో లీక్‌ వ్యవహారంపై ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తు బృందాన్ని నియమించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని