అమెరికాలో ఆగని ఇయన్‌ విధ్వంసం

అమెరికాలో ఇయన్‌ హరికేన్‌ బీభత్సం కొనసాగుతోంది. ఫ్లోరిడాలో విధ్వంసం సృష్టించిన తరువాత శుక్రవారం దక్షిణ కరోలినా తీరప్రాంతంపై తన ప్రతాపం చూపింది.

Published : 02 Oct 2022 05:31 IST

దక్షిణ కరోలినాపై ప్రతాపం

ఇప్పటివరకూ 30 మందికిపైగా మృతి

ఛార్ల్‌స్టన్‌: అమెరికాలో ఇయన్‌ హరికేన్‌ బీభత్సం కొనసాగుతోంది. ఫ్లోరిడాలో విధ్వంసం సృష్టించిన తరువాత శుక్రవారం దక్షిణ కరోలినా తీరప్రాంతంపై తన ప్రతాపం చూపింది. అక్కడి చార్ల్‌స్టన్‌ నగరంలో భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. సముద్ర జలాలు వీధులను ముంచెత్తాయి. దీనికి భీకర గాలులు తోడవడంతో కొన్ని చోట్ల స్తంభాలు కూలిపోయాయి. వేల మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో గడిపారు. హరికేన్‌ ధాటికి కనీసం 30 మంది మరణించారు. ఫ్లోరిడాలోనే 27 మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ఆక్సిజన్‌ యంత్రాలు పనిచేయక ఇద్దరు వృద్ధ దంపతులు మృతి చెందారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఇయన్‌ హరికేన్‌ దక్షిణ కరోలినా నుంచి ఉత్తర కరోలినా వైపు వెళ్లే క్రమంలో బలహీనపడి ఉష్ణమండల అనంతర తుపాను(పోస్ట్‌-ట్రోపికల్‌ సైక్లోన్‌)గా మారింది. మరోవైపు ఫ్లోరిడాలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ధ్వంసమైన ఇళ్లలో శిథిలాల మధ్య చిక్కుకున్నవారిని రక్షించడానికి సహాయక సిబ్బంది పడవల్లో వెళ్లి గాలిస్తున్నారు. విద్యుత్తు సౌకర్యం లేక, ఆహార పదార్థాలు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గల్లంతైన తమవారి ఆచూకీ తెలియజేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో వినతులు వెల్లువెత్తుతున్నాయి.

అమెరికాలో నమోదైన అత్యంత శక్తిమంతమైన హరికేన్లలో ఒకటిగానే కాదు.. భారీ స్థాయిలో ఆస్తి నష్టాన్ని కలిగించినవాటిలో ఒకటిగా ఇయన్‌ నిలుస్తోందని అధికారులు చెప్పారు. ఈ హరికేన్‌ వల్ల 10 వేల కోట్ల డాలర్లకుపైగా ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు