సంక్షిప్త వార్తలు(4)

మద్యపానంతో సంబంధం లేకుండా కాలేయంలో కొవ్వు చేరే పరిస్థితి (ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ)ని అడ్డుకునేందుకు సరికొత్త పరిష్కారం అందుబాటులోకి వచ్చింది. జీవనశైలి వ్యాధులకు సహజ పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమైన

Updated : 28 Sep 2022 06:29 IST

కాలేయంలో కొవ్వు చేరికకు సముద్రపు నాచుతో పరిష్కారం

కొచ్చి: మద్యపానంతో సంబంధం లేకుండా కాలేయంలో కొవ్వు చేరే పరిస్థితి (ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ)ని అడ్డుకునేందుకు సరికొత్త పరిష్కారం అందుబాటులోకి వచ్చింది. జీవనశైలి వ్యాధులకు సహజ పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమైన ‘సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీష్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ)’.. సముద్రపు నాచును ఉపయోగించి  ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీకి మందు తయారుచేసింది. ‘కడాల్మిన్‌ టీఎం లివ్‌క్యూర్‌ ఎక్స్‌ట్రాక్ట్‌’ పేరుతో దీన్ని రూపొందించింది. సముద్రపు నాచు నుంచి సేకరించిన బయోయాక్టివ్‌ పదార్థాన్ని ఇందుకు ఉపయోగించామని, ఇది కాలేయ ఆరోగ్యాన్ని ఇతోధికంగా పెంచుతుందని ప్రధాన పరిశోధనకర్త కాజల్‌ చక్రవర్తి తెలిపారు. మధుమేహం, కొలెస్ట్రాల్‌, బీపీ, థైరాయిడ్‌ తదితర ఇతర రుగ్మతలకూ ఇప్పటికే ఈ సంస్థ 9 రకాల ఔషధాలను తీసుకొచ్చింది.


కాఫీతో దీర్ఘాయుష్షు

మెల్‌బోర్న్‌: మీరు కాఫీ ప్రియులా? అయితే ఇంకేం. దీర్ఘాయుష్మంతులన్న మాట! రోజూ రెండు లేదా మూడు కప్పుల కాఫీ తాగేవారు ఎక్కువకాలం జీవిస్తున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. వీరికి హృద్రోగ ముప్పూ తక్కువేనని తేలింది. ఆస్ట్రేలియాకు చెందిన ‘బేకర్‌ హార్ట్‌ అండ్‌ డయాబెటీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం సాగించారు. ఇందులో భాగంగా యూకే బయోబ్యాంక్‌ నుంచి 40-69 ఏళ్ల వయసున్న 4,49,563 మంది ఆరోగ్య వివరాలు సేకరించారు. వీరిలో వివిధ రకాల కాఫీలు తాగే అలవాటుకూ.. గుండె లయ తప్పడం, హృద్రోగం, మరణం వంటి పరిస్థితులకూ మధ్య సంబంధాన్ని పరిశీలించారు. నిత్యం కాఫీ తీసుకునేవారికి గుండె వైఫల్యం ముప్పు తక్కువేనని గుర్తించారు. కెఫీన్‌ లేని ఇన్‌స్టంట్‌, గ్రౌండ్‌ కాఫీని రోజూ మితంగా తీసుకోవచ్చని, ఆరోగ్యకర జీవనశైలిలో దీన్ని చేర్చాలని పరిశోధనకర్త పీటర్‌ కిస్టెలెర్‌ సూచించారు.


ఆహార సంక్షోభ నివారణకు 1,400 కోట్ల డాలర్లు: ఏడీబీ

మనీలా: ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో నానాటికీ తీవ్రమవుతున్న ఆహార సంక్షోభాన్ని నివారించడానికి ఇప్పట్నుంచి 2025 దాకా 1,400 కోట్ల డాలర్లను కేటాయించనున్నట్లు ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) ప్రకటించింది. ఇందులో భాగంగా.. ఈ ప్రాంతంలోని 1.1 కోట్ల మందిని దారిద్య్రం, ఆహార సంక్షోభం నుంచి బయటపడేయడానికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నట్లు మంగళవారం మనీలాలో జరిగిన వార్షిక సమావేశంలో ఏడీబీ వెల్లడించింది.


పాక్‌ సైనిక కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి
21 మందికి గాయాలు

పెషావర్‌: పాకిస్థాన్‌ సైనిక కాన్వాయ్‌పై మంగళవారం అఫ్గానిస్థాన్‌ సరిహద్దులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 21 మంది సైనికులు గాయపడ్డారు. ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్సులోని మీర్‌ అలీ బైపాస్‌ రోడ్డు వద్ద ఈ దాడి జరిగింది. క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించామని, వారి ఆరోగ్యం స్థిరంగా ఉందని సైన్యం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని