ఎముకలు విరిచి.. ఇనుప కమ్మీలతో కాల్చి..

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా సైన్యం పాల్పడిన మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఖర్కివ్‌ ప్రాంతంలోని ఇజియం నగరంలో యుద్ధఖైదీలను, పౌరులును చిత్రవధ చేసిన చిత్రహింసా కేంద్రాలు బయటపడ్డాయి. వీటిల్లో సూర్యకిరణాలు ప్రసరించని మట్టి మరుగుదొడ్లు, మూత్రం, కుళ్లిన ఆహారం, భూగర్భజైలు, పోలీస్‌ స్టేషన్‌ ఉన్నాయి.

Updated : 03 Oct 2022 09:03 IST

 ఇజియం చిత్రహింసా కేంద్రాల్లో రష్యా ఘోరాలు

ఇవి యుద్ధనేరాలే అంటున్న ఐక్యరాజ్యసమితి

కీవ్‌: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా సైన్యం పాల్పడిన మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఖర్కివ్‌ ప్రాంతంలోని ఇజియం నగరంలో యుద్ధఖైదీలను, పౌరులును చిత్రవధ చేసిన చిత్రహింసా కేంద్రాలు బయటపడ్డాయి. వీటిల్లో సూర్యకిరణాలు ప్రసరించని మట్టి మరుగుదొడ్లు, మూత్రం, కుళ్లిన ఆహారం, భూగర్భజైలు, పోలీస్‌ స్టేషన్‌ ఉన్నాయి. ఏడు నెలల పాటు ఇజియం రష్యా ఆక్రమణలో ఉంది. ఆ సమయంలోనే ఉక్రెయిన్‌ సైనికులతో పాటు సాధారణ పౌరులనూ రష్యన్లు చిత్రహింసలకు గురిచేశారని తెలుస్తోంది. ‘‘వాళ్లు నన్ను నిర్బంధించారు. ఇనుపరాడ్లతో చర్మాన్ని కొంచెం కొంచెం కాల్చేవారు’’ అని ఈ కేంద్రం నుంచి బయటపడిన ఉక్రెయిన్‌ సైనికుడొకరు తెలిపారు. ఈ కేంద్రాల్లో 8 మంది మృతి చెందినట్లు ఏపీ వార్తాసంస్థ ధ్రువీకరించింది.

* ఇజియంను ఉక్రెయిన్‌ స్వాధీనం చేసుకున్నప్పుడు నగర శివార్లలోని అటవీ ప్రాంతంలోని 447 సమాధులు కనిపించాయి. అందులో 30 మృతదేహాలపై చిత్రహింసలకు గురి చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. చేతులు కట్టేసినట్లు, అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చిన గాయాలు, కత్తిగాట్లు, విరిగిపోయిన అవయవాలు కనిపించినట్లు ఖర్కివ్‌లో ప్రాసిక్యూషన్‌ కార్యాలయం తెలిపింది. సామూహిక ఖననాలు చేసిన చోట మృతదేహాల చేతులు కట్టేసి ఉన్నట్లు పేర్కొంది. ఇదే నగరంలో మరో రెండు భారీ సామూహిక శ్మశానవాటికలు బయటపడినట్లు ఉక్రెయిన్‌ అధికారవర్గాలు తెలిపాయి. ఇక గాయపడిన వందలాది మందికి చికిత్స చేసిన వైద్యుడు కూడా మాస్కో సైనికుల చిత్రహింసలను ధ్రువీకరించారు. తన వద్దకు చేతులు, కాళ్లపై తుపాకీ గాయాలు, విరిగిన ఎముకలు, తీవ్రమైన కాలిన గాయాలతో వచ్చేవారని తెలిపారు. ఈ గాయాలు ఎలా అయ్యాయో చెప్పేవారు కాదన్నారు. గాయాలతో వచ్చిన సైనికులు కూడా అవి ఎలా అయ్యాయో చెప్పేందుకు ఇష్టపడలేదని వైద్యుడు తెలిపారు. ‘‘ఓ సైనికుడు వచ్చాడు. చేతులకు సంకెళ్లు వేయడంతోనే అతనికి గాయాలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయినా ఏం జరిగిందో చెప్పటానికి తిరస్కరించాడు’’ అని వైద్యుడు కుజెనొత్సోవ్‌ పేర్కొన్నారు.

* యుద్ధ సమయాల్లో మూడు కారణాలతో చిత్రహింసలకు గురిచేస్తారని ఉక్రెయిన్‌లోని ఐక్యరాజ్యసమితి(ఐరాస) మానవ హక్కుల ప్రతినిధి తెలిపారు. ఒకటి తమకు అవసరమైన సమాచారం కోసం, రెండు శిక్షించటంతోపాటు భయపెట్టేందుకు, మూడు ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలియాలన్నదే చిత్రహింసల ముఖ్య ఉద్దేశమన్నారు. ఉక్రెయిన్‌ సైనికులను లేదా పౌరులను చిత్రహింసలకు గురిచేసిన తర్వాత వదిలిపెట్టినప్పటికీ ఆ విషయం ఎవరికి చెప్పొద్దని రష్యా సైనికులు బెదిరించేవారని కొందరు బాధితులు తెలిపారు. జెనీవా చట్టాల ప్రకారం సాయుధపోరాట సమయంలో యుద్ధ ఖైదీలను, సాధారణ పౌరులను చిత్రహింసలకు గురిచేస్తే అది యుద్ధ నేరంగా పరిగణిస్తారు. రష్యన్‌ సైనికులు ఇజియంలో చేసిన ఘోరాలు కూడా యుద్ధనేరాల కిందకే వస్తాయని ఐరాస ప్రతినిధి పేర్కొన్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts