అమెరికాలో ‘ఇయన్‌’ బీభత్సం

అమెరికాలో హరికేన్‌ ‘ఇయన్‌’ బీభత్సం సృష్టించింది. ఫ్లోరిడా తీరాన్ని బుధవారం సాయంత్రం ఇది బలంగా తాకింది. దీంతో కుండపోత వర్షాలు, ప్రచండ వేగంతో వీచిన గాలులు ఫ్లోరిడాతో పాటు ఆగ్నేయ అట్లాంటిక్‌ తీరప్రాంతాన్ని కకావికలం

Published : 30 Sep 2022 05:33 IST

 కుంభవృష్టి వానతో గజగజలాడిన ఫ్లోరిడా

తేలియాడిన ఇళ్లు, వీధుల్లోకి షార్క్‌లు

25 లక్షల మందికి నిలిచిన విద్యుత్‌ సరఫరా

ఫ్లోరిడా: అమెరికాలో హరికేన్‌ ‘ఇయన్‌’ బీభత్సం సృష్టించింది. ఫ్లోరిడా తీరాన్ని బుధవారం సాయంత్రం ఇది బలంగా తాకింది. దీంతో కుండపోత వర్షాలు, ప్రచండ వేగంతో వీచిన గాలులు ఫ్లోరిడాతో పాటు ఆగ్నేయ అట్లాంటిక్‌ తీరప్రాంతాన్ని కకావికలం చేశాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కొన్నిచోట్ల సుమారు 10 అడుగుల మేర నీరు నిలిచింది. చుట్టూ నీరుండడంతో వేలమంది పౌరులు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో చిక్కుకుపోయారు. డెల్టోనాలో కాలువలో పడి 72 ఏళ్ల వృద్ధుడొకరు మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

వాననీటిలో ఇళ్లు తేలియాడుతున్న దృశ్యాలు, నగర వీధుల్లోకి షార్క్‌లు కొట్టుకొని వచ్చిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ హరికేన్‌ ధాటికి తీర ప్రాంతంలోని ఓడలు, పడవలు ఒడ్డుకు కొట్టుకొచ్చి ధ్వంసమయ్యాయి. సమీప విమానాశ్రయాల్లోని విమానాలు, హెలికాప్టర్లు నాశనమయ్యాయి. విద్యుత్‌ వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లడంతో పలు ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. సుమారు 25 లక్షల మందికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 20 మందితో కూడిన వలసదారుల పడవ ఒకటి మునిగిపోయిందని యూఎస్‌ బోర్డర్‌ పెట్రోలింగ్‌ అధికారులు వెల్లడించారు. అయితే, వారిలో కొందరిని రక్షించినట్లు చెప్పారు. సానిబెల్‌ వంతెన సముద్రంలో కూలిపోవడంతో 6,300 మంది రాకపోకలకు ఇబ్బంది నెలకొంది.

అత్యంత శక్తిమంతమైన హరికేన్లలో ఒకటి

అమెరికాలో నమోదైన అత్యంత శక్తిమంతమైన హరికేన్లలో ఇయన్‌ ఒకటని అధికారులు వెల్లడించారు. అధ్యక్షుడు జో బైడెన్‌ గురువారం విపత్తు ప్రకటన చేశారు. సహాయ, రక్షణ చర్యలు చేపట్టినట్లు ఫెడరల్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ అధికారి డియెనే క్రిస్‌వెల్‌ వెల్లడించారు. నైరుతి ఫ్లోరిడా సమీపంలోని దీవుల్లో అమెరికా తీర రక్షణ దళం సహాయక చర్యలు చేపట్టింది.

* అత్యంత ప్రమాదకరమైన హారికేన్‌ బుధవారం సాయంత్రం తీరాన్ని తాకిందని నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌(ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది.

* నేపుల్స్‌లో వరదనీరు ఇళ్లలోకి ఉప్పొంగిందని, రోడ్లు మునిగిపోయి, వాహనాలు కొట్టుకుపోయినట్లు టీవీ దృశ్యాలను బట్టి తెలుస్తోంది. మరోపక్క, ఈ హరికేన్‌ను కవర్‌ చేస్తోన్న రిపోర్టర్‌ గాలి వేగానికి నిల్చోలేకపోయాడు.

* ఫోర్ట్‌ మైయర్‌ ప్రాంతంలోని వందలాది ఆసుపత్రులకు నీటి సరఫరా నిలిచిపోవడంతో అక్కడి రోగులను ఇతర హాస్పటళ్లకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని