సంక్షిప్త వార్తలు(11)

స్వేదం, శ్వాసను వాసన చూడటం ద్వారా మానవుల్లో ఒత్తిడిని శునకాలు పసిగట్టేయగలవని బ్రిటన్‌ పరిశోధకులు తాజా అధ్యయనంలో తేల్చారు. 36 మంది నుంచి.. వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస, చెమట నమూనాలను

Updated : 30 Sep 2022 06:22 IST

చెమట వాసనతో శునకాలు ఒత్తిడిని పట్టేస్తాయ్‌

లండన్‌: స్వేదం, శ్వాసను వాసన చూడటం ద్వారా మానవుల్లో ఒత్తిడిని శునకాలు పసిగట్టేయగలవని బ్రిటన్‌ పరిశోధకులు తాజా అధ్యయనంలో తేల్చారు. 36 మంది నుంచి.. వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస, చెమట నమూనాలను పరిశోధకులు సేకరించారు. వాటిని 4 శునకాల ముందు ఉంచగా.. ఒత్తిడిలో ఉన్నప్పటి నమూనాలను అవన్నీ పక్కాగా కనిపెట్టాయి. ఒత్తిడికి గురైనప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు మానవుల చెమట, ఊపిరి నుంచి భిన్న వాసనలొస్తాయని చెప్పేందుకు ఇది నిదర్శనమని పరిశోధకులు చెప్పారు.


వాయు కాలుష్యంతో తీవ్రస్థాయి కొవిడ్‌ ముప్పు

లాస్‌ ఏంజెలెస్‌: వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో నివసించేవారికి తీవ్రస్థాయి కొవిడ్‌ ముప్పు ఎక్కువగా ఉంటుందని అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. దాదాపు 50 వేలమందిపై వారు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో కాలుష్యం స్థాయులు, కరోనా సోకిన తర్వాత అక్కడి వ్యక్తులు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిన ఉదంతాలను పరిశీలించారు. కాలుష్య తీవ్రత (ప్రధానంగా పీఎం 2.5 ధూళికణాలు, నైట్రోజన్‌ డయాక్సైడ్‌) ఎక్కువగా ఉన్న ప్రాంతాల వాసులు కొవిడ్‌ బారినపడితే.. వారిలో వ్యాధి తీవ్రమయ్యే అవకాశాలు అధికంగా ఉంటున్నట్లు నిర్ధారించారు. టీకా రెండు డోసులు తీసుకున్నవారిలోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.


యువత వ్యక్తిత్వాన్ని మార్చేసిన కరోనా!

వాషింగ్టన్‌: కొవిడ్‌ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆలోచనాధోరణుల్లో మార్పులొచ్చాయని అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకుల అధ్యయనంలో నిర్ధారణ అయింది. ప్రధానంగా యువత వ్యక్తిత్వాన్ని కరోనా మార్చివేసినట్లు తేలింది. 18-109 ఏళ్ల మధ్య వయసున్న 7,109 మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కరోనా ముందుకాలంతో పోలిస్తే వారి వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులను పరిశీలించారు. కొవిడ్‌ మహమ్మారి కారణంగా యువతలో.. ఒత్తిడి, విశ్వాస లేమి, పరస్పర సహకార నిరాకరణ, బాధ్యతారాహిత్యం వంటి ప్రతికూల లక్షణాలు కొంత పెరిగినట్లు గుర్తించారు.


మధుమేహం నియంత్రణకు కృత్రిమ క్లోమం

వాషింగ్టన్‌: రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులను ఎప్పటికప్పుడు కచ్చితత్వంతో గుర్తిస్తూ.. అవసరమైన మేర ఇన్సులిన్‌ను విడుదల చేయడం ద్వారా టైప్‌-1 మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే సరికొత్త కృత్రిమ (బయోనిక్‌) క్లోమాన్ని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇన్సులిన్‌ డెలివరీ కోసం ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన కృత్రిమ వ్యవస్థలతో పోలిస్తే అది మరింత మెరుగ్గా, స్వతంత్రంగా పనిచేస్తుందని తెలిపారు. సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో వినియోగదారులు ఒక్కసారి తమ శరీర బరువును నమోదుచేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులను తెలుసుకునేందుకు చేతివేళ్లకు పదేపదే సూదిని గుచ్చుకోవడం, ఇంజెక్షన్‌ ద్వారా ఇన్సులిన్‌ను తీసుకోవడం వంటి నొప్పి కలిగించే పరిణామాల నుంచి బయోనిక్‌ క్లోమం విముక్తి కల్పిస్తుందన్నారు.


గతేడాది 200 మందికి పైగా పర్యావరణ ఉద్యమకారుల హత్య

మెక్సికో సిటీ: ప్రపంచ వ్యాప్తంగా 2021లో దాదాపు 200 మందికి పైగా పర్యావరణవేత్తలు, భూ రక్షణ ఉద్యమకారులు హత్యకు గురయ్యారు. వీరిలో మెక్సికోకు చెందిన 54 మంది కూడా ఉన్నారు. దీంతో మెక్సికోను అత్యంత ప్రాణాంతకమైన దేశంగా స్వచ్ఛంద సంస్థలు అభివర్ణిస్తున్నాయి. 2020లో మెక్సికోలో సుమారు 30 మంది ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ గత మూడేళ్లుగా ఈ తరహా హత్యలు పెరుగుతూనే ఉన్నాయి. కొలంబియా, బ్రెజిల్‌, నికరాగువా దేశాల్లో రెండు అంకెల స్థాయిలో హత్యలు నమోదవుతున్నాయి. అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటున్న సందర్భాల్లోనే ఎక్కువగా పర్యావరణవేత్తలపై దాడులు జరుగుతుండటం గమనార్హం.


సూకీకి మూడేళ్ల జైలు శిక్ష

బ్యాంకాక్‌: మయన్మార్‌ మాజీ నేత అంగ్‌సాన్‌ సూకీకి అక్కడి న్యాయస్థానం మరో కేసులో గురువారం మూడేళ్ల జైలుశిక్ష విధించింది. అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆమెపై అక్కడి సైనిక ప్రభుత్వం నమోదు చేసిన కేసులో ఈ తీర్పు వెలువడింది. ఆమె కేబినెట్‌లో సేవలందించిన ముగ్గురితో పాటు ఆమె ఆర్థిక సలహాదారు, ఆస్ట్రేలియాకు చెందిన ఆర్థికవేత్త సియాన్‌ టర్నెల్‌కు వలస చట్టాల ఉల్లంఘన నేరానికి గాను మూడేళ్ల జైలుశిక్ష అనుభవించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. సూకీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని గతేడాది సైన్యం కూలదోశాక వీరిపై కేసులు నమోదయ్యాయి. కోర్టు ఆదేశాలను ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్ని ఓంగ్స్‌ కార్యాలయం ప్రశ్నించింది. టర్నెల్‌ను సత్వరం విడుదల చేయాలని పేర్కొంది.


కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించాలి

బలహీనమైన మానసిక ఆరోగ్యం వ్యక్తుల పనితీరు, ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 2019 గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 కోట్ల మంది ఆందోళనతో, మరో 28 కోట్ల మంది కుంగుబాటుతో బాధపడుతున్నారు. అదే ఏడాది 7 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. కార్మికులు, ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు అవసరం.

- టెడ్రోస్‌ అధనోమ్‌


నవాజ్‌ షరీఫ్‌ కుమార్తెకు కోర్టులో ఊరట

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుటుంబానికి న్యాయస్థానంలో భారీ విజయం లభించింది. లండన్‌లోని ఎవెన్‌ ఫీల్డ్‌ హౌస్‌లో నాలుగు విలాసవంతమైన అపార్ట్‌మెంట్లను అవినీతి సొమ్ముతో కొనుగోలు చేశారనే కేసు నుంచి నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మరియం (48), ఆమె భర్త కెప్టెన్‌ సఫ్దర్‌కు విముక్తి లభించింది. ఈ కేసులో నవాజ్‌ షరీఫ్‌ కూడా నిందితుడే కానీ, ఆయన లండన్‌లో ఉంటున్నందున కోర్టు విచారణకు హాజరు కాలేకపోతున్నారు. ఎవెన్‌ ఫీల్డ్‌లో నవాజ్‌, ఆయన కుమార్తె, అల్లుడు అక్రమ ఆర్జనతో ఫ్లాట్లు కొన్నట్లు ప్రాసిక్యూషన్‌ నిరూపించలేకపోయిందని ఇస్లామాబాద్‌ హైకోర్టు ధర్మాసనం గురువారం తేల్చింది. మరియం నవాజ్‌, ఆమె భర్తను నిర్దోషులుగా ప్రకటించింది.  


పాక్‌ ప్రధాని కార్యాలయంలో గోడలకు చెవులు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని కార్యాలయంలో ఏం మాట్లాడినా బయటకు పొక్కిపోతోందనీ, ముఖ్యమైన సంభాషణలు జరపడానికి అది అనువైన స్థలం కాదని  మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రధాన సైన్యాధికారి జనరల్‌ కమర్‌ జావేద్‌ బాజ్వా గతంలో పదేపదే హెచ్చరించేవారు. పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ పార్టీ (పీటీఐ) సీనియర్‌ నాయకుడు, మాజీ సమాచార మంత్రి ఫవాద్‌ చౌధరి ఈ సంగతిని జియో న్యూస్‌ టీవీకి వెల్లడించారు. కీలక సమస్యలపై చర్చించాలంటే మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తన కార్యాలయం నుంచి బయటికొచ్చి మాట్లాడేవారని జనరల్‌ బాజ్వా తెలిపినట్లు చౌధరి చెప్పారు. తన మంత్రులతో జరిపిన చర్చల ఆడియో క్లిప్‌లు బయట ప్రచారం కావడంపై ప్రస్తుత ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌  ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. వీరి సంభాషణలను విదేశాల నుంచి హ్యాక్‌ చేసి ఉంటే ఆశ్చర్యపోనని చౌధరి అన్నారు.


ఉక్రెయిన్‌ ఉద్యమకారిణికి రైట్‌ లైవ్లీహుడ్‌ అవార్డు

స్టాక్‌హోం: నోబెల్‌ బహుమతికి ప్రత్యామ్నాయంగా భావించే ‘ది రైట్‌ లైవ్లీహుడ్‌’ అవార్డు ఉక్రెయిన్‌ మానవహక్కుల కార్యకర్త వొలెక్సాండ్రా మాట్విచుక్‌ను వరించింది. ఈమెతోపాటు మరో రెండు సంస్థలకు గురువారం ఈ అవార్డును ప్రకటించారు. ‘ఇది మా పోరాటానికి గుర్తింపు’ అని ఈ సందర్భంగా మాట్విచుక్‌ వ్యాఖ్యానించారు. అవార్డు కింద రూ.72 లక్షల నగదు (88,300 డాలర్లు) అందజేస్తారు. నవంబరు 30న స్టాక్‌హోంలో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది.  


నార్డ్‌స్ట్రీమ్‌ పైప్‌లైన్లలో లీకేజీ

స్టాక్‌హోం: రష్యా నుంచి జర్మనీకి సహజవాయువును తీసుకువెళ్లే నార్డ్‌స్ట్రీమ్‌ పైపులైన్లలో మరో రెండుచోట్ల లీకేజి ఏర్పడినట్లు స్వీడన్‌ తీరగస్తీ దళం ప్రకటించింది. స్వీడన్‌, డెన్మార్క్‌ తీరాలకు చేరువగా లీకేజీలను గుర్తించినట్లు తెలిపింది. లీకేజీలు ఏర్పడడానికి ముందు పెద్దఎత్తున పేలుళ్లు సంభవించాయని అధికారులు తెలిపారు. లీకేజీలు విద్రోహ చర్యేనని డెన్మార్క్‌, స్వీడన్‌ ఆరోపిస్తున్నాయి. లీకేజీలతో విడుదలయ్యే వాయువులు వాతావరణంపై ప్రభావాన్ని చూపడంతో పాటు సముద్ర జీవులకు కూడా ముప్పుగా మారనున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని