క్రీడా చరిత్రలో పెను విషాదం

ఇండోనేసియాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఫుట్‌బాల్‌ మైదానంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు పోలీసులు సహా ఏకంగా 125 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 100 మంది తీవ్రగాయాల పాలయ్యారు. ప్రపంచ క్రీడా కార్యక్రమాల్లో ఇప్పటి వరకూ చోటు చేసుకున్న పెద్ద ప్రమాదాల్లో ఇది ఒకటని భావిస్తున్నారు.

Updated : 03 Oct 2022 07:28 IST

తొక్కిసలాటలో 125 మంది దుర్మరణం

100 మందికి తీవ్ర గాయాలు

విషమంగా 11 మంది పరిస్థితి

ఇండోనేసియా ఫుట్‌బాల్‌ మైదానంలో ఘటన

మలంగ్‌(ఇండోనేసియా): ఇండోనేసియాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఫుట్‌బాల్‌ మైదానంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు పోలీసులు సహా ఏకంగా 125 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 100 మంది తీవ్రగాయాల పాలయ్యారు. ప్రపంచ క్రీడా కార్యక్రమాల్లో ఇప్పటి వరకూ చోటు చేసుకున్న పెద్ద ప్రమాదాల్లో ఇది ఒకటని భావిస్తున్నారు.

తూర్పు జావా ప్రాంతంలో మలంగ్‌ నగరానికి చెందిన అరెమా ఫుట్‌బాల్‌ క్లబ్‌కు చెందిన జట్టు సురబాయ క్లబ్‌కు చెందిన పెర్సెబాయ జట్టు చేతిలో 3-2 తేడాతో శనివారం రాత్రి ఓడిపోయింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన అరెమా జట్టు అభిమానులు(అరెమానియా) ఆటగాళ్లు, సాకర్‌ అధికారులపై సీసాలు, ఇతర వస్తువులు విసిరేయడం ప్రారంభించారు. కొందరు అభిమానులు కంజురుహాన్‌ స్టేడియంలోకి దూసుకెళ్లి సొంతప్రాంతంలో 23 ఏళ్లుగా పెర్సెబాయపై ఓటమి ఎరుగని జట్టు ఇప్పుడెందుకు ఓడిపోయిందో చెప్పాలంటూ నిర్వాహకులను నిలదీశారని ప్రత్యక్షసాక్షులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రేక్షకులను చెదరగొట్టేందుకు స్టాండ్లతో సహా మైదానంలో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు(సాకర్‌ మైదానాల్లో బాష్పవాయువును వినియోగించడాన్ని ఎఫ్‌ఐఎఫ్‌ఏ నిషేధించింది). అంతేకాకుండా లాఠీలకూ పనిచెప్పారు. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు చెలరేగి వారంతా బయటకు వెళ్లేందుకు స్టేడియం ద్వారాలవైపు పరుగులు తీశారు. ఈక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఇద్దరు పోలీసు అధికారుల సహా 34 మంది అక్కడికక్కడే అసువులు బాశారు. 300 మందిని స్థానిక ఎనిమిది అసుపత్రులకు తరలించారు. వారిలో 91 మంది చికిత్స పొందుతూ చనిపోయారు. 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరోపక్క స్టేడియం బయట కూడా హింస చెలరేగి సుమారు అయిదు పోలీసు వాహనాలు తగలబడ్డాయి. శని, ఆదివారాల్లో మొత్తం 174 మంది మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని మృతదేహాల్ని ఒకసారికి మించి లెక్కించడంతో మరణించినవారి సంఖ్య అంత వచ్చిందని, వాస్తవానికి ఇప్పటి వరకూ 125 మందే చనిపోయారని స్థానిక అధికారులు ధ్రువీకరించారు. ఘటన సమయంలో దాదాపు మూడువేల మంది మైదానంలోకి చొచ్చుకువచ్చారని.. వారిని అదుపు చేసేందుకే టియర్‌ గ్యాస్‌ ప్రయోగించామని పోలీసులు తెలిపారు. ఘటనపై‘‘ఫుట్‌బాల్‌తో సంబంధం గల అందరికి దుర్దినం, అంతులేని విషాదం’’ అని ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య పేర్కొంది. ఈ ఘోర ప్రమాదంపై ఇండోనేసియా అధ్యక్షుడు జాకో విడోడో దర్యాప్తునకు ఆదేశించారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts