భారత్‌, పాక్‌ రెండూ మాకు ముఖ్యమే

భారత్‌, పాకిస్థాన్‌లు రెండూ తమకు ముఖ్యమేనని అమెరికా పేర్కొంది. ఎఫ్‌-16 యుద్ధ విమానాలకు అవసరమైన కీలక పరికరాలను పాక్‌కు అమెరికా సరఫరా చేయడంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌

Updated : 28 Sep 2022 05:45 IST

అమెరికా స్పష్టీకరణ

వాషింగ్టన్‌: భారత్‌, పాకిస్థాన్‌లు రెండూ తమకు ముఖ్యమేనని అమెరికా పేర్కొంది. ఎఫ్‌-16 యుద్ధ విమానాలకు అవసరమైన కీలక పరికరాలను పాక్‌కు అమెరికా సరఫరా చేయడంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చేసిన వ్యాఖ్యలపై అగ్రరాజ్యం స్పందించింది. ‘‘మేం భారత్‌, పాకిస్థాన్‌ సంబంధాలను ఒకదానిని దృష్టిలో పెట్టుకొని మరొకదానిని చూడం. వేర్వేరు అంశాల ఆధారంగా మాకు రెండూ వేటికవే ముఖ్యమైన భాగస్వాములు. ఈ రెండు దేశాలు పరస్పరం నిర్మాణాత్మక సంబంధాలు పెంపొందించుకొనేలా చేయగలిగినంత చేస్తామనే విషయాన్ని గట్టిగా చెప్పాలనుకొంటున్నాను’’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ తెలిపారు. ‘‘అఫ్గాన్‌ ప్రజలకు మద్దతు అంశంపై నిత్యం పాకిస్థాన్‌తో చర్చిస్తాం. అఫ్గాన్‌ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, దయనీయ పరిస్థితులను మెరుగుపర్చడం, ఇచ్చిన హామీలను తాలిబన్లు నిలబెట్టుకొంటున్నారా అనే అంశాలను పరిశీలించడం కోసం పాక్‌తో మాట్లాడతాం’’ అని ఆయన చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్‌ మంగళవారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో భేటీ అయ్యారు. పాక్‌కు ఎఫ్‌-16 యుద్ధ విమాన పరికరాల సరఫరా, రష్యా నుంచి చమురు దిగుమతులపైనా చర్చకు వచ్చింది. ఉగ్రవాదులపై చర్యల కోసమే పాక్‌కు ఎఫ్‌-16 పరికరాలు ఇస్తున్నట్లు అమెరికా ఈ సందర్భంగా సమర్థించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని