ఆ నాలుగు ఇక మావే

అంతా అనుకున్నట్టే జరిగింది. అమెరికా, పశ్చిమ దేశాలు గగ్గోలు పెట్టినా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కించెత్తయినా వెనక్కు తగ్గలేదు. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని లుహాన్స్క్‌, దొనెట్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియాలను తమ దేశంలో విలీనం చేసినట్టు ఆయన ప్రకటించారు. ఆ నాలుగు ప్రాంతాల అధినేతలతో కలిసి ఒప్పందాలపై సంతకాలు చేశారు.

Published : 01 Oct 2022 05:56 IST

రష్యాలో దొనెట్స్క్‌, లుహాన్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియాల విలీనం
ఒప్పందాలపై పుతిన్‌ సంతకాలు
ఇక వాటిని మర్చిపోవాలని ఉక్రెయిన్‌కు సూచన

కీవ్‌: అంతా అనుకున్నట్టే జరిగింది. అమెరికా, పశ్చిమ దేశాలు గగ్గోలు పెట్టినా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కించెత్తయినా వెనక్కు తగ్గలేదు. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని లుహాన్స్క్‌, దొనెట్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియాలను తమ దేశంలో విలీనం చేసినట్టు ఆయన ప్రకటించారు. ఆ నాలుగు ప్రాంతాల అధినేతలతో కలిసి ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇందుకు సంబంధించిన విలీన ప్రక్రియను అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌లోని సెయింట్‌ జార్జ్‌ హాలులో శుక్రవారం వేడుకగా నిర్వహించారు. సంతకాల తర్వాత పుతిన్‌, నలుగురు నేతలు చేయిచేయి కలిపి.. ‘రష్యా, రష్యా’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. వేడుకకు హాజరైన వందల మంది గొంతు కలిపారు. పుతిన్‌ మాట్లాడుతూ- రెఫరెండాన్ని ఉక్రెయిన్‌ గౌరవించి, ఇకనైనా చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. అయితే, కొత్తగా విలీనమైన ప్రాంతాలను మాత్రం వదులుకోబోమని తెగేసి చెప్పారు. వాటిని మళ్లీ చేజిక్కించుకుందామనే ఆలోచనను విరమించుకోవాలన్నారు. ఆ ప్రాంతాలపై దాడికి దిగితే, తమ భూభాగంపై దురాక్రమణకు దిగినట్టే భావిస్తామని... అందుకు ప్రతిగా ‘అన్ని సాధనాలనూ’ ప్రయోగిస్తామని హెచ్చరించారు. తద్వారా అణు దాడికైనా సిద్ధమేనని పుతిన్‌ సందేశం ఇచ్చినట్టయింది. విలీనానికి సంబంధించిన ఒప్పందాలను ఆమోదించేందుకు రష్యా పార్లమెంటు వచ్చేవారం సమావేశమవుతుంది. అనంతరం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై అధ్యక్షుని హోదాలో పుతిన్‌ సంతకాలు చేస్తారు. విలీన ప్రకటనపై నాటో, ఐరోపా కూటమి మండిపడ్డాయి. ఇది చెల్లదని తెగేసి చెప్పాయి. రష్యా ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీసేలా అమెరికా, బ్రిటన్‌లు కఠిన ఆంక్షలు విధించాయి.

రెడ్‌ స్క్వేర్‌లో సంబరాలు...

నాలుగు ప్రాంతాల విలీనం సందర్భంగా రెడ్‌ స్క్వేర్‌లో శుక్రవారం రాత్రి సంబరాలు నిర్వహించారు. దీనికి వేల సంఖ్యలో జనం హాజరయ్యారు. రష్యా జెండాలను ఊపుతూ నినాదాలు చేశారు. దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ వేడుకలకు పుతిన్‌ కూడా హాజరయ్యారు.

తదుపరి లక్ష్యం పూర్తి డాన్‌బాస్‌?

లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ల మొత్తం భూభాగం డాన్‌బాస్‌లో 60% ఉంటుంది. సైనిక చర్యకు దిగిన తర్వాత... వాటి పక్కనున్న ఖేర్సన్‌, జపోరిజియాలను కూడా పుతిన్‌ సేనలు ఆక్రమించాయి. పారిశ్రామికంగా సంపన్నమైన మొత్తం డాన్‌బాస్‌కు విముక్తి కల్పించడమే తమ తదుపరి లక్ష్యమని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ చెప్పారు.

నాటో సభ్యత్వ దరఖాస్తుపై జెలెన్‌స్కీ సంతకం

తాజా పరిణామాల నేపథ్యంలో నాటో సత్వర సభ్యత్వ దరఖాస్తుపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంతకం చేశారు. ఉక్రెయిన్‌ భవిష్యత్తు యుద్ధక్షేత్రంలోనే నిర్ణయమవుతుందని ఆయన కార్యాలయం పేర్కొంది. ‘‘మా భూభాగాలకు విముక్తి కల్పించేందుకు పోరాటం కొనసాగుతుంది. మాత్రలు వేసుకునే సమయం వచ్చిన వారి (పుతిన్‌)పై మేము శ్రద్ధ చూపం. మా సైన్యం ముందుకెళ్తోంది’’ అని వ్యాఖ్యానించింది.


భీకర దాడులు... 30 మంది మృతి

నాలుగు ప్రాంతాల విలీనం సందర్భంగా క్రెమ్లిన్‌ వేడుక చేసుకుంటున్న వేళ... యుద్ధక్షేత్రంలో పుతిన్‌ సేనలకు గట్టి దెబ్బ తగిలింది. లేమన్‌ నగరాన్ని ఉక్రెయిన్‌ సేనలు మళ్లీ చేజిక్కించుకున్నాయి.  జపోరిజియాలో రష్యా ఆక్రమిత ప్రాంతాన్ని వీడి వెళ్లేందుకు కార్లలో సిద్ధంగా ఉన్నవారినీ, మానవతాసాయం అందించే కాన్వాయ్‌నూ లక్ష్యంగా చేసుకుని మాస్కో విరుచుకుపడింది. క్షిపణులు, బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. ఈ ఘటనలో 30 మంది మృతిచెందగా, 88 మంది గాయపడ్డారు. నిప్రో ప్రాంతంపైనా పుతిన్‌ సేనలు దాడులు చేపట్టాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని