సంక్షిప్త వార్తలు (4)

వైద్యరంగ అవసరాలు, ఒత్తిడి పెరిగిన దృష్ట్యా సింగపూర్‌ మూడేళ్ల వ్యవధిలో భారత్‌ నుంచి 180 మంది జూనియర్‌ డాక్టర్లను నియమించుకునే యోచన చేస్తోంది.

Updated : 05 Oct 2022 06:56 IST

భారత్‌ నుంచి సింగపూర్‌కు 180 మంది జూనియర్‌ డాక్టర్లు

సింగపూర్‌: వైద్యరంగ అవసరాలు, ఒత్తిడి పెరిగిన దృష్ట్యా సింగపూర్‌ మూడేళ్ల వ్యవధిలో భారత్‌ నుంచి 180 మంది జూనియర్‌ డాక్టర్లను నియమించుకునే యోచన చేస్తోంది. అక్టోబర్‌ 10తో ముగియనున్న టెండరు ప్రకారం.. ఏటా 60 మంది వైద్య అధికారులను భారత్‌ నుంచి నియమించుకోనున్నారు. సింగపూర్‌ ప్రజారోగ్య విభాగానికి చెందిన ఎం.ఒ.హెచ్‌.హోల్డింగ్స్‌ కంపెనీ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. ఒక్క భారత్‌ నుంచే కాకుండా ఆస్ట్రేలియా, బ్రిటన్‌ల నుంచి కూడా తాము వైద్యులను నియమించుకొంటున్నట్లు తెలిపింది. సింగపూర్‌ మెడికల్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన వైద్య కళాశాలల నుంచి వచ్చిన స్థానిక పట్టభద్రులకు ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించింది. భారత వైద్యుల ‘దిగుమతి’ నిర్ణయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు ప్రశ్నించారు. స్థానిక వైద్య కళాశాలల్లో సీట్లు పెంచుకోవచ్చు కదా అని మరికొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సింగపూర్‌ వైద్యవర్గాల్లోనూ ఈ టెండరుపై ఆందోళన వ్యక్తమవుతోంది.


మా సొమ్ము మాకివ్వండి
లెబనాన్‌లో బ్యాంకులపై డిపాజిటర్ల దాడులు

బీరుట్‌: లెబనాన్‌లో తమ డబ్బు తమకివ్వాలంటూ నాలుగు బ్యాంకులపై డిపాజిటర్లు దాడులకు పాల్పడ్డారు. దేశంలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది. డాలర్‌తో పోలిస్తే లెబనీస్‌ పౌండ్‌ 90 శాతం విలువను కోల్పోయింది. అక్కడి జనాభాలో 75 శాతం మంది పేదరికంలోకి కూరుకుపోయారని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతుండగా.. లక్షల మంది జీవనం దుర్భరంగా మారింది. నగదు లేమి కారణంగా ఉపసంహరణలపై బ్యాంకులు పరిమితులు విధించాయి. సెప్టెంబరు నెలాఖరులో కొందరు డిపాజిటర్లు చొరబడి బలవంతంగా సొమ్ము తీసుకోవడంతో బ్యాంకులను వారం రోజులపాటు మూసివేశారు. తాజాగా కొన్ని శాఖలను తెరవగా.. వాటిలోకి డిపాజిటర్లు చొరబడి తమ పొదుపు ఖాతాల్లోని సొమ్మును బలవంతంగా తీసుకునేందుకు యత్నిస్తున్నారు. కొందరు తుపాకులతో సిబ్బందిపై బెదిరింపులకు దిగుతున్నారు. బ్యాంకుల్లోకి డిపాజిటర్ల చొరబాట్లకు ‘డిపాజిటర్స్‌ ఔట్‌క్రై’ లాంటి సంస్థలు మద్దతు పలుకుతున్నాయి.


ఉపగ్రహ కక్ష్యలు మార్చే ‘స్పేస్‌ టగ్‌’!
ప్రయోగించిన ఇరాన్‌

టెహ్రాన్‌: వివిధ కక్ష్యల మధ్య ఉపగ్రహాలను బదిలీ చేసే సామర్థ్యమున్న ఒక స్పేస్‌ టగ్‌ను ఇరాన్‌ ప్రయోగించినట్లు ఇక్కడి అధికార మీడియా పేర్కొంది. ‘సమన్‌’ అనే ఈ ప్రయోగాత్మక వ్యోమనౌకను తమ అంతరిక్ష పరిశోధన కేంద్రం నిర్మించిందని, సోమవారం దీన్ని ప్రయోగించామని తెలిపింది. ఈ టగ్‌ను భవిష్యత్‌లో పరీక్షిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తంచేసింది. ఇరాన్‌ చాలా కాలంగా అంతరిక్ష కార్యక్రమాలను నిర్వహిస్తోంది. శాంతియుత అవసరాలకే దీన్ని చేపడుతున్నామని చెబుతోంది. అయితే ఈ ముసుగులో తన బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళుతుందేమోనని అమెరికా ఆందోళన చెందుతోంది. ఈ ఏడాది జూన్‌లో ఇరాన్‌ ఒక ఘన ఇంధన రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపింది. ఆగస్టులో రష్యన్‌ రాకెట్‌ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించింది.


ఈక్వెడార్‌ జైల్లో గొడవ.. 15 మంది మృతి
మరో 20 మందికి గాయాలు

క్విటో: మధ్య ఈక్వెడార్‌లోని లాటకుంగా జైల్లోని ఖైదీల మధ్య చెలరేగిన గొడవ హింసకు దారితీసింది. తుపాకులు, కత్తులతో వారు పరస్పరం గొడవలకు దిగడంతో కనీసం 15 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి. సోమవారం జరిగిన ఈ ఘటనను... అధికారం-డ్రగ్‌ పంపిణీ హక్కులపై ఆధిపత్యం కోసం జైల్లోని జాతీయ, అంతర్జాతీయ మత్తుమందు స్మగ్లర్ల బృందాల మధ్య జరిగిన ఘర్షణగా పేర్కొన్నాయి.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని