సంక్షిప్త వార్తలు(7)

మంచి నిద్ర కోసం ఎలాంటి భంగిమలో పడుకోవాలి? అన్న విషయమై స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త విలియం డెమెంట్‌ సుదీర్ఘ పరిశోధన చేశారు. పడక మీద నిద్రలో ఉన్నాక శరీరం ఎన్నో

Updated : 29 Sep 2022 07:05 IST

నిద్రపోవడానికి ఏది సరైన భంగిమ?

లండన్‌: మంచి నిద్ర కోసం ఎలాంటి భంగిమలో పడుకోవాలి? అన్న విషయమై స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త విలియం డెమెంట్‌ సుదీర్ఘ పరిశోధన చేశారు. పడక మీద నిద్రలో ఉన్నాక శరీరం ఎన్నో రకాలుగా కదులుతూ ఉంటుంది. ఇలా 664 మంది ఎలాంటి భంగిమల్లో నిద్రపోతున్నారన్నది విలియం అధ్యయనం చేశారు. వారంతా నిద్రలో 54% సమయం పక్కకు తిరిగి, 37% సమయం వెల్లికిలా, 7% సమయం బోర్లా పడుకుంటున్నట్టు లెక్కగట్టారు. ‘‘నిద్రలో మనకు తెలియకుండానే శరీరం భంగిమను మార్చుతుంది. ఇది మంచిదే. లేకపోతే ఒళ్లు నొప్పులు వస్తాయి. శరీరంలో పలుచోట్ల గాయాలవుతాయి’’ అని విలియం పేర్కొన్నారు.


దీర్ఘకాల కొవిడ్‌ ముప్పును గుర్తించే రక్తపరీక్ష

లండన్‌: మహమ్మారి బాధితులు... కరోనా లక్షణాలు, తదనంతర సమస్యలు దీర్ఘకాలం కొనసాగే ‘లాంగ్‌ కొవిడ్‌’కు గురయ్యారా? అన్నది ఇక ఒక్క పీసీఆర్‌ రక్తపరీక్షతో తెలుసుకోవచ్చు. యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేశారు. ఇందుకు 54 మంది ఆరోగ్య కార్యకర్తల రక్త నమూనాలపై పరీక్షలు నిర్వహించారు. ‘‘కరోనా సోకిన ఆరు వారాల్లో కొందరు బాధితుల రక్తంలోని 12 రకాల ప్రొటీన్లు అసాధారణంగా పెరుగుతున్నాయి. ఏడాది తర్వాత కూడా వారిలో ఆరోగ్య సమస్యలు కొనసాగుతాయని గుర్తించేందుకు ఇదే సంకేతం. పీసీఆర్‌ పరీక్ష ద్వారా ముందుగానే దీన్ని తెలుసుకుంటే... రోగులకు తగిన చికిత్స అందించి, లాంగ్‌ కొవిడ్‌ ముప్పును తప్పించే అవకాశం ఉంటుంది’’ అని పరిశోధనకర్త వెండీ హేవుడ్‌ వివరించారు.


జన్యువుల వల్లే చింపిరి జుట్టు

బ్రాడ్‌ఫోర్డ్‌: కొంతమందిలో, ముఖ్యంగా పిల్లల్లో జుట్టు ఎక్కడికక్కడ చిక్కుపడి దువ్వడానికి వీల్లేకుండా చింపిరి జుట్టులా తయారవుతుంది. సాధారణంగా ఇది మూడు నెలల నుంచి పన్నెండేళ్ల వయసు బాలల్లో కనిపిస్తుంది. వారి జుట్టు పొడిబారి చిట్లిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితి పిల్లలు పెరిగిపెద్దవుతున్న కొద్దీ తొలగిపోతుంది. కేశాల్లో ప్రోటీన్లను ఉత్పత్తిచేసే పాడి 3, మరో రెండు జన్యువుల్లో ఉత్పరివర్తనల వల్ల చింపిరి జుట్టు సమస్య తలెత్తుతుందని జర్మనీలోని బాన్‌ విశ్వవిద్యాలయ జన్యు పరిశోధకులు కనుగొన్నారు. ‘‘కేశాల్లోని ప్రోటీన్లలో మార్పులు జుట్టు వర్ణాన్ని నిర్దేశిస్తాయి. ప్రొటీన్లలో మార్పులు చోటుచేసుకోవడం వ్యాధికి సంకేతం ఏమీ కాదు. తల్లిదండ్రులు, పూర్వీకులకు చింపిరి జుట్టు ఉంటే అది పిల్లల్లోనూ కనిపించవచ్చు’’ అని పరిశోధకులు పేర్కొన్నారు.


పెరుగుతున్న రుతుచక్ర సమయం

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత మహిళల్లో రుతుచక్రం సమయం తాత్కాలికంగా పెరుగుతున్నట్టు ఒరెగాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. మొదటి డోసు తర్వాత ఈ సమయం 0.71 రోజు, రెండో డోసు తర్వాత 0.56 రోజు మేర పెరుగుతున్నట్టు తేల్చారు. ఒకే రుతుచక్ర సమయంలో టీకా రెండు డోసులు తీసుకున్న మహిళల్లో మాత్రం... అది సుమారు నాలుగు రోజులు పెరుగుతున్నట్టు తెలిపారు. ఏ కంపెనీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నా మహిళల్లో ఇలాంటి ఫలితమే ఉంటున్నట్టు విశ్లేషణలో తేలింది.


మనం వెనక్కు తగ్గాలి

అణు యుద్ధానికి దిగి, విజయం సాధించాలనుకోవడం విధ్వంసకరమైన ఆలోచన. అణ్వస్త్రాన్ని ఏ దేశం ప్రయోగించినా, అది తుది యుద్ధానికి దారితీస్తుంది. ఇకనైనా అణు బెదిరింపుల యుగం అంతం కావాలి. ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోకుండా వెనక్కు తగ్గాలి.

- ఆంటోనియో గుటెరస్‌


 పైపులైన్ల లీకేజీ కారకులపై ప్రతిచర్య

బ్రసెల్స్‌: రష్యా నుంచి బాల్టిక్‌ సముద్ర గర్భం మీదుగా జర్మనీకి సహజ వాయువును తీసుకొచ్చే నార్డ్‌ స్ట్రీమ్‌ 1, 2 పైపులైన్లలో ఏర్పడిన లీకేజీలకు విద్రోహ చర్యే కారణమని 27 దేశాల ఐరోపా సమాఖ్య (ఈయూ) అనుమానిస్తోంది. బాల్టిక్‌ సముద్రంలో మంగళవారం పేలుళ్లు జరిగాయనీ, ఆ తరవాతనే పైపులైన్ల నుంచి గ్యాస్‌ లీక్‌ కావడం మొదలైందని భూగర్భవిజ్ఞాన శాస్త్రవేత్తలు తెలిపారు. లీకేజీ ఏర్పడే సమయానికి రెండు పైపులైన్ల నిండా గ్యాస్‌ ఉన్నా, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని పురస్కరించుకుని ఆంక్షల వల్ల గ్యాస్‌ సరఫరా నిలిచిపోయింది. ఐరోపా ఇంధన సరఫరా యంత్రాంగాన్ని పనిగట్టుకుని విచ్ఛిన్నం చేసేవారిపై కలసికట్టుగా ప్రతిచర్యకు దిగుతామని ఈయూ విదేశాంగ ప్రతినిధి జోసెఫ్‌ బోరెల్‌ హెచ్చరించారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి రాజకీయంగా ముగింపు పలికినా లీకేజీల మూలంగా నార్డ్‌ స్ట్రీమ్‌ పైపులైన్లు ఈ శీతాకాలంలో గ్యాస్‌ సరఫరా చేయలేవు.


అవినీతిపై పోరాడే వాడే.. అక్రమార్కుడయ్యాడు

బీజింగ్‌: చైనాలో అవినీతిపై పోరులో కీలక పాత్రధారి అయిన లియు యాన్‌ పింగ్‌ తానే అవినీతిపరుడిగా తేలాడు. తాజాగా లియు యాన్‌ పింగ్‌ పదోన్నతులు ఇప్పించడానికి లంచాలు తీసుకున్నాడని, దర్యాప్తులను తప్పుదోవ పట్టించాడని ఆరోపణలొచ్చాయి. లియును ఈ నెల మొదట్లో పార్టీ నుంచి బహిష్కరించారు. లియు చైనా భద్రతా శాఖలో క్రమశిక్షణ తనిఖీ విభాగాదిపతిగా పనిచేశారు. అవినీతి ఈగల్లో ఉన్నా పులుల్లో ఉన్నా వదలకూడదని చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ పట్టిన పట్టుకు లియు నేర నిర్ధారణ తాజా ఉదాహరణ. దీనికి ముందు మాజీ డిప్యూటీ పోలీసు మంత్రి సన్‌ లీజున్‌ లంచాలు తీసుకున్నాడని, స్టాక్‌ మార్కెట్‌లో తిమ్మిని బమ్మిని చేశాడనీ, ఇంకా ఇతర నేరాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ శుక్రవారం మరణ శిక్ష విధించారు. ఈ శిక్షను రెండేళ్లపాటు అమలు చేయకుండా నిలిపి ఉంచి, ఆపైన యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని