US Visa: అమ్మో.. అమెరికా వీసా!

అమెరికా వీసా అంటే ఆశావహులు అమ్మ బాబోయ్‌ అంటున్నారు. వీసా ఇంటర్వ్యూ కోసం వేచిచూసే సమయం విపరీతంగా పెరగడమే దీనికి కారణం. కరోనా సమయం నుంచి తొలిసారి అమెరికా వెళ్లాలనుకునేవారు వీసా ఇంటర్వ్యూ అవకాశాలు ఆశించినస్థాయిలో

Updated : 30 Sep 2022 09:55 IST

 ఏడాదికిపైగా ఎదురుచూడాల్సిందే

తొలిసారి పర్యాటకులకు మరీ అధికం

ఈనాడు - హైదరాబాద్‌

అమెరికా వీసా అంటే ఆశావహులు అమ్మ బాబోయ్‌ అంటున్నారు. వీసా ఇంటర్వ్యూ కోసం వేచిచూసే సమయం విపరీతంగా పెరగడమే దీనికి కారణం. కరోనా సమయం నుంచి తొలిసారి అమెరికా వెళ్లాలనుకునేవారు వీసా ఇంటర్వ్యూ అవకాశాలు ఆశించినస్థాయిలో లభించకపోవటంతో నిరాశలో ఉన్నారు. వీటిపై భారత్‌-అమెరికా దేశాల విదేశాంగ మంత్రులు సైతం చర్చించుకునేంత పరిస్థితి వచ్చిందంటే సమస్య తీవ్రత అర్థమవుతుంది. దిల్లీలోని రాయబార కార్యాలయంతోపాటు హైదరాబాద్‌, చెన్నై, ముంబయి, కోల్‌కతా కాన్సులేట్‌ కార్యాలయాల్లోనూ వీసా జారీ ప్రక్రియను అమెరికా ప్రభుత్వం నిర్వహిస్తుంది. అమెరికాలో స్ప్రింగ్‌ సీజను తరగతులు ఏటా జనవరి రెండో వారం నుంచి ఆరంభమవుతాయి. వీటికి వెళ్లే విద్యార్థుల వీసాల తాకిడి వచ్చే నెల నుంచి మొదలవుతుంది. గతంలోనే అడ్మిషన్‌ ఖరారై.. వీసాలు దొరకని వారు కూడా రాబోయే సీజనుకు ప్రయత్నిస్తున్నారు.

విద్యార్థులు 14 నెలలు... పర్యాటకులు 19 నెలలు

హైదరాబాద్‌ కాన్సులేట్‌ పరిధిలో అమెరికా వీసా ఇంటర్వ్యూలకు.. విద్యార్థులైతే 14 నెలలు, తొలిసారి వెళ్లే పర్యాటకులైతే సుమారు 19 నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితి. వీసా పునరుద్ధరణ (రెన్యువల్‌) చేసుకునేవారికి పెద్ద ఇబ్బందులు లేవు. విద్యార్థి వీసా కోసం ప్రస్తుతం చెన్నై మినహా అన్ని ప్రాంతాల్లో సుమారు 14 నెలలపాటు నిరీక్షణ తప్పడంలేదు. చెన్నైలో నెల రోజుల లోపుగానే ఇంటర్వ్యూ స్లాట్‌ లభిస్తోంది. కానీ చెన్నై, ముంబయిలలో పర్యాటక వీసా స్లాట్‌ కోసం దాదాపు 26 నెలలు.. అంటే 2024 చివరివరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ వీసాలకు మిగిలిన నాలుగు ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో నిరీక్షణ సమయం తక్కువ. వీసా రెన్యువల్‌కు మాత్రం ఇబ్బందులు లేవు. డ్రాప్‌బాక్స్‌ సదుపాయాన్ని ఇటీవల విస్తృతం చేయడంతో వారం పది రోజుల్లో పని పూర్తవుతోంది. కరోనాకు ముందు పర్యాటక వీసా కోసం తొలిసారి దరఖాస్తు చేసుకున్న వారికి ఇటీవలే ఇంటర్వ్యూలు మొదలయ్యాయి.

భారత్‌కు నెలలు.. చైనాకు 2 రోజులేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: వీసాల జారీలో అమెరికా వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. వీసా ఇంటర్వ్యూల కోసం భారతీయులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తుండగా.. చైనా దేశీయులకు కేవలం రెండు రోజుల వెయిటింగ్‌ లిస్ట్‌ మాత్రమే ఉండటం గమనార్హం. అమెరికాకు విజిటింగ్‌ వీసా కోసం బీజింగ్‌ వాసులు దరఖాస్తు చేసుకుంటే నిరీక్షణ సమయం కేవలం రెండు రోజులే చూపిస్తోంది. విద్యార్థి వీసాలకైతే..

దిల్లీ ఎంబసీ నుంచి చేసే దరఖాస్తుదారులకు నిరీక్షణ సమయం 430 రోజులుండగా... ఇస్లామాబాద్‌కు కేవలం ఒక్క రోజు, బీజింగ్‌కు రెండు రోజులే ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు