సంక్షిప్త వార్తలు

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ మరోసారి రక్తసిక్తమైంది. అక్కడి కాజ్‌ విద్యాసంస్థ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో 19 మంది మృత్యువాతపడ్డారు. 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి జరిగిన తీరును విశ్లేషిస్తే మృతుల సంఖ్య వంద వరకు ఉండొచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు పేర్కొన్నాయి.

Updated : 01 Oct 2022 06:41 IST

విద్యా సంస్థపై ఆత్మాహుతి దాడి
కాబూల్‌లో 19 మంది మృత్యువాత
వంద మంది మరణించినట్లు మీడియాలో కథనాలు!

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ మరోసారి రక్తసిక్తమైంది. అక్కడి కాజ్‌ విద్యాసంస్థ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో 19 మంది మృత్యువాతపడ్డారు. 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి జరిగిన తీరును విశ్లేషిస్తే మృతుల సంఖ్య వంద వరకు ఉండొచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు పేర్కొన్నాయి. కాజ్‌ ఉన్నత విద్యాకేంద్రం కాబూల్‌లోని దష్త్‌-ఇ-బార్చె ప్రాంతంలో ఉంది. అఫ్గానిస్థాన్‌లో మైనార్టీ వర్గమైన హజారాలు ఇక్కడ ఎక్కువగా నివసిస్తున్నారు. విద్యాకేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొన్న ముష్కరుడు బాంబు ధరించి, విద్యార్థుల మధ్యకు వెళ్లి తనను తాను పేల్చుకున్నట్లు అఫ్గాన్‌ పీస్‌ వాచ్‌ అనే స్వచ్ఛంద సంస్థ ట్విటర్‌ వేదికగా తెలిపింది. దాడులతో సంబంధం ఉన్న ఒక అనుమానితుడిని అరెస్టు చేసినట్లు అఫ్గాన్‌ అధికార ప్రతినిధి అబ్దుల్‌ నఫి తెలిపారు. బాధితుల్లో ఇటీవల ఉన్నత విద్య పూర్తిచేసుకున్న బాలబాలికలే ఎక్కువగా ఉన్నారు.


కుక్క కాటును తప్పించుకునేలా తర్ఫీదు

లండన్‌: కుక్కల దాడిని తప్పించుకోవడంపై అవగాహన కల్పించే సాధనంగా పనికొచ్చే ఒక వర్చువల్‌ రియాల్టీ లాబ్రాడర్‌ శునకాన్ని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి ‘డాగ్‌ అసిస్టెడ్‌ వర్చువల్‌ ఎన్విరానిమెంట్‌ (డీఏవీఈ) అని పేరు పెట్టారు. కుక్క దురుసు వ్యవహారశైలిని గుర్తించి, విశ్లేషించడంలో మానవులకు సాయపడుతుంది. చాలా ప్రాంతాల్లో కుక్క కాటు పెద్ద బెడదగా మారింది.  1998-2018 మధ్య కాలంలో ఈ సమస్య వల్ల ఆసుపత్రిపాలైన వారి సంఖ్య బ్రిటన్‌లో మూడింతలు పెరిగింది. శునకాల వ్యవహారశైలిపై అవగాహన ద్వారా ఈ సమస్యను ఎదుర్కోవచ్చు.  అధ్యయనంలో భాగంగా 16 మందిని ఎంపిక చేసి, వారి ముందు వర్చువల్‌ రియాల్టీ కుక్క నమూనాను ఉంచారు. అది ముందు పాదాలను పైకి లేపడం, తీవ్రంగా మొరగడం, గుర్రుగా చూడటం వంటి లక్షణాలను ప్రదర్శించింది. వీటిని వాలంటీర్లు గుర్తించారు. ఇవన్నీ తమ జోలికి రావద్దనడానికి సంకేతాలేనని శాస్త్రవేత్తలు తెలిపారు.


చిత్రవార్త..


ఎప్పటికీ ఉక్రెయిన్‌ పరిధిలోనే

లుహాన్స్క్‌, దొనెట్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు పుతిన్‌ చేసిన అక్రమ ప్రకటన దేనినీ మార్చదు. రష్యా దురాక్రమణదారులు ఆక్రమించిన భూభాగమంతా ఉక్రెయిన్‌దే. ఆ  సార్వభౌమ దేశం పరిధిలోనే ఉంటుంది.

-ఉర్సులా వాన్‌డెర్‌ లెయెన్‌, ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు


పుతిన్‌ వ్యాఖ్యలను కెనడా ఖండిస్తోంది

ఉక్రెయిన్‌లోని భూభాగాల విషయమై నిర్వహించిన రెఫరెండానికి సంబంధించి పుతిన్‌ తాజా వ్యాఖ్యలను కెనడా ఖండిస్తోంది. ఈ రెఫరెండంలో వెలువడిన అంశాలకు ఎలాంటి చట్టబద్ధతా లేదు. కెనడా ఇప్పుడు, ఎప్పుడు ఆ ఫలితాలను గుర్తించదు. ఉక్రెయిన్‌ భూభాగం ఎప్పటికీ ఉక్రెయిన్‌తోనే ఉంటుందని నేను మరోమారు చెబుతున్నాను.

-జస్టిన్‌ ట్రూడో, కెనడా ప్రధానమంత్రి


అభివృద్ధి చెందుతున్న దేశాలకు అసాధారణ సవాళ్లు

అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రస్తుతం అసాధారణమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా అసమానతలను తొలగించేందుకు, తీవ్రమైన పేదరికాన్ని రూపుమాపేందుకు చేపడుతున్న చర్యలకు ఎదురుదెబ్బ తగిలినట్లు అవుతోంది.

-ప్రపంచ బ్యాంకు


బలవంతపు వలసలనుపరిష్కరించాలి

పీడనం, హింస, మానవహక్కుల ఉల్లంఘనలు, విపత్తులు తదితర కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పదికోట్ల మంది ప్రజలు బలవంతంగా వలస పోతున్నారు. బలవంతపు వలసలకు సంబంధించిన కారణాలను పరిష్కరించడానికి, శాంతిని పెంపొందించడానికి సమగ్రమైన చర్యలు చేపట్టాలి.

- ఐరాస

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని